‘అవును, నేను మనుషుల్ని చంపాను’
మనీలా: ‘అవును, నా చేతులకు రక్తం అంటింది. మనుషులను కాల్చి చంపాను. నేనే చంపగలిగినప్పుడు మీరెందుకు చంపలేరని పోలీసులను ప్రశ్నించేందుకే చంపాను. నిర్భయంగా చట్టాన్ని చేతుల్లోకి తీసుకోండి, నేరస్థులను నిర్దాక్షిణ్యంగా చంపేయండని చెప్పడమే అక్కడ నా ఉద్దేశం. నేను దవావో మేయర్‌గా ఉన్నప్పుడు మోటారు బైక్ వేసుకొని వీధుల్లో తిరిగేవాణ్ని. ఎక్కడ సమస్య ఉత్పన్నమవుతుందా? అని చూసేవాణ్ని. నేరస్థులను ఎన్‌కౌంటర్‌లో చంపేందుకు అవకాశం కోసం వెతికేవాడిని. ఓసారి ఓ అమ్మాయిని రేప్ చేసేందుకు కిడ్నాప్ చేస్తారన్న అనుమానంతో ముగ్గురు వ్యక్తులను కాల్చి చంపాను’ అని చెప్పింది పాత నేరస్థుడో, అలనాటి హిట్లరో కాదు. ఆధునిక హిట్లర్‌గా పిలిపించుకుంటున్న ఫిలిప్పీన్స్ అధ్యక్షుడు రొడ్రిగో డూటర్టీ.
తాను స్వయంగా హత్య చేశానంటూ ఆయన ఇంత సూటిగా ఒప్పుకోవడం ఆయన దేశాధ్యక్షుడిగా ఎన్నికైన నాటి నుంచి ఇదే మొదటిసారి. 2015, జూన్‌లో అధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి ఇప్పటి వరకు ఆయన ఎన్నో సంచలనాత్మక ప్రకటనలు చేశారు. ఆ తర్వాత ఆయన వాటిని ఖండించారు. డ్రగ్ మాఫియాపై ప్రత్యక్ష యుద్ధాన్ని ప్రకటించిన ఆయన ఇంతవరకు ఆరు వేల మందిని చట్ట విరుద్ధంగా చంపించారు. ఆయన దవావో మేయర్‌గా ఉన్నప్పుడు స్వయంగా ఓ యుజి సబ్‌మషిన్ గన్‌తో ఓ న్యాయశాఖ ఏజెంట్‌ను కాల్చి చంపాడని సెనేట్ విచారణ కమిటీ ముందు రొడ్రిగో హంతక ముఠా మాజీ సభ్యుడొకరు ఇటీవలనే వాంగ్మూలం ఇచ్చారు.
ఇటీవల జరిగిన 2016, ఫిలిప్పినో అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో ‘నేను హంతకుడిని కాను’ అని చెప్పిన రొడ్రిగో మాట మార్చి మొన్న ఇక్కడ జరిగిన పారిశ్రామికవేత్తల సమావేశంలో తాను హత్యలు చేశానని ఒప్పుకున్నారు. హిట్లరు 30 లక్షల మంది యూదులను హతమార్చారని, తాను 30 లక్షల మంది డ్రగ్ బానిసలను హత్య చేసేందుకు ఆనందిస్తానని అధికారంలోకి వచ్చిన తొలినాళ్లలోనే ఆయన వ్యాఖ్యానించారు. మానవ హక్కులను తానేమాత్రం గౌరవించనని చెప్పుకునే రొడ్రిగోపై తాము అంతర్జాతీయ న్యాయస్థానానికి వెళతామని, ఆ న్యాయస్థానం తప్పకుండా ఆయన్ని శిక్షిస్తుందని దేశంలోని మానవ హక్కుల సంఘాలు హెచ్చరిస్తున్నాయి.