పిలిప్పీన్స్లో బాంబు పేలుడు: అధ్యక్షుడే టార్గెట్? | Blast in Davao, Philippines: many dead | Sakshi
Sakshi News home page

పిలిప్పీన్స్లో బాంబు పేలుడు: అధ్యక్షుడే టార్గెట్?

Published Fri, Sep 2 2016 11:03 PM | Last Updated on Mon, Sep 4 2017 12:01 PM

పిలిప్పీన్స్లో బాంబు పేలుడు: అధ్యక్షుడే టార్గెట్?

పిలిప్పీన్స్లో బాంబు పేలుడు: అధ్యక్షుడే టార్గెట్?

మనీలా: పిలిప్పీన్స్ దక్షిణ ప్రాంతంలోని దవావో నగరంలో శుక్రవారం రాత్రి భారీ పేలుడు సంభవించింది. నగరంలోని ప్రఖ్యాత నైట్ మార్కెట్ వద్ద చోటుచేసుకున్న శక్తిమంతమైన పేలుడులో 14 మంది పౌరులు అక్కడికక్కడే మరణించగా, 60 మంది తీవ్రంగా గాయపడ్డారు. చనిపోయినవారిలో ఐదుగురు మహిళలు కాగా, గాయపడ్డవారిలో 30 మంది పోలీసులు ఉన్నారు. దవావో.. పిలిప్పీన్స్ అధ్యక్షుడు రోడ్రిగో డుటెర్టీ సొంత నగరం కావడం గమనార్హం. అంతేకాదు.. పేలుడు సంభవించినప్పుడు ఆయన కూడా అదే నగరంలో ఉన్నారు. కాగా, అధ్యక్షుడు సురక్షితంగా ఉన్నారని అధికార వర్గాలు ప్రకటించాయి.

సరిగ్గా నైట్ మార్కెట్ సమీపంలోని మార్కో పోలో హోటల్ వద్ద ఈ పేలుడు చోటుచేసుకుంది. అధ్యక్షుడు రోడ్రిగో డుటెర్టీ తరచూ ఇదే హోటల్ కు వస్తుండటంతో ఆయనను లక్ష్యంగా చేసుకునే కుట్ర జరిగి ఉండొచ్చనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అయితే పోలీసులు మాత్రం దీనిని నిర్ధారించడంలేదు. 'పేలుళ్లకు గల కారణాలు, బాధ్యుల వివరాలేవీ ఇంకా తెలియరాలేదు' అని అధికారులు ప్రకటించారు. గాయపడినవారిని సమీపంలోని ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నామన్నారు. రోడ్రిగో కుమారుడు, ప్రస్తుత దవావో డిప్యూటీ మేయర్ పావ్ లో డుటెర్టీ పేలుడు ఘటనపై స్పందిస్తూ.. 'నాన్నగారు నగరంలో ఉన్నా, పేలుడు జరిగిన ప్రాంతానికి చాలా దూరంలో ఉన్నారు' అని మీడియాకు చెప్పారు.


ప్రస్తుతం పిలిప్పీన్స్ లోనే ఉన్న తెలుగు విద్యార్థి బాలసాయి 'సాక్షి'కి ఫోన్ చేసి ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలను తెలిపారు. చనిపోయిన వారంతా పిలిప్పీన్స్ పౌరులేనని, భారతీయులు ఎవరూ లేరని తాను నిర్ధారించుకున్నట్లు బాలసాయి చెప్పారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అన్నారు. ప్రతి వీకెండ్ లో నైట్ మార్కెట్ సమీపంలోని మార్కోపోలో హోటల్ కు అధ్యక్షుడు రోడ్రిగో వస్తారని, ఆయనను లక్ష్యంగా చేసుకునే పేలుడు జరిగి ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నట్లు సాయి చెప్పారు.

రెండు నెలల కిందటే అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన రోడ్రిగో.. డ్రగ్ మాఫియాపై ఉక్కుపాదం మోపారు. నెలన్నరగా పిలిప్పీన్స్ లోని పలు ప్రాంతాల్లో జరిగిన పోలీసు దాడుల్లో దాదాపు 2వేల మందిని మట్టుపెట్టారు. అధ్యక్షుడు కాకముందు రొడ్రిగో దవావో నగర మేయర్ గా 22 ఏళ్లు పనిచేశారు. ఆ కాలంలోనూ మాఫియాపై ఆయన పోరాటం కొనసాగింది. దేశాధ్యక్షుడయ్యాక ఆ పోరాటాన్ని మరింత ఉధృతం చేశారాయన. ఇప్పటికే దేశాధ్యక్షుడు రోడ్రిగో డుటెర్టీని చంపేయాలంటూ డ్రగ్ మాఫియా బహిరంగా ప్రకటించిన నేపథ్యంలో శుక్రవారం దవావో నగరంలో చోటుచేసుకున్న పేలుడు అనేక అనుమానాలకు తావిస్తున్నది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement