
ఈ రోబో సూట్ ఉంటే మీరు ఉక్కు మనిషే..!
లండన్: అధునాతనమైన ఈ రోబో సూట్ ఉంటే.. మీరు కూడా హాలివుడ్ సూపర్‌హిట్ సినిమా ‘ఐరన్ మ్యాన్’లో హీరో మాదిరిగా ఒంటి చేతితోనే 50 కిలోల బరువుల్ని అలా పెకైత్తి ఇలా విసిరే యొచ్చు. ఒక్క తన్ను తన్ని.. పదిసార్లు తన్నినంత ఎఫెక్ట్ కలిగించవచ్చు. మనిషికి సూపర్‌మ్యాన్ బలాన్ని అందించగల ‘బాడీ ఎక్స్‌టెండర్’ అనే ఈ రోబో సూట్‌ను ఇటలీలోని ‘పర్‌సెప్చువల్ రోబోటిక్స్ లేబోరేటరీ (పెర్‌క్రో)’ ఇంజనీర్లు రూపొందించారు. ఇలాంటి రోబోటిక్ ఎక్సోస్కెలిటన్ల(బాహ్య అస్థిపంజరం)ను ఇదివరకే కొందరు తయారు చేసినా.. ఇదే అన్నింటికన్నా అత్యధునాతనమైన ఎక్సోస్కెలిటన్ అంటున్నారు పెర్‌క్రో ఇంజనీర్లు.
దీనిని ధరించినవారు వస్తువులపై ప్రయోగించే బలానికి ఈ రోబో సూట్ పదిరెట్ల బలాన్ని జతచేసి ప్రయోగిస్తుందని వారు చెబుతున్నారు. ఎలక్ట్రానిక్ మోటార్ల సాయంతో పనిచేసే ఈ సూట్ 22 డిగ్రీల కోణంలో సులభంగా తిరుగుతుందని, మనిషి దేహ కదలికలకు అనుగుణంగా ఉండేలా దీనిని అతి సంక్లిష్టతతో నిర్మించారని అంటున్నారు. ఉపయోగాలేంటంటే... భూకంపాల వంటివి సంభవించి భవంతులు కూలాయనుకోండి.. దీనిని ధరించి శిథిలాలను చకాచకా పెకైత్తుతూ క్షతగాత్రులను చాలా త్వరగా, సురక్షితంగా కాపాడొచ్చట. విమానాలు, ఇతర భారీ వాహనాల తయారీ, నిర్మాణాల సందర్భంగా బరువైన వస్తువులను పెకైత్తి చకాచకా అమర్చేయడం.. ఇంకా మరెన్నో ఉపయోగాలుంటాయనీ చెబుతున్నారు.