అద్వానీ ఎప్పటికీ అగ్రనేతే కానీ..
- రాష్ట్రపతి అభ్యర్థి ఎంపికపై క్లారిటీ ఇచ్చిన అమిత్ షా
- తమిళనాడులో బీజేపీ అధ్యక్షుడి పర్యటన
- శశి వర్గంపై ఐటీ దాడులు, రజనీకాంత్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు
చెన్నై: ముందునుంచి రేసులో ఉన్న ఎల్‌కే అద్వానీని కాకుండా దళితమేధావి రామ్‌నాథ్ కోవింద్‌ను ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించడంపై బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా పెదవి విప్పారు. రెండు సీట్లున్న బీజేపీని కేంద్రంలో అధికారం కైవసం చేసుకునేంత స్థాయికి తీసుకురావడంలో విశేష పాత్రపోషించిన అద్వానీని 'మోదీ-షా' ద్వయం పట్టించుకోవడం లేదనే విమర్శలు అర్ధరహితమని ఆయన కొట్టిపారేశారు.
తమిళనాడులో బీజేపీ విస్తరణపై దృష్టిసారించిన ఆయన ఒక రోజు పర్యటన నిమిత్తం మంగళవారం రాష్ట్రానికి వచ్చారు. ఈ సందర్భంగా ఓ స్థానిక పత్రికకు ఆయన ఇంటర్వ్యూ ఇచ్చారు. "అద్వానీ ఎప్పటికీ మా అగ్రనేతే. కానీ రాష్ట్రపతి అభ్యర్థిత్వం దళితులకే ఇవ్వాలని నిర్ణయించాం. అందుకు రామ్‌నాథ్ కోవింద్ అన్నివిధాలా యోగ్యుడనే నిర్ణయానికి వచ్చాం. అద్వానీ సైతం రామ్‌నాథ్ ఎంపికను ప్రశంసించారు" అని అమిత్ షా పేర్కొన్నారు.
రాష్ట్రపతి అభ్యర్థిగా మొదట గోపాలకృష్ణను అనుకున్నారట!
రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థి కోవింద్‌కు మద్దతు పలకాల్సిందిపోయి పోటీకి దిగిన విపక్షాలపై అమిత్ షా మండిపడ్డారు. "మేం(బీజేపీ) దళితుడిని రాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించకుంటే కాంగ్రెస్ పార్టీ ఆ పని(మీరా కుమార్‌ను అభ్యర్థిగా ప్రకటించే) ఖచ్చితంగా చేయదు. కాంగ్రెస్ వాళ్లు మొదట్లో గోపాలకృష్ణ గాంధీని పోటీకి పెట్టాలనుకున్నారు. కానీ మేం కోవింద్ పేరు చెప్పేసరికి ప్లేట్ ఫిరాయించి మమ్మల్ని కాపీ కొట్టారు' అని అమిత్ షా అన్నారు.
రజనీ వచ్చాక చూద్దాం
రజనీకాంత్ ఎంతో పరపతి ఉన్న వ్యక్తి అని, అయితే ఆయన బీజేపీలో చేరబోతున్నారనేది ప్రస్తుతానికి ప్రచారం మాత్రమేనని అమిత్ షా అన్నారు. "రాజకీయ ప్రవేశంపై ఆయన(రజనీ) ఇంకా నిర్ణయం తీసుకోలేదు. బీజేపీలోకి వస్తానంటేగనుక, స్థానిక నేతలను సంప్రదించి ఆ మేరకు నిర్ణయం తీసుకుంటాం. ఒకవేళ ఆయన బీజేపీలో చేరకపోయినా మా వ్యూహాలు మాకుంటాయి' అని షా చమత్కరించారు.
ఐటీ, సీబీఐ దాడులతో సంబంధంలేదు
మూడు ముక్కలుగా చీలిపోయిన అన్నాడీఎంకే నేతలను రాష్ట్రపతి ఎన్నికల్లో ఏ రకంగా మీ దారికి తెచ్చుకున్నారు? ఐటీ, సీబీఐ దాడుల భయంతో వారు బీజేపీకి ఓటు వేయబోతున్నారా? అన్న విలేకరి ప్రశ్నకు అమిత్ షా బదులిస్తూ.. "సీబీఐ, ఐటీ దాడులను రాజకీయాలతో ముడిపెట్టొద్దు. తగిన ఆధారాలు ఉండడం వల్లే వాళ్లు దాడులు చేశారు. సీఎం పళనిస్వామి, మాజీ సీఎం పన్నీర్‌సెల్వం తరచూ ప్రధాని మోదీని కలుస్తున్నారు. దేశ ప్రధానిని అన్ని రాష్ట్రాల సీఎంలు, పార్టీల అధ్యక్షులు కవడం సహజం" అని అన్నారు.