బిహార్‌లో నరాలు తెగే ఉత్కంఠ
పట్నా: ప్రస్తుతం దేశ ప్రజల దృష్టంతా బిహార్ వైపే. బిహార్ ఎన్నికల ఫలితాలపై ప్రజలంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. రేపటి ఫలితాలపై బిహార్ నేతలు టెన్షన్ టెన్షన్గా ఎదురు చూస్తున్నారు. ఎగ్జిట్ పోల్స్ నేపథ్యంలో నరాలు తెగే ఉత్కంఠ కొనసాగుతోంది. అయితే అయిదు విడతలుగా జరిగిన ఎన్నికల్లో... ప్రజలు ఎవరికి పట్టం కడతారన్నది ఆదివారం తేలనుంది. రేపు ఉదయం 8 గంటలకు ఓట్లు లెక్కింపు ప్రారంభం కానుంది. 39 కేంద్రాల్లో ఓట్లు లెక్కింపు ప్రక్రియకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.
జేడీయూ నేత, ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ప్రస్తుతం మౌనముద్రలో ఉన్నారు. నవంబర్ 3న దర్భంగాలో ప్రచారం తర్వాత... ఆయన పట్నాలోని 7సీఆర్ రోడ్డులో అధికార నివాసంలో సేద తీరుతున్నారు. అదే రోజు పట్నాలోని దోశహౌస్‌లో దోశ తిన్న నితీష్ ఆ తర్వాత ఇప్పటివరకూ బయటకు రాలేదు. తమకు మద్దతు ఇచ్చిన వారందరికీ ఆయన ట్విట్ చేసి ధన్యవాదాలు తెలిపారు. ఎన్నికల ప్రచారం ముగిసిన తర్వాత నితీష్ ...మీడియా ప్రతినిధులు, అధికార కార్యాక్రమాలకు దూరంగా ఉన్నారు. ప్రచారం, పోలింగ్ ముగిశాక సైలెంట్‌గా ఉండటం నితీష్ స్టైల్ అని జేడీయూ వర్గాలు చెబుతున్నాయి. రేపటి ఓటింగ్ తర్వాతే ఆయన ప్రెస్‌మీట్ పెట్టనున్నారు.
ఇక ఆర్జేడీ నేత లాలూ ప్రసాద్ యాదవ్ నివాసం కూడా నితీష్ కుమార్ ఉంటున్న ఇంటి సమీపంలోనే ఉంది. పట్నాలోని సర్క్యులర్ రోడ్డులో 10వ ఇంట్లో ఆయన ఉంటున్నారు. అయితే పోలింగ్ ముగిశాక లాలు నివాసంలో హడావుడి నెలకొంది. వచ్చే పోయే నేతలందరినీ ఆయన కలుస్తున్నారు. పోలింగ్ ముగిశాక లాలూ రెండుసార్లు ప్రెస్మీట్ పెట్టారు. జేడీయూ-ఆర్జేడీ కూటమికి 190 స్థానాలు వస్తాయంటూ ఆయన ధీమా వ్యక్తం చేస్తున్నారు. నవంబర్ 6న దానాపూర్‌లో తన వ్యవసాయ క్షేత్రానికి వెళ్లిన లాలు ...అక్కడ పశుశాలలో అరగంటసేపు గడిపారు. నితీష్ కు పట్టాభిషేకం చేసి దేశ రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తానంటూ లాలూ జోస్యం చెబుతున్నారు. కాగా ఎన్నికల బరిలో లాలూ ఇద్దరు తనయులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. మరోవైపు మంత్రి పదవుల కోసం నేతలు లాలూ నివాసానికి వచ్చి పోతుండటంతో ఆయన నివాసంలో సందడి నెలకొంది. గెలుపుపై లాలూ-నితీష్ ప్రశాంతంగా ఉన్నారు.
అలాగే బీజేపీ సీనియర్ నేత సుశీల్ కుమార్ మోదీ కూడా గెలుపుపై ధీమాగా ఉన్నారు. పట్నాలోని 1-పోలో రోడ్డులో ఉంటున్న ఆయన గెలుపుపై లాలూవన్నీ డాంబికాలే అని కొట్టిపారేస్తున్నారు. ప్రస్తుతం తన నివాసానికే పరిమితం అయిన సుశీల్ కుమార్ మోదీ వచ్చిపోయే ఒకరిద్దరు నేతలను కలుస్తున్నారు. కాగా ఎన్నికల్లో పోలింగ్ సరళి, విజయావకాశాలపై ఆయన పార్టీ అధిష్టానానికి నివేదిక ఇచ్చారు. చివరి విడత ఎన్నికలు ముగిశాక సుశీల్ కుమార్ మోదీ ప్రెస్‌మీట్‌లో మాట్లాడారు.