బిహార్ ఎన్నికల్లో మహిళలకు తీవ్ర అన్యాయం
పాట్నా: బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఈసారి మహిళలకు ప్రాతినిధ్యం కల్పించడంలో అన్ని రాజకీయ పార్టీలు ఘోరంగా విఫలమయ్యాయి. మహిళలకు, యువతకు పెద్ద పీట వేస్తామంటూ ముందు నుంచి చెబుతూ వచ్చిన ఎన్డీయే కూటమి కూడా వారికి అన్యాయమే చేసింది. రాష్ట్ర అసెంబ్లీలోని మొత్తం 243 సీట్లకుగాను ఎన్డీయే కూటమి కేవలం 20 మంది మహిళలకు మాత్రమే టిక్కెట్లు ఇచ్చింది. జేడీయూ కూటమి కూడా కేవలం 25 మంది మహిళా అభ్యర్థులను మాత్రమే బరిలోకి దింపింది. స్వతంత్య్ర అభ్యర్థులుగా మహిళలు ఎన్నికల రంగంలోకి దిగే అవకాశం కూడా బీహార్‌లో తక్కువే.
దేశంలోనే అత్యధిక శాతం మహిళలు కలిగిన అసెంబ్లీగా రికార్డున్న బీహార్‌లో ఈసారి మహిళలకు తగిన ప్రాతినిధ్యం కల్పించక పోవడానికి కారణాలేమిటో ఏ రాజకీయ పార్టీ కూడా వివరించలేక పోతోంది. గెలిచే అవకాశాలను మాత్రమే పరిగణలోకి తీసుకొని మహిళలకు టిక్కెట్లు ఇచ్చామని చెప్పుకున్నాయి. వాస్తవానికి 2000 సంవత్సరం నుంచి రాష్ట్ర అసెంబ్లీలో మహిళల ప్రాతినిధ్యం క్రమంగా పెరుగుతూ వస్తోంది. ఆ ఏడాది రాష్ట్ర అసెంబ్లీలో మహిళా ఎమ్మెల్యేల సంఖ్య 5.9 శాతం ఉండగా, 2010 నాటికి అది 14 శాతానికి పెరిగింది.
2010 అసెంబ్లీ ఎన్నికల్లో 34 మంది మహిళలు విజయం సాధించారు. అలాగే 2000 నుంచి 2010 నాటికి ఎన్నికల్లో పోటీ చేస్తున్న మహిళల సంఖ్య ఏకంగా 62 శాతం పెరిగింది. 2005లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 138 మంది మహిళలు పోటీ చేయగా, 25 మంది విజయం సాధించారు. అదే 2010 ఎన్నికల్లో 307 మంది మహిళలు పోటీ చేయగా 34 మంది విజయం సాధించారు. ఈ సారి ఎన్నికల బరిలో నిలిచిన ప్రధాన రాజకీయ కూటములైన ఎన్డీయే, జేడీయూలు మొత్తం సీట్లలో కేవలం పదిశాతం సీట్లను మాత్రమే మహిళలకు కేటాయించడాన్ని ఎలా అర్థం చేసుకోవాలో!
దేశంలోనైనా, రాష్ట్రంలోనైనా మహిళలు అభివృద్ధి చెందారనడానికి మహిళా సాధికారత, అంటే చట్ట సభల్లో వారికున్న ప్రాతినిధ్యం, అక్షరాస్యత, లింగ వివక్షత అనే అంశాలను కొలమానంగా తీసుకుంటారు. వీటిలో చ ట్టసభల్లో మహిళల ప్రాధాన్యతను ప్రధాన కొలమానంగా తీసుకుంటారు. ఆ రకంగా లెక్కిస్తే గత అసెంబ్లీలో 14 శాతం ప్రాతినిధ్యంతో బీహార్ దేశంలోనే ముందుంది. ఆ లెక్కనే బీహార్‌లో మహిళలు ఎంతో అభివృద్ధి చెంది ఉండాలి. అదేగనుక జరిగి ఉంటే ఈ సారి ఎన్నికల్లో రాజకీయ పార్టీలు మహిళలను ఇంతగా నిర్లక్ష్యం చేసేవి కావు.
మహిళల అభివృద్ధికి ఇతర కొలమానాలైన వాటిలో రెండవది లింగ నిష్పత్తి...ప్రతి వెయ్యిమంది పురుషులకు 940 మంది మహిళలు జాతీయ సగటుకాగా, బీహార్‌లో 916 మంది మహిళలు మాత్రమే ఉన్నారు. ఇక అక్షరాస్యత విషయానికొస్తే మహిళల్లో జాతీయ అక్షరాస్యత సగటు రేటు 63.5 శాతం కాగా, బీహార్‌లో 53 శాతం మాత్రమే ఉంది. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో మహిళల విజయానికి, వారి అభివృద్ధి గీటు రాళ్లకు అసలు సంబంధమే లేదనే విషయం స్పష్టం అవుతోంది. అయితే ఈ గీటు రాళ్లు తప్పుకాకూడదనే ఉద్దేశంతోనే రాజకీయ పార్టీలు ఈసారి వారికి టిక్కెట్లు తగ్గించాయేమో!