
రాజ్యసభ ఎంపీపై బాంబుదాడి
భగల్‌పూర్: బిహార్‌కు చెందిన మహిళా ఎంపీ కహకషాన్ పర్వీన్‌పై బాంబుదాడి జరిగింది. మున్సిపల్ ఎన్నికల ప్రచారం విషయమై కార్యకర్తలతో మాట్లాడుతున్న ఆమెపై దుండగులు బాంబు వేశారు. ఆదివారం రాత్రి జరిగిన ఈ సంఘటనలో పర్వీన్ తృటిలో తప్పించుకోగా ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. అందులో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. ఈ నేరానికి పాల్పడినవారిలో ఒకరిని అదుపులోకి తీసుకున్నామని భగల్‌పూర్ ఎస్‌ఎస్‌పీ మనోజ్ కుమార్ చెప్పారు.
జేడీ(యూ) పార్టీ నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్య వహిస్తోన్న కహకషాన్ పర్వీన్ భగల్‌పూర్‌లోని తన నివాసంలో మాట్లాడుతుండగా, రాత్రి 7:30 గంటలకు కరెంట్ పోయింది. ఇదే అదనుగా భావించి దుండగులు ఆమెపైకి బాంబులు విసిరారు. అయితే అవికాస్తా కొద్దిగా దూరంలో పడటంతో పెను ప్రమాదం తప్పింది. గాయపడిన ఆరుగురిలో ఎంపీ పర్వీన్ తండ్రి కూడా ఉన్నారు. భూతగాదాల కారణంగానే బాంబుదాడి జరిగి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు.