'ప్రభుత్వ మార్పుతో రాష్ట్రం మార్చుకోండి'
బీహార్: ఎలాగైనా బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి తమ జెండా పాతేయాలని చూస్తున్న బీజేపీ ఎన్నికల ప్రచారం కోసం నినాదాన్ని సిద్ధం చేసి విడుదల చేసింది. ఆ నినాదాన్ని ప్రతి చోట వీధుల్లో, భవంతులపైన, రహదారి పక్కన, పెద్ద పెద్ద హోర్డింగ్ల రూపంలో ఏర్పాటు చేయనుంది. ఇంతకీ ఏమిటా నినాదం అనుకుంటున్నారా.. కేవలం నాలుగు పదాలతో ఆ నినాదాన్ని రూపొందించారు. అదే ' ప్రభుత్వాన్ని మార్చండి.. బీహార్ను మార్చండి(బదలియే సర్కార్, బదలియే బీహార్)'.
గతంలో దేశ వ్యాప్తంగా జరిగిన సాధారణ ఎన్నికల్లో కూడా మార్పు అనే నినాదంతో వచ్చిన ఎన్డీయే ప్రభుత్వం.. తిరిగి అదే నినాద మంత్రంతో బీహార్లో పాగా వేస్తుందేమో ఎదురు చూడాల్సిందే. వచ్చే నెలలో బీహార్ ఎన్నికలు జరగనున్నాయి. మరోపక్క, ఇప్పటి వరకు తాను ఏమేం అభివృద్ధి పనులు చేశానో నేరుగా ఫ్లెక్సీల రూపంలో ప్రజలకు తెలియజేసేందుకు అటు ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ సిద్ధం అవుతున్నారు. 'బూటకపు వాగ్దానాలపై నమ్మకం ఇక చాలు మరోసారి నితీశ్ ప్రభుత్వానికి పట్టం కట్టండి. మహిళలు సురక్షితంగా ఉండాలంటే నితీశ్కు ఓటెయండి' అంటూ ఫ్లెక్సీలు సిద్ధం చేశారు.