
విలీన ప్రాంత ప్రజలకు 'చేదు అనుభవం'
రాజమండ్రి (నెల్లిపాక) : విలీన మండలాల ప్రజలు కనీస వైద్య సౌకర్యానికి నోచుకోలేకపోతున్నారు. ఇటు ఆంధ్రా అధికారులు పట్టించుకోకపోవడం , అటు తెలంగాణ ప్రాంతం వారు కనికరించకపోవడంతో విలీన ప్రాంత ప్రజల ప్రాణాలు గాలిలో దీపాలుగా మారుతున్నాయి. పాముకాటుకు గురైన ఓ బాలిక చావుబతులకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న పరిస్థితే ఇందుకు నిదర్శనం.
మండల పరిధిలోని కుసుమనపల్లి గ్రామానికి చెందిన పూసం శ్రీను సీతమ్మ దంపతుల కుమారై రోనామేరీ స్థానికంగా ఒకటో తరగతి చదువుతోంది. శుక్రవారం రాత్రి ఇంటి ముందు ఆడుకుంటుండంగా పాము కాటేసింది. కుటుంబసభ్యులు 108 వాహనానికి సమాచారం ఇచ్చారు. ఆ గ్రామానికి తెలంగాణ ప్రాంత వాహనమే వచ్చే అవకాశం ఉందని, వారు అక్కడికి రావడానికి నిరాకరిస్తున్నారని సమాధానం చెప్పారు.
దీంతో బాలికను ద్విచక్ర వాహనంపై భద్రాచలం ఏరియా ఆస్పత్రికి తీసుకువెళ్లారు. ఆంధ్ర ప్రజలకు ఇకడ వైద్యం చేయమని వైద్య సిబ్బంది తెగేసి చెప్పారు. దీంతో వారు చేసేదేమీలేక స్థానికంగా ఉన్న ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు. తమ బిడ్డ పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారని తండ్రి శ్రీనివాస్ వివరించాడు.