nitish versus modi
-
అస్సలు ఊహించలేదు: చిరాగ్
పట్నా: బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో మహాకూటమి ఈ స్థాయిలో ఫలితాలు సాధిస్తుందని ఏమాత్రం ఊహించలేదని ఎన్డీయే కూటమిలోని జేఎల్పీ నేత చిరాగ్ పాశ్వాన్ (రావిలాస్ పాశ్వాన్ కుమారుడు) వ్యాఖ్యానించారు. ఎన్డీయే ఓటమికి కారణాలను ఇప్పుడే ఊహించలేమని ఆయన ఆదివారమిక్కడ అన్నారు. స్పష్టమైన మెజార్టీ సాధించిన మహాకూటమి నేతలు నితీష్ కుమార్, లాలు ప్రసాద్ యాదవ్‌కు ఈ సందర్భంగా చిరాగ్ పాశ్వాన్ అభినందనలు తెలిపారు. ఇప్పటివరకూ మహాకూటమి 35, బీజేపీ 10, ఇతరులు ఒక స్థానాన్ని కైవసం చేసుకుంది. -
'మమ్మల్ని పరిచయం చేసుకున్నాం'
హైదరాబాద్ : బిహార్ అసెంబ్లీ ఎన్నికలకు ఆలస్యంగా బరిలోకి దిగడం వల్లే ఆశించిన ఫలితాలు సాధించలేకపోయామని ఎంఐఎం అధ్యక్షుడు, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. ఆయన ఆదివారమిక్కడ మీడియాతో మాట్లాడుతూ ఈ ఎన్నికల ద్వారా బిహార్ ప్రజలకు తమని పరిచయం చేసుకున్నామన్నారు. రాబోయే రోజుల్లో బిహార్‌లో ఎంఐఎంను బలోపేతం చేస్తామన్నారు. ఈ ఫలితాలు నరేంద్ర మోదీకి వ్యక్తిగత ఓటమి అని ఓవైసీ వ్యాఖ్యానించారు. ఈ ఎన్నికల ద్వారా ప్రధాని మోదీకి ముస్లింలు గుణపాఠం చెప్పారన్నారు. కాగా బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎంఐఎం ఆరుగురు అభ్యర్థులను బరిలోకి దించిన విషయం తెలిసిందే. అక్తర్ ఉల్ ఇమాన్(కోచదామన్), తసీరుద్దీన్(కిషన్‌గంజ్), డాక్టర్ అమిత్ పాశ్వాన్(రాణిగంజ్), గులామ్ సర్వార్(బైసి), నవాజిష్ ఆలం(అమోర్), ఎండీ ఆదిల్ (బల్ రామ్‌పూర్) పోటీ చేశారు. అయితే ఎంఐఎం మాత్రం ఖాతా తెరవలేకపోయింది. ఒక్క స్థానంలో మాత్రమే కొద్దిసేపు ఆధిక్యం కొనసాగినా తర్వాత పోటీలో నిలబడలేకపోయింది. -
నితీష్‌కు కేసీఆర్, చంద్రబాబు అభినందనలు
హైదరాబాద్ : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదివారం మహాకూటమి నేతలు నితీష్ కుమార్, లాలుప్రసాద్ యాదవ్ కు అభినందనలు తెలిపారు. మంచి పాలన అందించినందుకే మరోమారు ప్రజలు నితీష్‌కు పట్టం కట్టారని ఆయన అన్నారు. అలాగే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా నితీష్ కుమార్‌ను అభినందించారు. కాగా బిహార్ ఎన్నికల్లో జేడీయూ కంటే ఆర్జేడీనే ఎక్కువ స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. బీజేపీ మూడో స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. -
మాంఝీ బోణీ కొట్టారు..
పట్నా: బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో మహాకూటమి భాగస్వామి హెచ్ఏఎం నేత జితన్ రాం మాంఝీ బోణీ కొట్టారు. ఇమాంగంజ్ నియోజకవర్గంలో ఆయన విజయం సాధించారు. 18,278 ఓట్ల మెజార్టీతో మాంఝీ గెలుపొందారు. జేడీయూ అభ్యర్థి ఉదయ్ నారాయణ చౌదరికి 10,198 ఓట్లు రాగా, బీఎస్పీ నుంచి పోటీ చేసిన మధురా పాశ్వాన్ కేవలం 576 ఓట్లు పొందారు. మరోవైపు మఖ్దుంపూర్ నియోజకవర్గం నుంచి కూడా బరిలో ఉన్న మాంఝీ అక్కడ మాత్రం వెనకంజలో ఉన్నారు. -
ఢిల్లీ సీఎం జోస్యం నిజమైంది!
పట్నా : బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో మహాకూటమి స్పష్టమైన మెజార్టీ దిశగా దూసుకెళుతోంది. దీంతో బిహార్ ముఖ్యమంత్రి, జేడీయూ అధినేత నితీష్ కుమార్‌కు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ అధ్యక్షుడు ఆదివారం నితీష్ కుమార్‌కు అభినందనలు తెలిపారు. ఇది చారిత్రాత్మక విజయం అని కేజ్రీవాల్ వ్యాఖ్యానించారు. కాగా ఢిల్లీ వాసులంతా బీహార్‌లో ఉన్న తమ బంధుమిత్రులకు ఫోన్ చేసి నితీష్‌కు ఓటు వేయాలంటూ బిహార్ ఎన్నికల సందర్భంగా కేజ్రీవాల్ విజ్ఞప్తి కూడా చేశారు. అలాగే బిహార్ ఎన్నికల ప్రచారంలో కూడా ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా బిహార్ ఎన్నికల్లో ఎన్డీయే కూటమికి ఓటమి తప్పదని, నితీష్ కుమార్ గెలుపు ఖాయమంటూ జోస్యం చెప్పిన విషయం తెలిసిందే. మరోవైపు శివసేన కూడా బిహార్ ఫలితాలపై స్పందించింది. నితీష్ కుమార్ పొలిటికల్ హీరో అంటూ అభివర్ణించింది. బిహార్ ఓటమికి ప్రధాని మోదీ బాద్యత వహించాలని, నితీష్ గొప్ప విజయాన్ని సాధించారని శివసేన వ్యాఖ్యానించింది. -
లాలు ముఖంలో 'లాంతరు' వెలుగు
పట్నా: ఆర్జేడీ అధినేత, ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి లాలు ప్రసాద్ యాదవ్ ముఖంలో 'లాంతరు' వెలుగులు నింపింది. లాంతరు గుర్తుతో లాలు ఎన్నికల బరిలోకి దిగిన విషయం తెలిసిందే. బీహార్ రాష్ట్రంలోని మొత్తం 243 అసెంబ్లీ స్థానాలకుగాను ఆర్జేడీ వంద స్థానాలకు, జేడీయూ మరో వంద స్థానాలకు పోటీ చేస్తుండగా, కాంగ్రెస్ పార్టీ 40 స్థానాలకు పోటీ చేసింది. ఇక బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో మహాకూటమి విజయం దిశగా పయనిస్తోంది. ప్రస్తుతం మహాకూటమి 161, ఎన్డీయే 72, ఇతరులు 10 స్థానాల్లో ముందంజలో ఉన్నారు. స్పష్టమైన మెజార్టీతో మహాకూటమి దూసుకు పోతోంది. ఎన్డీయే కూటమి వందలోపు స్థానాలతోనే సరిపెట్టుకునేలా ఉంది. మహాకూటమి ఆధిక్యంలో కొనసాగుతుండటంతో పట్నాలో సంబరాలు మిన్నంటుతున్నాయి. -
వాట్ ఏ కమ్ బ్యాక్ ఫర్ జేడీయూ..
న్యూఢిల్లీ : బిహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్ స్పందించారు. జేడీయూ మళ్లీ పుంజుకుందంటూ ఆయన ట్విట్ చేశారు. గంటలోనే వారి ఆధిక్యం ఎన్డీయే కూటమిని దాటేసిందని ఆయన అన్నారు. అయితే ప్రజల తీర్పును గౌరవిస్తామని రాంమాధవ్ తెలిపారు. ప్రస్తుతం మహాకూటమి 159, ఎన్డీయే 84, ఇతరులు 10 స్థానాల్లో లీడ్‌లో ఉన్నారు. మరోవైపు పట్నాలో మహాకూటమి శ్రేణులు సంబరాలు జరుపుకుంటున్నాయి. జేడీయూ, ఆర్జేడీ, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, పార్టీ జెండాలతో పట్టుకుని, పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. -
నితీష్ నివాసం వద్ద సంబరాలు
పట్నా: ముఖ్యమంత్రి, జేడీయూ నేత నితీష్ కుమార్ నివాసం వద్ద సంబరాలు అంబరాన్ని అంటుతున్నాయి. బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో మహాకూటమి ఆధిక్యం కొనసాగుతుండటంతో పార్టీ నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున జేడీయూ ప్రధాన కార్యాలయానికి చేరుకుంటున్నారు. ఈ సందర్భంగా వారు మిఠాయిలు పంచుకుంటూ, రంగులు చల్లుకుంటూ, బాణాసంచా పేల్చుతూ సంబరాలు చేసుకుంటున్నారు. ప్రస్తుతం మహాకూటమి 151, ఎన్డీయూ కూటమి 81, ఇతరులు 8 స్థానాల్లో ముందంజలో ఉన్నారు. అలాగే ఢిల్లీలోని కాంగ్రెస్ కార్యాలయం వద్ద కూడా పార్టీ శ్రేణులు సంబరాలు జరుపుకుంటున్నారు. -
ఇదేముంది... మాదే హవా: మిసా భారతి
పట్నా: బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో 140 స్థానాల కంటే ఎక్కువే కైవసం చేసుకుంటామని ఆర్జేడీ అధినేత లూలూ ప్రసాద్ యాదవ్ కుమార్తె మిసా భారతి తెలిపారు. ప్రస్తుతం మహాకూటమి 143, ఎన్డీయే 87, ఇతరులు 8 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. దీనిపై మిసా భారతి స్పందిస్తూ దిసీజ్ నథింగ్... అంటూ బిహార్‌లో విజయం తమదేనంటూ హర్షం వ్యక్తం చేశారు. మరోవైపు పట్నాలోని ఆర్జేడీ ప్రధాన కార్యాలయం వద్ద పార్టీ నేతలు, శ్రేణులు సంబరాలు జరుపుకుంటున్నారు. లాలూ నివాసానికి మిఠాయిలు, చేపలుతో పార్టీ కార్యకర్తలు, నేతలు క్యూ కడుతున్నారు. -
150 సీట్లు మావే: శరద్ యాదవ్
పట్నా: బిహార్ ప్రజలకు జనతా దళ్ (యునైటెడ్) అధ్యక్షుడు శరద్ యాదవ్ అభినందనలు తెలిపారు. ప్రస్తుత లీడింగ్ చూస్తుంటే మహాకూటమి 150 స్థానాలు గెలుచుకుంటుందని ఆయన ఆదివారమిక్కడ అన్నారు. కాగా మహాకూటమి 138, ఎన్డీయే కూటమి 89, ఇతరులు 7 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్నారు. కాగా ఓట్ల లెక్కింపులో ముందు ఎన్డీయే కూటమి ఆధిక్యం కొనసాగగా... ఆ తర్వాత మహాకూటమి పుంజుకుంది. మరోవైపు మహాకూటమి రేసులో ముందు ఉండటంతో పార్టీ శ్రేణులు సంబరాలు జరుపుకుంటున్నాయి. మిఠాయిల పంచుకుని, పఠాసులు కాల్చుతున్నాయి. -
దూసుకుపోతున్న తండ్రీకొడుకులు
పట్నా: బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఇమామ్ గంజ్, ముఖ్దుంపూర్ నియోజకవర్గాల నుంచి బరిలో ఉన్న బీజేపీ పార్టీ భాగస్వామి హెచ్ఏఎం నేత జితన్ రాం మాంఝీ ముందంజలో దూసుకు పోతున్నారు. అలాగే ఆయన కుమారుడు సంతోష్ సుమన్ కూడా ఆధిక్యంలో ఉన్నారు. సంతోష్ సుమన్ కుతుంబా నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. ఇక ఆర్జేడీ నేత లాలూ ప్రసాద్ యాదవ్ కుమారుడు తేజస్వి ప్రసాద్ యాదవ్ వెనుకంజలో ఉన్నారు. రాఘోపూర్ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగిన తేజస్వి ...ముందుగా ఆధిక్యంలో కొనసాగినా... ఆ తర్వాత వెనకబడ్డారు. -
విజయం మాదే: రవిశంకర్ ప్రసాద్
న్యూఢిల్లీ : బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే కూటమిదే విజయమని కేంద్ర టెలికం, ఐటీ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ జోస్యం చెప్పారు. ఆయన ఆదివారమిక్కడ మాట్లాడుతూ బిహార్ ప్రజలు మార్పును కోరుకుంటున్నారని అన్నారు. గెలుపు తప్పదని, ఎన్నికల ఫలితాలు మొత్తం రాజకీయాల్లోనే మార్పు తెస్తుందని రవిశంకర్ ప్రసాద్ వ్యాఖ్యానించారు. పార్టీ అధ్యక్షుడు అమిత్ షా బిహార్ ప్రచార బాధ్యతలను చక్కగా నిర్వర్తించినందుకు గర్వంగా ఉందన్నారు. కాగా మహా కూటమి 97, ఎన్డీయే కూటమి 91, ఇతరులు 8 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నారు. -
సంబరాలు మొదలెట్టేసిన బీజేపీ...
