చిల్లర పార్టీల రాజకీయాలు
పాట్నా: బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో నువ్వా నేనా అన్నట్టు జనతాదళ్ (యు), రాష్ట్రీయ జనతా దళ్, కాంగ్రెస్ కూటమి, నేషనల్ డెమోక్రటిక్ అలియెన్స్ పోటీ పడుతున్న నేపథ్యంలో ఎన్నికల బరిలోకి దిగిన చిన్నా చితక పార్టీల చుట్టే ఇప్పుడు రాజకీయాలు కేంద్రీకృతమయ్యాయి. జనతాదళ్ కూటమి నుంచి విడిపోయి తృతీయ కూటమిని ఏర్పాటు చేసిన ములాయం సింగ్ యాదవ్ నేతృత్వంలోని సమాజ్‌వాది పార్టీతో నేషనల్ కాంగ్రెస్ పార్టీ, జన అధికార్ పార్టీ, సమాజ్‌వాది జనతాదళ్, సమ్రాస్ సమాజ్ పార్టీ, నేషనల్ పీపుల్ పార్టీలు అంటకాగుతున్నాయి.
వీటిలో కొన్ని పార్టీలు 2010లో జరిగిన బీహీర్ అసెంబ్లీ ఎన్నికల నాటికి పుట్టకపోగా, అప్పటికే మనుగడలో ఉన్న సమాజ్ వాది పార్టీ, ఎన్‌సీపి మినహా మిగితా పార్టీలేవీ కూడా ఎన్నికల్లో పోటీ చేయలేదు. 146 సీట్లకు పోటీ చేసిన సమాజ్‌వాది పార్టీ ఒక్క సీటును కూడా గెలుచుకోలేదు. ఈసారి కూడా విజయం సాధించే అవకాశాలు లేనప్పటికీ పోటీ చేస్తుండడం ప్రధాన కూటముల విజయావకాశాలను దెబ్బతీయడానికేననే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
మరోపక్క అంతో ఇంతో బలం కలిగిన వామపక్షాలు, బీఎస్‌పీలతోపాటు అంతగా బలంలేని అసదుద్దీన్ ఒవైసీ నాయకత్వంలోని ఏఐఎంఐఎం పార్టీ కూడా ఎన్నికల బరిలోకి దిగి విస్తృత ప్రచారం కొనసాగిస్తున్నాయి. పప్పూ యాదవ్ కొత్తగా ఏర్పాటు చేసిన జన్ అధికార్ పార్టీ ములాయం నాయకత్వంలోని తృతీయ ఫ్రంట్ ద్వారా ఎన్నికల్లో పోటీ చేస్తోంది. సహర్సా-పూర్ణియా-మధేపురా ప్రాంతంలో ఈ పార్టీ కొంత ప్రభావం చూపించే అవకాశాలు కనిపిస్తున్నాయి. రాష్ట్రంలో దాదాపు 20 సీట్లను దక్కించుకుంటే ఎన్నికల అనంతర రాజకీయాల్లో కీలక పాత్ర పోషించవచ్చని ఈ పార్టీలు భావిస్తున్నాయి.
ఈ చిన్నా చితక పార్టీలు తమ విజయావకాశాలను ఏ మాత్రం దెబ్బతీయలేవని నితీష్, లాలూ గంభీరంగా చెబుతున్నప్పటికీ వారిలో గుబులు లేకపోలేదని రాజకీయ పండితులు చెబుతున్నారు. బీజేమీ వ్యతిరేక ఓట్లను ఈ పార్టీలు చీలుస్తాయని, తద్వారా కొంతమేరకు ఎన్డీయే కూటమి లాభ పడుతుందని వారు విశ్లేషిస్తున్నారు. జేడీయూ కూటమి, ఎన్డీయేలో ఏ కూటమి గెలిచినా ఫలితం బొటా బొటిగనే ఉంటుందని వారంటున్నారు. ఇప్పటి వరకు నిర్వహించిన పలు సర్వేలు కూడా ఇదే విషయాన్ని సూచిస్తున్నాయి.