ఎగ్జిట్ పోల్స్.. ఎంతవరకు నిజం?
ఎన్నికలు జరిగాయంటే.. ఆ వెంటనే ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను వివిధ వార్తా సంస్థలు వెల్లడించడం మనం చూస్తుంటాం. అయితే, చాలా సందర్భాల్లో ఈ ఎగ్జిట్ పోల్స్ చెప్పే ఫలితాలకు, వాస్తవ ఫలితాలకు పొంతన ఉండటం లేదు. ఇందుకు చాలా కారణాలుంటాయి. ఎన్ని నియోజకవర్గాల్లో వాళ్లు సర్వే చేశారు, ఎంత శాంపిల్ తీసుకున్నారు, శాంపిళ్లు తీసుకోవడంలో కూడా శాస్త్రీయత పాటించారా లేదా.. అడిగినది అక్షరాస్యులనా కాదా.. ఇలాంటి అంశాలన్నీ సర్వేలు, ఎగ్జిట్ పోల్స్ ప్రామాణికతను నిర్ధారిస్తాయి.
బిహార్ ఎన్నికల ఫలితాలు మరికొద్ది గంటల్లో వెలువడనున్నాయి. ఆదివారం ఉదయం ఓట్ల లెక్కింపు ప్రారంభం అవుతుంది. మధ్యాహ్నానికల్లా ఫలితాలు వెలువడతాయి. వీటిపై వివిధ వార్తాసంస్థలు వివిధ రకాలుగా తమ ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వెల్లడించాయి. చాలా వరకు మహాకూటమి స్వల్ప ఆధిక్యంతో అధికారంలోకి వస్తుందని చెప్పగా, ఎన్డీటీవీ, టుడేస్ చాణక్య మాత్రం ఎన్డీయేకు పట్టం కట్టాయి. ఎన్డీటీవీ అందరికంటే ఆలస్యంగా.. శుక్రవారం రాత్రి తన ఫలితాలను వెల్లడించింది.
2010లో జరిగిన బిహార్ ఎన్నికలు, లోక్ సభ ఎన్నికల ఫలితాలను, అప్పట్లో ఆయా సంస్థలు ముందుగా వెల్లడించిన ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను చూస్తే.. బీజేపీ - జేడీయూ కూటమి అధికారంలోకి వస్తుందని చెప్పినా, అంకెల విషయంలో భారీ తేడాలే ఉన్నాయి. ఎన్డీయే కూటమికి 150 లోపు మాత్రమే స్థానాలు వస్తాయని ఊహిస్తే, ఏకంగా 206 స్థానాలు వచ్చాయి.
ఇక 2004, 2009 లోక్ సభ ఎన్నికలలో ఫలితాలను భారతీయ చానళ్లు ఊహించిన తీరుపై అంతర్జాతీయ మీడియా కూడా దుమ్మెత్తిపోసింది. 2004లో ఎన్డీయే కూటమి విజయాన్ని సొంతం చేసుకుంటుందని, కనీసం 250 నుంచి 290 వరకు స్థానాలు వస్తాయని వివిధ సంస్థలు అంచనా వేయగా, 189 వద్దే ఆగిపోయింది. యూపీఏకు మాత్రం 170-200 మధ్య వస్తాయని ఊహిస్తే, 222 స్థానాలు దక్కాయి.
అలాగే 2009లో కూడా బీజేపీ, కాంగ్రస్ కూటముల విషయంలో మీడియా సంస్థలు నిర్వహించిన ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు తప్పనే తేలాయి. దాదాపు 190 స్థానాల వరకు ఎన్డీయేకు వస్తాయని భావిస్తే, 159 వద్దే ఆగిపోయింది. యూపీఏకు మహా అయితే 190 వస్తాయని అనుకుంటే 262 స్థానాలతో అధికారం చేపట్టింది.
2014 లోక్ సభ ఎన్నికల్లో కూడా ఎన్డీయే విజయం సాధిస్తుందని చెప్పారు గానీ.. ఇంత భారీ విజయాన్ని మాత్రం ఎవరూ ఊహించలేదు. ఒక్క న్యూస్ 24 అనే చానల్ మాత్రం ఫలితాలకు దగ్గరగా చెప్పింది.