హైదరాబాద్: ఐఐటీల్లో ప్రవేశాల కోసం చేపట్టే జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్షను 2017లో నిర్వహించే బాధ్యతలను బాంబే ఐఐటీకి అప్పగిస్తూ ఐఐటీల కౌన్సిల్ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. ఈ మేరకు ఐఐటీల్లో ప్రవేశాలకు సంబంధించిన రిజిస్ట్రేషన్ ప్రక్రియ 2017 ఏప్రిల్‌లో ప్రారంభం కానుంది. జేఈఈ మెయిన్‌కు సంబంధించి విద్యార్థులకు ఇంటర్మీడియెట్ మార్కులకు ఇస్తున్న 40 శాతం వెయిటేజీని రద్దు చేస్తూ కేంద్ర మానవ వనరుల మంత్రిత్వ శాఖ ఇదివరకే నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.
ఇందులో భాగంగా ఎన్‌ఐటీలు, ట్రిపుల్ ఐటీల్లో ప్రవేశాల కోసం నిర్వహించే జేఈఈ మెయిన్ నోటిఫికేషన్ వచ్చే నెలలో కాని, నవంబర్‌లో కాని సీబీఎస్‌ఈ విడుదల చేయనుంది. జేఈఈ మెయిన్ పరీక్షను 2017 ఏప్రిల్‌లో నిర్వహించనుంది. జేఈఈ మెయిన్ తుది ర్యాంకులను ఇంటర్ మార్కుల వెయిటేజీ లేకుండానే జేఈఈ స్కోర్ ఆధారంగా ఖరారు చేయనుంది. వాటి ద్వారానే ఎన్‌ఐటీ, ట్రిపుల్ ఐటీల్లో ప్రవేశాలను చేపట్టనుంది.