President Rodrigo Duterte
-
మిస్ యూనివర్స్‌గా ఫిలిప్పీన్స్ భామ
బ్యాంకాక్: మిస్ యూనివర్స్ 2018 కిరీటాన్ని ఫిలిప్పీన్స్ యువతి కాట్రియానా గ్రే సొంతం చేసుకుంది. 93 దేశాలకు చెందిన యువతులు ఈ కిరీటం కోసం పోటీపడగా కాట్రియానా విజేతగా నిలిచింది. సోమవారం బ్యాంకాక్‌లో జరిగిన ఫైనల్లో న్యాయనిర్ణేతలు ఆమెను విజేతగా ప్రకటించారు. తొలి రన్నరప్‌గా దక్షిణాఫ్రికాకు చెందిన తామరిన్ గ్రీన్, రెండో రన్నరప్‌గా వెనెజెవిలాకు చెందిన స్టీఫనీ గుటీరెజ్ నిలిచారు. సింగర్, మోడల్‌గా పేరొందిన కాట్రియానా వేదికపై ఎరుపు రంగు గౌనులో తళుక్కుమంది. ఓ అగ్నిపర్వతాన్ని ప్రేరణగా తీసుకుని తాను ఎరుపు రంగు గౌనును ధరించానని కాట్రియానా చెప్పింది. గతేడాది మిస్ యూనివర్స్‌గా నిలిచిన డేమీ లీ నీల్పీటర్స్ కాట్రియానాకు కిరీటాన్ని అలంకరించింది. ఫిలిప్పీన్స్ అధ్యక్షుడు రోడ్రిగో డ్యుటెర్టె కాట్రియానాకు అభినందనలు తెలిపారు. -
‘అవును, నేను మనుషుల్ని చంపాను’
మనీలా: ‘అవును, నా చేతులకు రక్తం అంటింది. మనుషులను కాల్చి చంపాను. నేనే చంపగలిగినప్పుడు మీరెందుకు చంపలేరని పోలీసులను ప్రశ్నించేందుకే చంపాను. నిర్భయంగా చట్టాన్ని చేతుల్లోకి తీసుకోండి, నేరస్థులను నిర్దాక్షిణ్యంగా చంపేయండని చెప్పడమే అక్కడ నా ఉద్దేశం. నేను దవావో మేయర్‌గా ఉన్నప్పుడు మోటారు బైక్ వేసుకొని వీధుల్లో తిరిగేవాణ్ని. ఎక్కడ సమస్య ఉత్పన్నమవుతుందా? అని చూసేవాణ్ని. నేరస్థులను ఎన్కౌంటర్లో చంపేందుకు అవకాశం కోసం వెతికేవాడిని. ఓసారి ఓ అమ్మాయిని రేప్ చేసేందుకు కిడ్నాప్ చేస్తారన్న అనుమానంతో ముగ్గురు వ్యక్తులను కాల్చి చంపాను’ అని చెప్పింది పాత నేరస్థుడో, అలనాటి హిట్లరో కాదు. ఆధునిక హిట్లర్‌గా పిలిపించుకుంటున్న ఫిలిప్పీన్స్ అధ్యక్షుడు రొడ్రిగో డూటర్టీ. తాను స్వయంగా హత్య చేశానంటూ ఆయన ఇంత సూటిగా ఒప్పుకోవడం ఆయన దేశాధ్యక్షుడిగా ఎన్నికైన నాటి నుంచి ఇదే మొదటిసారి. 2015, జూన్‌లో అధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి ఇప్పటి వరకు ఆయన ఎన్నో సంచలనాత్మక ప్రకటనలు చేశారు. ఆ తర్వాత ఆయన వాటిని ఖండించారు. డ్రగ్ మాఫియాపై ప్రత్యక్ష యుద్ధాన్ని ప్రకటించిన ఆయన ఇంతవరకు ఆరు వేల మందిని చట్ట విరుద్ధంగా చంపించారు. ఆయన దవావో మేయర్‌గా ఉన్నప్పుడు స్వయంగా ఓ యుజి సబ్మషిన్ గన్‌తో ఓ న్యాయశాఖ ఏజెంట్‌ను కాల్చి చంపాడని సెనేట్ విచారణ కమిటీ ముందు రొడ్రిగో హంతక ముఠా మాజీ సభ్యుడొకరు ఇటీవలనే వాంగ్మూలం ఇచ్చారు. ఇటీవల జరిగిన 2016, ఫిలిప్పినో అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో ‘నేను హంతకుడిని కాను’ అని చెప్పిన రొడ్రిగో మాట మార్చి మొన్న ఇక్కడ జరిగిన పారిశ్రామికవేత్తల సమావేశంలో తాను హత్యలు చేశానని ఒప్పుకున్నారు. హిట్లరు 30 లక్షల మంది యూదులను హతమార్చారని, తాను 30 లక్షల మంది డ్రగ్ బానిసలను హత్య చేసేందుకు ఆనందిస్తానని అధికారంలోకి వచ్చిన తొలినాళ్లలోనే ఆయన వ్యాఖ్యానించారు. మానవ హక్కులను తానేమాత్రం గౌరవించనని చెప్పుకునే రొడ్రిగోపై తాము అంతర్జాతీయ న్యాయస్థానానికి వెళతామని, ఆ న్యాయస్థానం తప్పకుండా ఆయన్ని శిక్షిస్తుందని దేశంలోని మానవ హక్కుల సంఘాలు హెచ్చరిస్తున్నాయి. -
పిలిప్పీన్స్‌లో బాంబు పేలుడు
-
పిలిప్పీన్స్‌లో బాంబు పేలుడు: అధ్యక్షుడే టార్గెట్?
మనీలా: పిలిప్పీన్స్ దక్షిణ ప్రాంతంలోని దవావో నగరంలో శుక్రవారం రాత్రి భారీ పేలుడు సంభవించింది. నగరంలోని ప్రఖ్యాత నైట్ మార్కెట్ వద్ద చోటుచేసుకున్న శక్తిమంతమైన పేలుడులో 14 మంది పౌరులు అక్కడికక్కడే మరణించగా, 60 మంది తీవ్రంగా గాయపడ్డారు. చనిపోయినవారిలో ఐదుగురు మహిళలు కాగా, గాయపడ్డవారిలో 30 మంది పోలీసులు ఉన్నారు. దవావో.. పిలిప్పీన్స్ అధ్యక్షుడు రోడ్రిగో డుటెర్టీ సొంత నగరం కావడం గమనార్హం. అంతేకాదు.. పేలుడు సంభవించినప్పుడు ఆయన కూడా అదే నగరంలో ఉన్నారు. కాగా, అధ్యక్షుడు సురక్షితంగా ఉన్నారని అధికార వర్గాలు ప్రకటించాయి. సరిగ్గా నైట్ మార్కెట్ సమీపంలోని మార్కో పోలో హోటల్ వద్ద ఈ పేలుడు చోటుచేసుకుంది. అధ్యక్షుడు రోడ్రిగో డుటెర్టీ తరచూ ఇదే హోటల్ కు వస్తుండటంతో ఆయనను లక్ష్యంగా చేసుకునే కుట్ర జరిగి ఉండొచ్చనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అయితే పోలీసులు మాత్రం దీనిని నిర్ధారించడంలేదు. 'పేలుళ్లకు గల కారణాలు, బాధ్యుల వివరాలేవీ ఇంకా తెలియరాలేదు' అని అధికారులు ప్రకటించారు. గాయపడినవారిని సమీపంలోని ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నామన్నారు. రోడ్రిగో కుమారుడు, ప్రస్తుత దవావో డిప్యూటీ మేయర్ పావ్ లో డుటెర్టీ పేలుడు ఘటనపై స్పందిస్తూ.. 'నాన్నగారు నగరంలో ఉన్నా, పేలుడు జరిగిన ప్రాంతానికి చాలా దూరంలో ఉన్నారు' అని మీడియాకు చెప్పారు. ప్రస్తుతం పిలిప్పీన్స్ లోనే ఉన్న తెలుగు విద్యార్థి బాలసాయి 'సాక్షి'కి ఫోన్ చేసి ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలను తెలిపారు. చనిపోయిన వారంతా పిలిప్పీన్స్ పౌరులేనని, భారతీయులు ఎవరూ లేరని తాను నిర్ధారించుకున్నట్లు బాలసాయి చెప్పారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అన్నారు. ప్రతి వీకెండ్ లో నైట్ మార్కెట్ సమీపంలోని మార్కోపోలో హోటల్ కు అధ్యక్షుడు రోడ్రిగో వస్తారని, ఆయనను లక్ష్యంగా చేసుకునే పేలుడు జరిగి ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నట్లు సాయి చెప్పారు. రెండు నెలల కిందటే అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన రోడ్రిగో.. డ్రగ్ మాఫియాపై ఉక్కుపాదం మోపారు. నెలన్నరగా పిలిప్పీన్స్ లోని పలు ప్రాంతాల్లో జరిగిన పోలీసు దాడుల్లో దాదాపు 2వేల మందిని మట్టుపెట్టారు. అధ్యక్షుడు కాకముందు రొడ్రిగో దవావో నగర మేయర్ గా 22 ఏళ్లు పనిచేశారు. ఆ కాలంలోనూ మాఫియాపై ఆయన పోరాటం కొనసాగింది. దేశాధ్యక్షుడయ్యాక ఆ పోరాటాన్ని మరింత ఉధృతం చేశారాయన. ఇప్పటికే దేశాధ్యక్షుడు రోడ్రిగో డుటెర్టీని చంపేయాలంటూ డ్రగ్ మాఫియా బహిరంగా ప్రకటించిన నేపథ్యంలో శుక్రవారం దవావో నగరంలో చోటుచేసుకున్న పేలుడు అనేక అనుమానాలకు తావిస్తున్నది.