
'అద్వానీని విస్మరిస్తున్న బీజేపీ'
ముంబై: బీజేపీ సీనియర్ నేత ఎల్.కె.అద్వానీ చురుకైన భాగస్వామ్యాన్ని పార్టీ కోల్పోతోందని ఆ పార్టీ నేత శత్రుఘ్న సిన్హా అన్నారు. సంస్థాగత వ్యవహారాల్లో అద్వానీని సంప్రదించాలని, ముఖ్యమైన అంశాలపై సూచనలు, సలహాలు స్వీకరించాలని సూచించారు. ఆయనను విశ్వాసంలోకి తీసుకొని చురుకైన భాగస్వామ్యాన్ని పార్టీ స్వీకరిస్తుందని తాను ఆశిస్తున్నట్లు మీడియాతో అన్నారు.
ప్రస్తుతం తాము గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నామని, కాని వాటిని అధిగమిస్తామనే నమ్మకముందని చెప్పారు. ప్రజలు బీజేపీపై, ప్రధాని నరేంద్ర మోదీపై చాలా ఆశలు పెట్టుకున్నారన్నారు. తాను బిహార్ ముఖ్యమంత్రి పదవి రేసులో లేనని సిన్హా స్పష్టం చేశారు. తాను మోదీకిగాని, ఇంకా ఎవరికిగాని మద్దతుదారుడిని కానని, కేవలం బిహార్ మద్దతుదారునని చెప్పారు.