పట్నా: ఆధిక్యంలో కొనసాగుతున్న భారతీయ జనతా పార్టీ అప్పుడే గెలుపు సంబరాలు మొదలుపెట్టింది. బిహార్ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపులో బీజేపీ ఆధిక్యం కొనసాగుతున్న విషయం తెలిసిందే. దీంతో పట్నాలో బీజేపీ కార్యాలయం వద్ద ఆదివారం ఉదయం పార్టీ శ్రేణులు బాణాసంచా కాల్చుతూ సంబరాలు జరుపుకుంటున్నారు. బీజేపీకీ అనుకూలంగా నినాదాలు చేస్తూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతానికి ఎన్డీయే 55, మహాకూటమి 35, ఇతరులు 2 స్థానాల్లో ముందంజలో ఉన్నాయి. ఇక పట్నా నియోజకవర్గంలో బీజేపీ తరఫున బరిలోకి దిగిన నందకిషోర్ యాదవ్ ఆధిక్యంలో దూసుకు పోతున్నారు. -
లాలూ నివాసానికి మిఠాయిలు
పట్నా: బిహార్ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్‌లో ఎన్డీయే కూటమి ఆధిక్యంలో కొనసాగుతోంది. అయితే గెలుపుపై ధీమాగా ఉన్న మహాకూటమి నేత, ఆర్డేజీ అధినేత లాలూ ప్రసాద్ నివాసానికి ...అప్పుడే మిఠాయిలు వచ్చిపడుతున్నాయి. ఎన్నికల్లో తమదే విజయమని, నితీష్ కుమారే కాబోయే ముఖ్యమంత్రి అంటూ లాలూ ఇప్పటికే జోస్యం చెప్పిన విషయం తెలిసిందే. దీంతో గెలుపుపై భరోసాగా ఉన్న లాలూ ఇంటికి... పార్టీ శ్రేణులు సంబరాలు చేసుకునేందుకు పెద్ద ఎత్తున స్వీట్స్ తో ఆయన నివాసానికి చేరుకుంటున్నారు. కాగా పట్నా పీఠాన్ని విజయగర్వంతో అధిరోహించేదెవరో మరికొద్ది గంటల్లో తేలనుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీయే స్వయంగా రంగంలోకి దిగి ప్రచార బాధ్యతలు చేపట్టిన ఎన్డీయే కూటమి ఒకవైపు.. సీఎం నితీశ్ సచ్ఛీలతను, సుపరిపాలనను, లాలూ ప్రసాద్ కుల సమీకరణాలను నమ్ముకున్న మహా లౌకిక కూటమి మరోవైపు నిలిచి.. హోరాహోరీగా సాగించిన ఎన్నికల పోరాటంలో బిహార్ ప్రజలెటు నిలిచారనేది తేలనుంది. మోదీ వర్సెస్ నితీశ్ ఫైట్‌లో విజేత ఎవరో తేలనుంది. -
బిహార్ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభం
పట్నా: బిహార్ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. మొత్తం 243 స్థానాలకు సంబంధించి 62,780 ఈవీఎంలలో నిక్షిప్తమైన ఓట్ల కౌంటింగ్ ఆదివారం ఉదయం 8 గంటలకు ఆరంభమైంది. మధ్యాహ్నంలోపు మెజారిటీ స్థానాల్లో ఫలితం తేలుతుంది. బిహార్ అసెంబ్లీకి అక్టోబర్ 12 నుంచి నవంబర్ 5 వరకు మొత్తం ఐదు దశల్లో ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. ఐదు దశల్లో కలిపి రికార్డ్ స్థాయిలో, అత్యధికంగా 56.8% పోలింగ్ నమోదైంది. 272 మంది మహిళలు సహా మొత్తం 3450 మంది అభ్యర్థులు ఈ ఎన్నికల్లో పోటీ చేశారు. బిహార్ ఎన్నికల చరిత్రలోనే హత్యలు, హింస లేని ఎన్నికలు కూడా ఇవే. కాగా ఫలితాలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. కాగా జేడీయూ-ఆర్జేడీ కూటమి గెలుపుపై లాలూ ప్రసాద్ యాదవ్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. మహా కూటమిదే విజయమని, నితీష్ కుమారే కాబోయే ముఖ్యమంత్రి అంటూ జోస్యం చెప్పారు. కాగా ఇప్పటి వరకూ బీజేపీ ఆరు స్థానాల్లోనూ, మహా కూటమి మూడు స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. -
బిహార్‌లో నరాలు తెగే ఉత్కంఠ
పట్నా: ప్రస్తుతం దేశ ప్రజల దృష్టంతా బిహార్ వైపే. బిహార్ ఎన్నికల ఫలితాలపై ప్రజలంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. రేపటి ఫలితాలపై బిహార్ నేతలు టెన్షన్ టెన్షన్‌గా ఎదురు చూస్తున్నారు. ఎగ్జిట్ పోల్స్ నేపథ్యంలో నరాలు తెగే ఉత్కంఠ కొనసాగుతోంది. అయితే అయిదు విడతలుగా జరిగిన ఎన్నికల్లో... ప్రజలు ఎవరికి పట్టం కడతారన్నది ఆదివారం తేలనుంది. రేపు ఉదయం 8 గంటలకు ఓట్లు లెక్కింపు ప్రారంభం కానుంది. 39 కేంద్రాల్లో ఓట్లు లెక్కింపు ప్రక్రియకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. జేడీయూ నేత, ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ప్రస్తుతం మౌనముద్రలో ఉన్నారు. నవంబర్ 3న దర్భంగాలో ప్రచారం తర్వాత... ఆయన పట్నాలోని 7సీఆర్ రోడ్డులో అధికార నివాసంలో సేద తీరుతున్నారు. అదే రోజు పట్నాలోని దోశహౌస్లో దోశ తిన్న నితీష్ ఆ తర్వాత ఇప్పటివరకూ బయటకు రాలేదు. తమకు మద్దతు ఇచ్చిన వారందరికీ ఆయన ట్విట్ చేసి ధన్యవాదాలు తెలిపారు. ఎన్నికల ప్రచారం ముగిసిన తర్వాత నితీష్ ...మీడియా ప్రతినిధులు, అధికార కార్యాక్రమాలకు దూరంగా ఉన్నారు. ప్రచారం, పోలింగ్ ముగిశాక సైలెంట్‌గా ఉండటం నితీష్ స్టైల్ అని జేడీయూ వర్గాలు చెబుతున్నాయి. రేపటి ఓటింగ్ తర్వాతే ఆయన ప్రెస్‌మీట్ పెట్టనున్నారు. ఇక ఆర్జేడీ నేత లాలూ ప్రసాద్ యాదవ్ నివాసం కూడా నితీష్ కుమార్ ఉంటున్న ఇంటి సమీపంలోనే ఉంది. పట్నాలోని సర్క్యులర్ రోడ్డులో 10వ ఇంట్లో ఆయన ఉంటున్నారు. అయితే పోలింగ్ ముగిశాక లాలు నివాసంలో హడావుడి నెలకొంది. వచ్చే పోయే నేతలందరినీ ఆయన కలుస్తున్నారు. పోలింగ్ ముగిశాక లాలూ రెండుసార్లు ప్రెస్‌మీట్ పెట్టారు. జేడీయూ-ఆర్జేడీ కూటమికి 190 స్థానాలు వస్తాయంటూ ఆయన ధీమా వ్యక్తం చేస్తున్నారు. నవంబర్ 6న దానాపూర్‌లో తన వ్యవసాయ క్షేత్రానికి వెళ్లిన లాలు ...అక్కడ పశుశాలలో అరగంటసేపు గడిపారు. నితీష్ కు పట్టాభిషేకం చేసి దేశ రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తానంటూ లాలూ జోస్యం చెబుతున్నారు. కాగా ఎన్నికల బరిలో లాలూ ఇద్దరు తనయులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. మరోవైపు మంత్రి పదవుల కోసం నేతలు లాలూ నివాసానికి వచ్చి పోతుండటంతో ఆయన నివాసంలో సందడి నెలకొంది. గెలుపుపై లాలూ-నితీష్ ప్రశాంతంగా ఉన్నారు. అలాగే బీజేపీ సీనియర్ నేత సుశీల్ కుమార్ మోదీ కూడా గెలుపుపై ధీమాగా ఉన్నారు. పట్నాలోని 1-పోలో రోడ్డులో ఉంటున్న ఆయన గెలుపుపై లాలూవన్నీ డాంబికాలే అని కొట్టిపారేస్తున్నారు. ప్రస్తుతం తన నివాసానికే పరిమితం అయిన సుశీల్ కుమార్ మోదీ వచ్చిపోయే ఒకరిద్దరు నేతలను కలుస్తున్నారు. కాగా ఎన్నికల్లో పోలింగ్ సరళి, విజయావకాశాలపై ఆయన పార్టీ అధిష్టానానికి నివేదిక ఇచ్చారు. చివరి విడత ఎన్నికలు ముగిశాక సుశీల్ కుమార్ మోదీ ప్రెస్మీట్లో మాట్లాడారు. -
ఎగ్జిట్ పోల్స్.. ఎంతవరకు నిజం?
ఎన్నికలు జరిగాయంటే.. ఆ వెంటనే ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను వివిధ వార్తా సంస్థలు వెల్లడించడం మనం చూస్తుంటాం. అయితే, చాలా సందర్భాల్లో ఈ ఎగ్జిట్ పోల్స్ చెప్పే ఫలితాలకు, వాస్తవ ఫలితాలకు పొంతన ఉండటం లేదు. ఇందుకు చాలా కారణాలుంటాయి. ఎన్ని నియోజకవర్గాల్లో వాళ్లు సర్వే చేశారు, ఎంత శాంపిల్ తీసుకున్నారు, శాంపిళ్లు తీసుకోవడంలో కూడా శాస్త్రీయత పాటించారా లేదా.. అడిగినది అక్షరాస్యులనా కాదా.. ఇలాంటి అంశాలన్నీ సర్వేలు, ఎగ్జిట్ పోల్స్ ప్రామాణికతను నిర్ధారిస్తాయి. బిహార్ ఎన్నికల ఫలితాలు మరికొద్ది గంటల్లో వెలువడనున్నాయి. ఆదివారం ఉదయం ఓట్ల లెక్కింపు ప్రారంభం అవుతుంది. మధ్యాహ్నానికల్లా ఫలితాలు వెలువడతాయి. వీటిపై వివిధ వార్తాసంస్థలు వివిధ రకాలుగా తమ ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వెల్లడించాయి. చాలా వరకు మహాకూటమి స్వల్ప ఆధిక్యంతో అధికారంలోకి వస్తుందని చెప్పగా, ఎన్డీటీవీ, టుడేస్ చాణక్య మాత్రం ఎన్డీయేకు పట్టం కట్టాయి. ఎన్డీటీవీ అందరికంటే ఆలస్యంగా.. శుక్రవారం రాత్రి తన ఫలితాలను వెల్లడించింది. 2010లో జరిగిన బిహార్ ఎన్నికలు, లోక్ సభ ఎన్నికల ఫలితాలను, అప్పట్లో ఆయా సంస్థలు ముందుగా వెల్లడించిన ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను చూస్తే.. బీజేపీ - జేడీయూ కూటమి అధికారంలోకి వస్తుందని చెప్పినా, అంకెల విషయంలో భారీ తేడాలే ఉన్నాయి. ఎన్డీయే కూటమికి 150 లోపు మాత్రమే స్థానాలు వస్తాయని ఊహిస్తే, ఏకంగా 206 స్థానాలు వచ్చాయి. ఇక 2004, 2009 లోక్ సభ ఎన్నికలలో ఫలితాలను భారతీయ చానళ్లు ఊహించిన తీరుపై అంతర్జాతీయ మీడియా కూడా దుమ్మెత్తిపోసింది. 2004లో ఎన్డీయే కూటమి విజయాన్ని సొంతం చేసుకుంటుందని, కనీసం 250 నుంచి 290 వరకు స్థానాలు వస్తాయని వివిధ సంస్థలు అంచనా వేయగా, 189 వద్దే ఆగిపోయింది. యూపీఏకు మాత్రం 170-200 మధ్య వస్తాయని ఊహిస్తే, 222 స్థానాలు దక్కాయి. అలాగే 2009లో కూడా బీజేపీ, కాంగ్రస్ కూటముల విషయంలో మీడియా సంస్థలు నిర్వహించిన ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు తప్పనే తేలాయి. దాదాపు 190 స్థానాల వరకు ఎన్డీయేకు వస్తాయని భావిస్తే, 159 వద్దే ఆగిపోయింది. యూపీఏకు మహా అయితే 190 వస్తాయని అనుకుంటే 262 స్థానాలతో అధికారం చేపట్టింది. 2014 లోక్ సభ ఎన్నికల్లో కూడా ఎన్డీయే విజయం సాధిస్తుందని చెప్పారు గానీ.. ఇంత భారీ విజయాన్ని మాత్రం ఎవరూ ఊహించలేదు. ఒక్క న్యూస్ 24 అనే చానల్ మాత్రం ఫలితాలకు దగ్గరగా చెప్పింది. -
బిహార్ ఎన్నికల్లో మహిళలకు తీవ్ర అన్యాయం
పాట్నా: బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఈసారి మహిళలకు ప్రాతినిధ్యం కల్పించడంలో అన్ని రాజకీయ పార్టీలు ఘోరంగా విఫలమయ్యాయి. మహిళలకు, యువతకు పెద్ద పీట వేస్తామంటూ ముందు నుంచి చెబుతూ వచ్చిన ఎన్డీయే కూటమి కూడా వారికి అన్యాయమే చేసింది. రాష్ట్ర అసెంబ్లీలోని మొత్తం 243 సీట్లకుగాను ఎన్డీయే కూటమి కేవలం 20 మంది మహిళలకు మాత్రమే టిక్కెట్లు ఇచ్చింది. జేడీయూ కూటమి కూడా కేవలం 25 మంది మహిళా అభ్యర్థులను మాత్రమే బరిలోకి దింపింది. స్వతంత్య్ర అభ్యర్థులుగా మహిళలు ఎన్నికల రంగంలోకి దిగే అవకాశం కూడా బీహార్‌లో తక్కువే. దేశంలోనే అత్యధిక శాతం మహిళలు కలిగిన అసెంబ్లీగా రికార్డున్న బీహార్‌లో ఈసారి మహిళలకు తగిన ప్రాతినిధ్యం కల్పించక పోవడానికి కారణాలేమిటో ఏ రాజకీయ పార్టీ కూడా వివరించలేక పోతోంది. గెలిచే అవకాశాలను మాత్రమే పరిగణలోకి తీసుకొని మహిళలకు టిక్కెట్లు ఇచ్చామని చెప్పుకున్నాయి. వాస్తవానికి 2000 సంవత్సరం నుంచి రాష్ట్ర అసెంబ్లీలో మహిళల ప్రాతినిధ్యం క్రమంగా పెరుగుతూ వస్తోంది. ఆ ఏడాది రాష్ట్ర అసెంబ్లీలో మహిళా ఎమ్మెల్యేల సంఖ్య 5.9 శాతం ఉండగా, 2010 నాటికి అది 14 శాతానికి పెరిగింది. 