'మమ్మల్ని పరిచయం చేసుకున్నాం'
హైదరాబాద్ : బిహార్ అసెంబ్లీ ఎన్నికలకు ఆలస్యంగా బరిలోకి దిగడం వల్లే ఆశించిన ఫలితాలు సాధించలేకపోయామని ఎంఐఎం అధ్యక్షుడు, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. ఆయన ఆదివారమిక్కడ మీడియాతో మాట్లాడుతూ ఈ ఎన్నికల ద్వారా బిహార్ ప్రజలకు తమని పరిచయం చేసుకున్నామన్నారు. రాబోయే రోజుల్లో బిహార్‌లో ఎంఐఎంను బలోపేతం చేస్తామన్నారు. ఈ ఫలితాలు నరేంద్ర మోదీకి వ్యక్తిగత ఓటమి అని ఓవైసీ వ్యాఖ్యానించారు. ఈ ఎన్నికల ద్వారా ప్రధాని మోదీకి ముస్లింలు గుణపాఠం చెప్పారన్నారు.
కాగా బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎంఐఎం ఆరుగురు అభ్యర్థులను బరిలోకి దించిన విషయం తెలిసిందే. అక్తర్ ఉల్ ఇమాన్(కోచదామన్), తసీరుద్దీన్(కిషన్‌గంజ్), డాక్టర్ అమిత్ పాశ్వాన్(రాణిగంజ్), గులామ్ సర్వార్(బైసి), నవాజిష్ ఆలం(అమోర్), ఎండీ ఆదిల్ (బల్ రామ్‌పూర్) పోటీ చేశారు. అయితే ఎంఐఎం మాత్రం ఖాతా తెరవలేకపోయింది. ఒక్క స్థానంలో మాత్రమే కొద్దిసేపు ఆధిక్యం కొనసాగినా తర్వాత పోటీలో నిలబడలేకపోయింది.