బద్దలైన మేయాన్ అగ్నిపర్వతం, భారీగా ఎగిసిపడుతున్న లావా (పిలిప్పీన్స్)
లెగజ్పీ : పిలిప్పీన్స్‌లో బద్ధలైన అగ్నిపర్వతం అక్కడి ప్రజలను అతలాకుతలం చేస్తోంది. అక్కడి ప్రభుత్వాన్ని పరుగులు పెట్టిస్తోంది. దాని తీవ్రత కారణంగా మూడు నెలలపాటు దాని చుట్టుపక్కల అత్యవసర పరిస్థితి విధించారు. అందుకు తగిన ఏర్పాట్లు చేసేందుకు అక్కడి ప్రభుత్వం ప్రయాసపడుతుంది. ఇప్పటికే దాదాపు 81,000 మంది వేర్వేరు ప్రాంతాలకు తరలించి షెల్టర్లలో ఆశ్రయం కల్పించారు. పిలిప్పీన్స్‌లోని సెంట్రల్ ఆల్బే ప్రావిన్స్‌లోగల మేయాన్ అగ్ని పర్వతం బద్ధలైంది.
నాలుగో నెంబర్ ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. దీని ప్రకారం అతి ప్రమాదానికి కొద్ది దూరంలోనే ఉన్నట్లు అర్థం. అందులో నుంచి భారీ ఎత్తున లావా ఎగిసిపడుతోంది. దాని తీవ్రత ఎక్కువగా ఉండటంతో ముందస్తు భద్రతా చర్యల్లో ప్రభుత్వం లీనమైంది. అగ్నిపర్వతం చుట్టుపక్కల నుంచి ఖాళీ చేయించిన వారిని దాదాపు మూడు నెలలపాటు సంరక్షించాల్సిన బాధ్యత తమపైనే ఉందని, అందుకోసం అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆ దేశ విపత్తు నిర్వహణా అధికారులు చెప్పారు. ఆహారం అందించే విషయంలో తమకు ఎలాంటి బెంగలేదని, వాతావరణ పరిస్థితులు, శిబిరాల్లో ఉన్నవారి ఆరోగ్య పరిస్థితిలో ఎలాంటి మార్పు తీసుకొస్తుందోనని కొంత ఆందోళనగా ఉందని తెలిపారు. 69 పునరావాస శిబిరాల్లో దాదాపు 80వేలమందికి పైగా ఉంచామని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment