భారత్ జీడీపీ అంచనాలు కట్
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి భారత్ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటు అంచనాలను 3.7 శాతానికి కుదిస్తున్నట్లు ఫ్రాన్స్‌కి చెందిన బ్యాంకింగ్ దిగ్గజం బీఎన్‌పీ పారిబా వెల్లడించింది. గతంలో ఇది 5.2 శాతంగా ఉండొచ్చని అంచనా వేసింది. చిన్నపాటి అలజడి వేగంగా పెను సంక్షోభం స్థాయికి పెరిగిపోతోన్న నేపథ్యంలో వృద్ధి అంచనాలు తగ్గించినట్లు బీఎన్‌పీ తెలిపింది. రూపాయి బలహీనత, విద్యుత్ వ్య యాలు పెరిగిపోతుండటం, విధానపరమైన అనిశ్చితి ఇందుకు కారణమవుతున్నాయని వివరించింది. వచ్చే 6-9 నెలల్లో సమస్యలు తీవ్రరూపు దాలుస్తాయని పేర్కొంది. 2014-15లో పరిస్థితులు కాస్త మెరుగై జీడీపీ వృద్ధి 5.3 శాతంగా ఉండొచ్చని తెలిపింది.