2010 అసెంబ్లీ ఎన్నికల్లో 34 మంది మహిళలు విజయం సాధించారు. అలాగే 2000 నుంచి 2010 నాటికి ఎన్నికల్లో పోటీ చేస్తున్న మహిళల సంఖ్య ఏకంగా 62 శాతం పెరిగింది. 2005లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 138 మంది మహిళలు పోటీ చేయగా, 25 మంది విజయం సాధించారు. అదే 2010 ఎన్నికల్లో 307 మంది మహిళలు పోటీ చేయగా 34 మంది విజయం సాధించారు. ఈ సారి ఎన్నికల బరిలో నిలిచిన ప్రధాన రాజకీయ కూటములైన ఎన్డీయే, జేడీయూలు మొత్తం సీట్లలో కేవలం పదిశాతం సీట్లను మాత్రమే మహిళలకు కేటాయించడాన్ని ఎలా అర్థం చేసుకోవాలో! దేశంలోనైనా, రాష్ట్రంలోనైనా మహిళలు అభివృద్ధి చెందారనడానికి మహిళా సాధికారత, అంటే చట్ట సభల్లో వారికున్న ప్రాతినిధ్యం, అక్షరాస్యత, లింగ వివక్షత అనే అంశాలను కొలమానంగా తీసుకుంటారు. వీటిలో చ ట్టసభల్లో మహిళల ప్రాధాన్యతను ప్రధాన కొలమానంగా తీసుకుంటారు. ఆ రకంగా లెక్కిస్తే గత అసెంబ్లీలో 14 శాతం ప్రాతినిధ్యంతో బీహార్ దేశంలోనే ముందుంది. ఆ లెక్కనే బీహార్‌లో మహిళలు ఎంతో అభివృద్ధి చెంది ఉండాలి. అదేగనుక జరిగి ఉంటే ఈ సారి ఎన్నికల్లో రాజకీయ పార్టీలు మహిళలను ఇంతగా నిర్లక్ష్యం చేసేవి కావు. మహిళల అభివృద్ధికి ఇతర కొలమానాలైన వాటిలో రెండవది లింగ నిష్పత్తి...ప్రతి వెయ్యిమంది పురుషులకు 940 మంది మహిళలు జాతీయ సగటుకాగా, బీహార్‌లో 916 మంది మహిళలు మాత్రమే ఉన్నారు. ఇక అక్షరాస్యత విషయానికొస్తే మహిళల్లో జాతీయ అక్షరాస్యత సగటు రేటు 63.5 శాతం కాగా, బీహార్‌లో 53 శాతం మాత్రమే ఉంది. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో మహిళల విజయానికి, వారి అభివృద్ధి గీటు రాళ్లకు అసలు సంబంధమే లేదనే విషయం స్పష్టం అవుతోంది. అయితే ఈ గీటు రాళ్లు తప్పుకాకూడదనే ఉద్దేశంతోనే రాజకీయ పార్టీలు ఈసారి వారికి టిక్కెట్లు తగ్గించాయేమో! -
చిల్లర పార్టీల రాజకీయాలు
పాట్నా: బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో నువ్వా నేనా అన్నట్టు జనతాదళ్ (యు), రాష్ట్రీయ జనతా దళ్, కాంగ్రెస్ కూటమి, నేషనల్ డెమోక్రటిక్ అలియెన్స్ పోటీ పడుతున్న నేపథ్యంలో ఎన్నికల బరిలోకి దిగిన చిన్నా చితక పార్టీల చుట్టే ఇప్పుడు రాజకీయాలు కేంద్రీకృతమయ్యాయి. జనతాదళ్ కూటమి నుంచి విడిపోయి తృతీయ కూటమిని ఏర్పాటు చేసిన ములాయం సింగ్ యాదవ్ నేతృత్వంలోని సమాజ్‌వాది పార్టీతో నేషనల్ కాంగ్రెస్ పార్టీ, జన అధికార్ పార్టీ, సమాజ్‌వాది జనతాదళ్, సమ్రాస్ సమాజ్ పార్టీ, నేషనల్ పీపుల్ పార్టీలు అంటకాగుతున్నాయి. వీటిలో కొన్ని పార్టీలు 2010లో జరిగిన బీహీర్ అసెంబ్లీ ఎన్నికల నాటికి పుట్టకపోగా, అప్పటికే మనుగడలో ఉన్న సమాజ్ వాది పార్టీ, ఎన్సీపి మినహా మిగితా పార్టీలేవీ కూడా ఎన్నికల్లో పోటీ చేయలేదు. 146 సీట్లకు పోటీ చేసిన సమాజ్‌వాది పార్టీ ఒక్క సీటును కూడా గెలుచుకోలేదు. ఈసారి కూడా విజయం సాధించే అవకాశాలు లేనప్పటికీ పోటీ చేస్తుండడం ప్రధాన కూటముల విజయావకాశాలను దెబ్బతీయడానికేననే ఆరోపణలు వినిపిస్తున్నాయి. మరోపక్క అంతో ఇంతో బలం కలిగిన వామపక్షాలు, బీఎస్పీలతోపాటు అంతగా బలంలేని అసదుద్దీన్ ఒవైసీ నాయకత్వంలోని ఏఐఎంఐఎం పార్టీ కూడా ఎన్నికల బరిలోకి దిగి విస్తృత ప్రచారం కొనసాగిస్తున్నాయి. పప్పూ యాదవ్ కొత్తగా ఏర్పాటు చేసిన జన్ అధికార్ పార్టీ ములాయం నాయకత్వంలోని తృతీయ ఫ్రంట్ ద్వారా ఎన్నికల్లో పోటీ చేస్తోంది. సహర్సా-పూర్ణియా-మధేపురా ప్రాంతంలో ఈ పార్టీ కొంత ప్రభావం చూపించే అవకాశాలు కనిపిస్తున్నాయి. రాష్ట్రంలో దాదాపు 20 సీట్లను దక్కించుకుంటే ఎన్నికల అనంతర రాజకీయాల్లో కీలక పాత్ర పోషించవచ్చని ఈ పార్టీలు భావిస్తున్నాయి. ఈ చిన్నా చితక పార్టీలు తమ విజయావకాశాలను ఏ మాత్రం దెబ్బతీయలేవని నితీష్, లాలూ గంభీరంగా చెబుతున్నప్పటికీ వారిలో గుబులు లేకపోలేదని రాజకీయ పండితులు చెబుతున్నారు. బీజేమీ వ్యతిరేక ఓట్లను ఈ పార్టీలు చీలుస్తాయని, తద్వారా కొంతమేరకు ఎన్డీయే కూటమి లాభ పడుతుందని వారు విశ్లేషిస్తున్నారు. జేడీయూ కూటమి, ఎన్డీయేలో ఏ కూటమి గెలిచినా ఫలితం బొటా బొటిగనే ఉంటుందని వారంటున్నారు. ఇప్పటి వరకు నిర్వహించిన పలు సర్వేలు కూడా ఇదే విషయాన్ని సూచిస్తున్నాయి. -
