
యెడ్డీపై ఎఫ్‌ఐఆర్.. భారీ ట్రాఫిక్ జామ్!
బెంగళూరు: కర్ణాటక బీజేపీ అధ్యక్షుడు బీఎస్ యెడ్యూరప్పపై ఏసీబీ ఎఫ్‌ఐఆర్ నమోదుచేయడంపై మండిపడుతూ ఆ పార్టీ కార్యకర్తలు ఆదివారం బెంగళూరులో భారీ నిరసన ప్రదర్శన చేపట్టారు. రద్దీగా ఉండే మైసూర్ బ్యాంకు సర్కిల్‌లో బీజేపీ కార్యకర్తలు నిరసన చేపట్టి.. రోడ్డుపై వాహనాల రాకపోకలను అడ్డుకున్నారు. దీంతో కొంతసేపు ట్రాఫిక్ స్తంభించిపోయింది.
కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య కక్షసాధింపు రాజకీయాలకు పాల్పడుతున్నారని, అందులోభాగంగానే యెడ్డీపై అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) ఎఫ్‌ఐఆర్ నమోదుచేసిందని బీజేపీ కార్యకర్తలు ఆరోపించారు. వ్యక్తిగత రాజకీయ లబ్ధి కోసం ఏసీబీని దుర్వినియోగం చేస్తున్న సీఎం సిద్దరామయ్య వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని వారు డిమాండ్ చేశారు. యెడ్యూరప్పపై ఏసీబీకి ఫిర్యాదు అందిన అరగంటలోపే ఎఫ్‌ఐఆర్‌ను నమోదుచేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం దురుద్దేశం కనపడుతోందని బీజేపీ నేత ఆర్ అశోక్ పేర్కొన్నారు.