అమ్మకం యోచన విరమించుకున్న బ్లాక్‌బెర్రీ
న్యూయార్క్: స్మార్ట్‌ఫోన్స్ తయారీ సంస్థ బ్లాక్‌బెర్రీ విక్రయ ప్రతిపాదన అటకెక్కింది. సంస్థను విక్రయించే యోచనను విరమించి, కన్వర్టబుల్ డిబెంచర్ల ద్వారా 1.25 బిలియన్ డాలర్ల దాకా నిధులను సమీకరించాలని నిర్ణయించినట్లు కంపెనీ యాజమాన్యం వివరించింది. ఈ ప్రక్రియ రెండు వారాల్లోగా పూర్తి కావొచ్చని తెలిపింది. అలాగే సీఈవో థోర్‌స్టెన్ హెయిన్జ్ స్థానంలో జాన్ చెన్‌ని నియమిస్తున్నట్లు పేర్కొంది. వాల్ట్ డిస్నీ కంపెనీ డెరైక్టర్‌గా ఉన్న చెన్.. తాత్కాలిక సీఈవోగా వ్యవహరిస్తారు. అటు మాజీ డెరైక్టర్ ప్రేమ్ వత్స మళ్లీ లీడ్ డెరైక్టర్‌గా వస్తారు. వత్స సారథ్యంలోని ఫెయిర్‌ఫ్యాక్స్ ఫైనాన్షియల్‌కి బ్లాక్‌బెర్రీలో 10 శాతం వాటాలు ఉన్నాయి. ఫెయిర్‌ఫ్యాక్స్ తాజాగా 250 మిలియన్ డాలర్లు ఇన్వెస్ట్ చేస్తుంది. యాపిల్ తదితర కంపెనీల నుంచి పోటీతో కుదేలైన బ్లాక్‌బెర్రీని 4.7 బిలియన్ డాలర్లకు కొనేందుకు కూడా ఫెయిర్‌ఫ్యాక్స్ సిద్ధపడిన సంగతి తెలిసిందే.