లాలూ నివాసానికి మిఠాయిలు
పట్నా: బిహార్ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్లో ఎన్డీయే కూటమి ఆధిక్యంలో కొనసాగుతోంది. అయితే గెలుపుపై ధీమాగా ఉన్న మహాకూటమి నేత, ఆర్డేజీ అధినేత లాలూ ప్రసాద్ నివాసానికి ...అప్పుడే మిఠాయిలు వచ్చిపడుతున్నాయి. ఎన్నికల్లో తమదే విజయమని, నితీష్ కుమారే కాబోయే ముఖ్యమంత్రి అంటూ లాలూ ఇప్పటికే జోస్యం చెప్పిన విషయం తెలిసిందే. దీంతో గెలుపుపై భరోసాగా ఉన్న లాలూ ఇంటికి... పార్టీ శ్రేణులు సంబరాలు చేసుకునేందుకు పెద్ద ఎత్తున స్వీట్స్ తో ఆయన నివాసానికి చేరుకుంటున్నారు.
కాగా పట్నా పీఠాన్ని విజయగర్వంతో అధిరోహించేదెవరో మరికొద్ది గంటల్లో తేలనుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీయే స్వయంగా రంగంలోకి దిగి ప్రచార బాధ్యతలు చేపట్టిన ఎన్డీయే కూటమి ఒకవైపు.. సీఎం నితీశ్ సచ్ఛీలతను, సుపరిపాలనను, లాలూ ప్రసాద్ కుల సమీకరణాలను నమ్ముకున్న మహా లౌకిక కూటమి మరోవైపు నిలిచి.. హోరాహోరీగా సాగించిన ఎన్నికల పోరాటంలో బిహార్ ప్రజలెటు నిలిచారనేది తేలనుంది. మోదీ వర్సెస్ నితీశ్ ఫైట్లో విజేత ఎవరో తేలనుంది.