'ప్రభుత్వ మార్పుతో రాష్ట్రం మార్చుకోండి'
బీహార్: ఎలాగైనా బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి తమ జెండా పాతేయాలని చూస్తున్న బీజేపీ ఎన్నికల ప్రచారం కోసం నినాదాన్ని సిద్ధం చేసి విడుదల చేసింది. ఆ నినాదాన్ని ప్రతి చోట వీధుల్లో, భవంతులపైన, రహదారి పక్కన, పెద్ద పెద్ద హోర్డింగ్‌ల రూపంలో ఏర్పాటు చేయనుంది. ఇంతకీ ఏమిటా నినాదం అనుకుంటున్నారా.. కేవలం నాలుగు పదాలతో ఆ నినాదాన్ని రూపొందించారు. అదే ' ప్రభుత్వాన్ని మార్చండి.. బీహార్‌ను మార్చండి(బదలియే సర్కార్, బదలియే బీహార్)'. గతంలో దేశ వ్యాప్తంగా జరిగిన సాధారణ ఎన్నికల్లో కూడా మార్పు అనే నినాదంతో వచ్చిన ఎన్డీయే ప్రభుత్వం.. తిరిగి అదే నినాద మంత్రంతో బీహార్‌లో పాగా వేస్తుందేమో ఎదురు చూడాల్సిందే. వచ్చే నెలలో బీహార్ ఎన్నికలు జరగనున్నాయి. మరోపక్క, ఇప్పటి వరకు తాను ఏమేం అభివృద్ధి పనులు చేశానో నేరుగా ఫ్లెక్సీల రూపంలో ప్రజలకు తెలియజేసేందుకు అటు ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ సిద్ధం అవుతున్నారు. 'బూటకపు వాగ్దానాలపై నమ్మకం ఇక చాలు మరోసారి నితీశ్ ప్రభుత్వానికి పట్టం కట్టండి. మహిళలు సురక్షితంగా ఉండాలంటే నితీశ్‌కు ఓటెయండి' అంటూ ఫ్లెక్సీలు సిద్ధం చేశారు. -
రాహుల్ సోలో పర్ఫార్మెన్స్!
చంపారన్: ఆదిలోనే హంసపాదు అంటే ఇదేనేమో... బీహార్ ఎన్నికల సంగ్రామంలో కాంగ్రెస్ పార్టీ మొదట్లోనే షాక్ తగిలింది. జేడీయూ-ఆర్జేడీతో కలసి ఎన్నికల బరిలోకి దిగుతున్న కాంగ్రెస్‌కు మిత్రపక్షాలు రిక్తహస్తం చూపిస్తున్నాయి. పశ్చిమ చంపారన్ జిల్లాలో రాహుల్‌గాంధీ శనివారం ఎన్నికల ప్రచారం నిర్వహించనున్న విషయం తెలిసిందే. అయితే ఈ సభకు మిత్రపక్షాలు ముఖం చాటేస్తున్నాయి. మొదట ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ తాను రాహుల్ సభకు రాలేనంటూ హ్యాండివ్వగా ఇప్పుడు జేడీయూ నేత, బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ వంతు వచ్చింది. రాహుల్ సభకు తాను రాలేనని నితీష్ కుమార్ తెలిపారు. దీంతో రాహుల్ సోలో పర్ఫార్మెన్స్ ఇవ్వనున్నారు. మిత్రుల గైర్హాజరులో సాగే ఈ సభకు కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. కాగా ఈ సారి ఎన్నికల్లో ఆర్జేడీ, జేడీయూ కూటమితో చేయి కలిపిన హస్తం పార్టీ... కేవలం నలభై స్థానాలతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు ఈ మూడు పార్టీలూ కలసి మోడీని ఢీకొట్టేందుకు మహా కూటమిగా బరిలోకి దిగుతున్నాయి. మరి రాహుల్ ఏమేరకు ఓటర్లను ఆకట్టుకుంటారో చూడాలి. -
మాంఝీ పార్టీకి 20 సీట్ల కేటాయింపు
న్యూఢిల్లీ : ఎన్డీఏలో సీట్ల పంపకాలపై ప్రతిష్టంభన తొలగింది. బిహార్ ఎన్నికల్లో బీజేపీ హెచ్ఏఎం మధ్య పొత్తు కుదిరింది. రెండు పార్టీల సీట్ల మధ్య సర్దుబాటుపై చర్చలు సఫలం అయ్యాయి. హిందుస్తాన్ అవామ్ మోర్చా(హెచ్ఏఎం) అధినేత జితిన్ రాం మాంఝీ ఒత్తిడికి బీజేపీ తలొగ్గింది. ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల మధ్య సీట్ల పంపకాల్లో భాగంగా మాంఝీ పార్టీకి 20 సీట్లు కేటాయించింది. ఈ మేరకు పార్టీ అధ్యక్షుడు అమిత్ షా సోమవారమిక్కడ మీడియా సమావేశంలో వెల్లడించారు. బిహార్ ఎన్నికల్లో కలిసి బరిలోకి దిగుతున్నట్లు ఆయన తెలిపారు. కాగా బిహార్ ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరనేది ఫలితాల తర్వాత నిర్ణయం ఉంటుందన్నారు. కాగా మొత్తం 243 అసెంబ్లీ స్థానాల్లో 160 సీట్లకు బీజేపీ పోటీ చేస్తోంది. కాగా బీజేపీ ....హెచ్ఏఎంకు-20,ఎల్జేడీకి-40, ఆర్ఎస్ఎస్పీకి-23 సీట్లు కేటాయించింది. -
బీహార్ ఎన్నికల బరిలో ఎంఐఎం
