
ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో బయోమెట్రిక్!
ఒక్కో కాలేజీకి 4 సీసీ కెమెరాలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని 402 ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో విద్యార్థులు, లెక్చరర్ల హాజరు శాతాన్ని పెంచేందుకు బయోమెట్రిక్ విధానం అమలు చేసేందుకు ఇంటర్మీడియెట్ విద్యాశాఖ చర్యలు చేపట్టింది. ఇందుకోసం ఓ ప్రైవేటు కంపెనీని ఎంపిక చేసింది. దీంతోపాటు రాష్ట్రంలో ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో సీసీ కెమెరాలు అమర్చేందుకు ఏర్పాట్లు చేసింది. ఒక్కో కాలేజీలో 4 సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. వాటిని ప్రవేశ ద్వారం/వరండాలో, స్టాఫ్ రూమ్‌లో, ప్రిన్సిపల్ రూమ్‌లో, ప్రవేశ ద్వారం వెనుక భాగంలో ఏర్పాటు చేసుకోవాలని ఇంటర్మీయెట్ విద్యా కమిషనర్ డాక్టర్ అశోక్ ఇటీవల మెమో జారీ చేశారు.
కాగా స్టాఫ్‌రూమ్‌లో సీసీ కెమెరాలు ఎందుకని ప్రభుత్వ జూనియర్ లెక్చరర్ల సంఘం అధ్యక్షుడు మధుసూదన్‌రెడ్డి ప్రశ్నించారు. రాష్ట్రంలోని 52 కాలేజీల్లో విద్యుత్తు సరఫరానే లేకుండా, 220 కాలేజీల్లో కంప్యూటర్లు లేకుండా సీసీ కెమెరాలు పెట్టి ఏం చేస్తారని ప్రశ్నించారు.