వ్యాక్సిన్‌ల పేరుతో చెలగాటమా? | Guest Column About Covid 19 Vaccine By Anurag Mehra Bombay IIT Professor | Sakshi
Sakshi News home page

వ్యాక్సిన్‌ల పేరుతో చెలగాటమా?

Published Fri, Jul 17 2020 1:01 AM | Last Updated on Fri, Jul 17 2020 12:42 PM

Guest Column About Covid 19 Vaccine By Anurag Mehra Bombay IIT Professor - Sakshi

ఈ సంవత్సరం ఆగస్టు 15లోగా ప్రజలకు వినియోగంలోకి వచ్చేలా కరోనా వ్యాక్సిన్‌ని ఆవిష్కరిస్తామని భారతీయ వైద్య పరిశోధనా సంస్థ (ఐసీఎమ్‌ఆర్‌) 2020 జూలై 2న చేసిన ప్రకటన ప్రపంచవ్యాప్తంగా సంచలనం కలిగించింది. సానుకూలంగా కాకుండా శాస్త్ర ప్రపంచం ఆ ప్రకటనలోని డొల్లతనంపై తీవ్ర ఆక్షేపణ వ్యక్తం చేసింది. ఏ వ్యాక్సిన్‌కయినా తొలి రెండు దశల నమూనా పరీక్షలకు కనీసం 15 నెలల కాలం అవసరమైన నేపథ్యంలో ఒకటిన్నర నెలలలోపే కరోనా వ్యాక్సిన్‌ను ప్రజా వినియోగంలోకి తీసుకువస్తానంటూ ఐసీఎమ్‌ఆర్‌ చేసిన ప్రకటన మన శాస్త్రపరిశోధనల విశ్వసనీయతను దెబ్బతీసేలా ఉంది. శాస్త్ర పరిశోధనా సంస్థలు రాజకీయ పాక్షికతకు లోబడి ఇలాంటి ప్రకటనలు చేస్తే భారతీయ విజ్ఞాన శాస్త్రాల విశ్వసనీయతే దెబ్బతినే ప్రమాదముంది. అందుకే మనం ఏం ప్రచురిస్తున్నాం, ఏం చెబుతున్నాం అనే అంశంలో అత్యంత జాగరూకత ప్రదర్శించడం అవసరం.

అందరికంటే ముందంజలో ఉండాలనే భావనపై మనలో ఉన్న ఆశ, అభిరుచి అనేవి మన సాంస్కృతిక మనస్తత్వంలో భాగమై ఉంటున్నాయి. దాంట్లో భాగంగానే ఇప్పుడు ప్రపంచంలోనే మొట్టమొదటి కరోనా వ్యాక్సిన్‌ని కనిపెట్టి, ఉత్పత్తి చేయడంలో మనమే ప్రథమస్థానంలో ఉండాలని కోరుకుంటున్నాం. ఇప్పటికే ఇతర దేశాల్లో కరోనా వైరస్‌ నిరోధక వ్యాక్సిన్లపై పరిశోధనలు పుంజుకుని అభివృద్ధి మార్గంలో మనకంటే చాలా ముందు ఉంటున్న వాస్తవాన్ని మనం పట్టించుకోము. ఈ పరుగుపందెంలో గెలవడానికి ఉన్న ఒక మార్గం ఏదంటే, వ్యాక్సిన్‌ని మనమే ముందుగా రూపొందిస్తామని చెప్పడమే. పైగా అదెప్పుడు సాధ్యమవుతుందో కచ్చితమైన తేదీని కూడా ప్రకటించివేయడం.
కోవిడ్‌–19 వ్యాధికి వ్యతిరేకంగా ప్రభుత్వపరంగా సాగే పోరాటంలో ముందు ఉంటున్న భారతీయ వైద్య పరిశోధనా సంస్థ (ఐసీఎమ్‌ఆర్‌) 2020 జూలై 2న ఒక ప్రకటన చేసింది. క్లినికల్‌ ట్రయల్స్‌ పూర్తి చేశాక, ఈ సంవత్సరం ఆగస్టు 15లోగా వ్యాక్సిన్‌ని ఆవిష్కరిస్తామని అది తెలియజేసింది. వ్యాక్సిన్‌ పేరు కోవాక్సిన్‌. ఐసిఎమ్‌ఆర్‌తో కలిసి పనిచేస్తున్న హైదరాబాద్‌కి చెందిన భారత్‌ బయోటెక్‌ కంపెనీ ఈ వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేస్తోంది. కానీ, ఇంతతక్కువ కాలంలో వ్యాక్సిన్‌ని విడుదల చేస్తామని, ఆ ఉత్తరంలో సంకేతించిన ధ్వని తీవ్ర విమర్శలను ఎదుర్కొంది. ప్రధాన సమస్య ఏమిటంటే ఖచ్చితంగా ఫలానా తేదీన వ్యాక్సిన్‌ విడుదల చేస్తామంటూ గడువు తేదీని ప్రకటించడమే. వ్యాక్సిన్‌ని క్లిని కల్‌ ట్రయల్‌కు సమర్పించాలంటే కచ్చితంగా మనుషులను వినియోగించాలి. క్లినికల్‌ దశకు ముందు చేసే ఈ ప్రక్రియలో జంతువులపై ముందుగా వ్యాక్సిన్‌ని ప్రయోగిస్తారు. వాటిపై ఫలి తాలు మెరుగ్గా ఉంటేనే తర్వాత మానవులపై దాన్ని ప్రయోగిస్తారు. 

మనుషులపై వ్యాక్సిన్‌ ప్రయోగించే తొలిదశకు కొంతమంది అభ్యర్థులు అంటే కొన్ని పదుల సంఖ్యలో మాత్రమే సరిపోతారు. భద్రత, డోసేజ్‌ స్థాయిల గురించి పరీక్షించడమే ఈ దశ లక్ష్యం. వీరిని 24 గంటలపాటు పరిశీలనలో ఉంచి ఏవైనా తీవ్ర దుష్పలితాలు సంభవిస్తాయా, వీరి రోగినిరోధక వ్యవస్థ ఎలా స్పందిస్తోంది అని గమనిస్తారు. ఇక రెండోదశలో అసంఖ్యాక ప్రజలపై నమూనా పరీక్షలు చేస్తారు. దీనికోసం కొన్ని వేలమంది అవసరమవుతారు. దీంట్లో కూడా వయసు, లింగం వంటి అంశాలకు సంబంధించి వేర్వేరు గ్రూపులను ఎంచుకుంటారు. ఈ దశ లక్ష్యం ఏమిటంటే రోగుల భద్రత, వ్యాక్సిన్‌ ఉత్పత్తి చేసే యాంటీబాడీస్‌ స్థాయి, రకం గురించి తెలుసుకోవడమే. సరైన రకం యాంటీబాడీస్‌ను వ్యాక్సిన్‌ అభివృద్ధి చేసిందని, గణనీయ సంఖ్యలో ఇవి ఉత్పత్తయ్యాయని తేలిన తర్వాతే మూడో దశ ట్రయల్‌ మొదలవుతుంది. 

ఈ దశలో భారీ సంఖ్యలో ప్రజలపై ఈ వ్యాక్సిన్‌ సమర్థంగా పనిచేస్తుందా అని తనిఖీ చేస్తారు. దీనికోసం వేలాదిమంది మనుషుల అవసరం ఉంటుంది. వాస్తవంగా మనుషులపై ఈ వ్యాక్సిన్‌ పనిచేస్తుందా లేక పనిచేయదా అనేది కనిపెట్టడమే ఈ మూడో దశ లక్ష్యం. రోగాన్ని పూర్తిగా నయం చేస్తుందా లేదా అని తెలుసుకునేందుకు కూడా ఈ దశలో పరీక్షిస్తారు. భారీ సంఖ్యలో ప్రజలపై దీన్ని ప్రయోగించాలంటే సంవత్సరాల సమయం కూడా పట్టవచ్చు. అంతిమంగా ప్రజల వినియోగంలోకి రావడానికి అసంఖ్యాకంగా వ్యాక్సిన్‌లను ఉత్పత్తి చేయడానికి కూడా సమయం పడుతుంది. నేడు ప్రపంచ వ్యాప్తంగా 135 వ్యాక్సిన్లు క్లినికల్‌ దశకు ముందు దశలో సాగుతున్నాయి. వీటిలో 30 వ్యాక్సిన్‌లను మనుషులపై ప్రయోగిస్తున్నారు. ఈ మొత్తం ప్రక్రియలో భారతీయ కోవాక్సిన్‌ స్థానం ఎక్కడ? మొదటి, రెండో దశ ట్రయల్స్‌ నిర్వహించడానికి ఇది ఆమోదం పొందింది. ట్రయల్స్‌ నిర్వహించేదుకు చివరి తేదీ జూలై 7 అని చెప్పారు.

ప్రపంచంలో అనేక ఇతర వ్యాక్సిన్‌లు కూడా ఇప్పటికే 1, 2వ దశల్లో ఉన్నాయి కొన్నయితే 3వ దశలో ప్రవేశించాయి కూడా. ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీ రూపొందించిన కోవిడ్‌–19 వ్యాక్సిన్‌ 2020 జూలై 1నే మూడో దశ ట్రయల్స్‌ని ప్రారంభించింది. దీని ఫలితాలు ఏ రోజైనా వెలుగులోకి రావచ్చు. కోవాక్సిన్‌ ప్రీ–క్లినికల్‌ దశ పరీక్ష 50 రోజుల పాటు జరగాల్సి ఉండగా అది ఇప్పటికీ ప్రజలకు అందుబాటులో కనబడలేదు. ఇది శాస్త్రీయ కృషి విషయంలో ఏమాత్రం ఆమోదనీయమైంది కాదు. ట్రయల్స్‌ దశలో ఉంటున్న ఇతర వ్యాక్సిన్లతో పోలిస్తే కోవాక్సిన్‌ వ్యాక్సిన్‌ విషయంలో చెబుతున్న సమయం చాలా తక్కువ అనే చెప్పాలి. గత 28 రోజులుగా తొలి దశ ట్రయల్స్‌ని 375 మందిపై ప్రయోగించాల్సి ఉంది. ఇక రెండో దశ అయితే 750 మందిపై ప్రయోగిస్తూ 14 నెలలపాటు కొనసాగిస్తారు. అంటే భారత్‌ బయోటెక్‌ వ్యాక్సిన్‌ తొలి రెండు దశల ట్రయల్స్‌ పూర్తి కావాలంటే కూడా మరో 15 నెలల సమయం పడుతుంది. 

తన ప్రకటనపై తీవ్ర ఆక్షేపణలు రావడంతో ఐసీఎమ్‌ఆర్‌ అవాంఛితమైన జాప్యందారీ ధోరణులను తొలగించడమే తన ఉద్దేశమని జూలై 2న మరో వివరణ ఇచ్చింది. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ కూడా భద్రత, రక్షణ విషయంలో ఎలాంటి రాజీ పడకుండానే ట్రయల్స్‌ నిర్వహిస్తామని ప్రకటించింది. అయితే వ్యాక్సిన్‌ భద్రతపై ఇవి హామీ ఇస్తున్నాయి తప్పితే ప్రజావినియోగంలోకి తీసుకొస్తామంటూ ప్రకటించిన గడువుతేదీ విషయంలో స్పష్టత ఇవ్వడం లేదు. ఇండియన్‌ అకాడెమీ ఆఫ్‌ సైన్సెస్‌ మరొక ప్రకటన చేస్తూ ఐసీఎమ్‌ఆర్‌ విధించిన గడువుతేదీ హేతువిరుద్ధంగా ఉందని, ఇంతకుముందు ఇలా వ్యాక్సిన్‌ విడుదలపై గడువు తేదీనీ ఎవరూ ప్రకటించలేదని ఆక్షేపించింది. ఈ విషయంలో మరిన్ని తీవ్రమైన అంశాలు కూడా దాగి ఉన్నాయి. వాటిలో మొదటిది ఇలాంటి ప్రకటనల విషయంలో పాటించాల్సిన జాగరూకత. వ్యాక్సిన్‌ ట్రయల్స్‌ అనేవి పరీక్షలకోసం స్వచ్చందంగా ముందుకొచ్చే వలంటీర్ల శరీరాల్లో కలిగే మార్పులతో కూడి ఉంటాయి. అన్ని జాగ్రత్తలూ తీసుకున్నప్పటికీ ఇలాంటి వలంటీర్లలో స్వల్పకాలిక, దీర్ఘకాలిక దుష్ఫలితాలు కలిగే అవకాశం కూడా ఉంటుంది. వీటిలో కొన్ని ఊహించనివి జరుగుతాయి, మరికొన్ని తీవ్ర స్థాయిలో కూడా పరిణమిస్తాయి. కొన్ని సందర్భాల్లో వ్యాక్సిన్‌ అసలు వ్యాధిని మరింత తీవ్రతరం చేయవచ్చు కూడా.