హైదరాబాద్ : బీహార్ ఎన్నికల్లో ఎంఐఎం పోటీ చేస్తుందని ఆపార్టీ అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ వెల్లడించారు. ఆయన శనివారమిక్కడ మీడియాతో మాట్లాడుతూ 40 స్థానాలకు పోటీ చేయనున్నట్లు ప్రకటించారు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో రెండు స్థానాలు గెలిచి ఖాతా తెరిసిన ఎంఐంఎం అదే ఊపుతో బీహార్ ఎన్నికల బరిలోకి దిగుతోంది. దేశంలో అన్ని రాష్ట్రాలకూ ఎంఐఎం పార్టీ విస్తరణలో భాగంగానే బిహార్‌లో పోటీ చేస్తున్నట్లు ఒవైసీ తెలిపారు. తాము మెజారిటీ స్థానాలను సాధిస్తే ఆర్టికల్ 371 ప్రకారం సీమాంచల్ ప్రాంతీయ అభివృద్ధి బోర్డు ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. -
బీహార్ ఎన్నికలకు మోగిన నగారా
బీహార్ ఎన్నికలకు నగారా మోగింది. ఆ రాష్ట్రంలో ఉన్న మొత్తం 243 స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. ప్రధాన ఎన్నికల కమిషనర్ నసీం జైదీ ఈ వివరాలు ప్రకటించారు. మొత్తం 5 విడతల్లో ఎన్నికలు జరుగుతాయి. తొలి దశ ఎన్నిక అక్టోబర్ 12న మొదలవుతుంది. ఫలితాలను నవంబర్ 8వ తేదీన ప్రకటిస్తారు. తొలి దశకు నోటిఫికేషన్ తేదీ - 16 సెప్టెంబర్ నామినేషన్లకు చివరితేదీ - 23 సెప్టెంబర్ నామినేషన్ల పరిశీలన 24 సెప్టెంబర్ ఉపసంహరణకు చివరితేదీ 26 సెప్టెంబర్ ఎన్నికల తేదీ 12 అక్టోబర్ మొత్తం స్థానాలు 49 రెండో దశకు నోటిఫికేషన్ తేదీ - 21 సెప్టెంబర్ నామినేషన్లకు చివరితేదీ - 28 సెప్టెంబర్ నామినేషన్ల పరిశీలన 29 సెప్టెంబర్ ఉపసంహరణకు చివరితేదీ 1 అక్టోబర్ ఎన్నికల తేదీ 16 అక్టోబర్ మొత్తం స్థానాలు 32 మూడోదశకు నోటిఫికేషన్ తేదీ - 1 అక్టోబర్ నామినేషన్లకు చివరితేదీ - 8 అక్టోబర్ నామినేషన్ల పరిశీలన 9 అక్టోబర్ ఉపసంహరణకు చివరితేదీ 12 అక్టోబర్ ఎన్నికల తేదీ 20 అక్టోబర్ మొత్తం స్థానాలు 50 నాలుగో దశకు నోటిఫికేషన్ తేదీ - 7 అక్టోబర్ నామినేషన్లకు చివరితేదీ - 14 అక్టోబర్ నామినేషన్ల పరిశీలన 15 అక్టోబర్ ఉపసంహరణకు చివరితేదీ 17 అక్టోబర్ ఎన్నికల తేదీ 1 నవంబర్ మొత్తం స్థానాలు 55 ఐదో దశకు నోటిఫికేషన్ తేదీ - 8 అక్టోబర్ నామినేషన్లకు చివరితేదీ - 15 అక్టోబర్ నామినేషన్ల పరిశీలన 17 అక్టోబర్ ఉపసంహరణకు చివరితేదీ 19 అక్టోబర్ ఎన్నికల తేదీ 5 నవంబర్ మొత్తం స్థానాలు 57 ఓట్ల లెక్కింపు, ఫలితాల ప్రకటన 8 నవంబర్ మొత్తం ప్రక్రియ ముగింపు 12 నవంబర్ జైదీ చెప్పిన మరిన్ని వివరాలు ఇలా ఉన్నాయి... 243 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరుగుతాయి. 6.6 కోట్ల మంది ఓటర్లు, నవంబర్ 29తో అసెంబ్లీ గడువు ముగుస్తుంది. కేంద్ర పారామిలటరీ బలగాలను మోహరిస్తాం సంఘవ్యతిరేక శక్తులపై కఠిన చర్యలు తీసుకుంటాం లైసెన్సుడు ఆయుధాలను తప్పనిసరిగా స్టేషన్లలో డిపాజిట్ చేయాలి డబ్బు పంపిణీ, మద్యం పంపిణీ, పెయిడ్ న్యూస్ తదితర అంశాలపై దృష్టిపెడతాం 47 సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించాం మొత్తం 38 జిల్లాలుండగా వాటిలో 34 జిల్లాల్లో సమస్యాత్మక ప్రాంతాలున్నాయి. పోలింగ్ కేంద్రాలు అన్నింటివద్ద తాగునీరు, టాయిలెట్ల లాంటి సదుపాయాలు తప్పనిసరిగా ఏర్పాటుచేస్తాం ఓటర్లకు ఫొటో ఓటరు కార్డులు, ఓటరు స్లిప్పులు ముందుగానే అందిస్తాం. తద్వారా వాళ్లకు ఓటు వేయాలన్న ఆహ్వానం అందినట్లవుతుంది ఈవీఎంలలో కూడా గుర్తులతో పాటు అభ్యర్థుల ఫొటోలు తప్పనిసరిగా ఉండాలి ఒపీనియన్ పోల్స్‌ను, ప్రకటనలను ఎన్నికకు 48 గంటల ముందు నుంచి నిషేధిస్తున్నాం ఎన్నికల కోడ్ తక్షణం అమలులోకి వస్తుంది. రాజకీయ పార్టీలు, ఇతర స్టేక్ హోల్డర్లు అందరూ ఈ కోడ్‌ను పక్కాగా అమలుచేయడానికి సహకరించాలి. ఈ ఎన్నికల్లో లాలు ప్రసాద్‌కు చెందిన ఆర్జేడీ, నితీష్ కుమార్ నేతృత్వంలోని జేడీ(యూ) కూటమిగా కలిసి పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. కాంగ్రెస్, బీజేపీ, సమాజ్ వాదీ పార్టీ మాత్రం విడివిడిగా పోటీ చేయనున్నాయి. బీహార్ అసెంబ్లీలో ప్రస్తుత బలాబలాలు ఇవీ.. జేడీయూ 110 బీజేపీ 91 ఆర్జేడీ 25 కాంగ్రెస్ 5 ఇతరులు 6 మొత్తం స్థానాలు 243