తమిళనాడు సీఎం అభ్యర్థిగా కేంద్ర మంత్రి?
డీఎంకే అంతర్గత కుమ్ములాటలతో నీరసించింది. అధికార అన్నాడీఎంకే అధినేత్రికి అవినీతి ఆరోపణలతో శిక్షపడింది. కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అసలు చెప్పుకోనక్కర్లేదు. తమిళనాడులో పాగా వేసేందుకు ఇదే సరైన తరుణమని కమలనాథులు భావిస్తున్నారు. బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా తమిళనాడులో పర్యటిస్తున్న సందర్భంగా పార్టీని బలోపేతం చేయడంతో పాటు.. అక్కడ భారీ మార్పుచేర్పులు చేయొచ్చని సమాచారం. ప్రధాని నరేంద్రమోదీకి అత్యంత విశ్వాసపాత్రురాలు, తమిళనాడు ఆడపడుచు అయిన కేంద్ర వాణిజ్యశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ను అక్కడ బీజేపీ తరఫున ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించాలని భావిస్తున్నట్లు కూడా తెలుస్తోంది.
గతంలో గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు జరిగినప్పుడు, అంతకుముందు పలు సందర్భాల్లో కూడా నిర్మలా సీతారామన్ చొరవను, నాయకత్వ లక్షణాలను చూడటం వల్లే ఆమెకు ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా పిలిచి కేంద్రంలో మంత్రిపదవి ఇచ్చి.. ఆ తర్వాత రాజ్యసభ సభ్యత్వాన్ని కట్టబెట్టారు. ఆమె ఆంధ్రప్రదేశ్ కోడలు అయినా.. తమిళనాడు ఆడపడుచు కావడం, మచ్చలేని నాయకురాలు కావడంతో ఆమెను సీఎం అభ్యర్థిగా ముందుకు తీసుకురావాలని భావిస్తున్నారు. పర్యటన సమయంలో రాష్ట్రంలోని నాయకత్వాన్ని కూడా సంప్రదించి, అక్కడి పరిస్థితులను పూర్తిగా అధ్యయనం చేసిన తర్వాత పార్టీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా దీనిపై ప్రధాని మోదీతో చర్చిస్తారని, అప్పుడు మాత్రమే ఈ విషయమై ఓ నిర్ణయం తీసుకుంటారని అంటున్నారు.