కాబట్టి రెండో దశ నమూనా పరీక్షలు వ్యాక్సిన్‌ భద్రతను పూర్తి స్థాయిలో నిర్దారించాల్సి ఉంది. మూడో దశ నమూనా పరీక్షల్లో ఏదైనా అవాంఛిత లోపం బయటపడితే, అది అప్పటికే వ్యాక్సిన్‌ని తమ శరీరాలపై ప్రయోగించుకున్న వేలాది వలంటీర్లు ఫలితంలేని యాంటీ వైరల్‌ కవచాన్ని మోసేవారుగానూ, లేకుంటే వ్యాక్సిన్‌ వేయించుకున్నప్పటికీ వ్యాధి బారిన పడేవారుగానూ మిగిలిపోయే ప్రమాదం ఉంది. అందుకే వ్యాక్సిన్‌ల విషయంలో ఎలాంటి తప్పు నిర్ణయం తీసుకున్నా, మొత్తం ప్రక్రియలో ఏ దశలో నైనా సరే రాజీపడినా, భారతపౌరులపై అది దీర్ఘకాలంలో తీవ్రమైన దుష్ఫలితాలకు దారితీయవచ్చని భారతీయ శాస్త్ర పరిశోధనా అకాడెమీ తేల్చి చెప్పింది.

ఈ మొత్తం ఉదంతం ప్రభుత్వ సంస్థల స్వయం ప్రతిపత్తిపైనే సందేహాలను రేకెత్తిస్తోంది. ప్రత్యేకించి కొన్ని నిర్దిష్ట సంస్థలు వృత్తితత్వాన్ని పక్కనబెట్టి రాజకీయ పాక్షిక ధోరణులకు ప్రాధాన్యమిస్తున్నట్లు తెలుస్తోంది. ఇలాంటి సంస్థల విశ్వసనీయ అంచనాలు రాజకీయాలకు ప్రభావితమవుతున్నట్లుంది. అంతకుమించి భారతీయ శాస్త్రజ్ఞులు, నిపుణులు పరిశోధనల ప్రాధమికాంశాల పట్ల కూడా సీరియస్‌గా లేరని అంతర్జాతీయంగా విమర్శలు చెలరేగే ప్రమాదం కూడా ఉంది. పైగా ఐసీఎమ్‌ఆర్‌ ప్రకటించినట్లుగా గడువుతేదీలోపు వ్యాక్సిన్‌ విడుదల సాధ్యం కాకపోతే, ఇకపై భారతీయ శాస్త్రపరిశోధనా సంస్థలు వెలువరించే ప్రకటనలను పూర్తి అవిశ్వాసంతో చూసే ప్రమాదం కూడా ఉంది. తమ విశ్వసనీయతనే కోల్పోయిన పక్షంలో కరోనా వ్యాధి కట్టడికోసం మాస్కులు ధరించండి, భౌతిక దూరం పాటిం చండి అంటూ ప్రభుత్వ సంస్థలు చేసే అధికారిక ప్రకటనలను కూడా జనం విశ్వసించడం తగ్గిపోతుంది.

చివరగా, నేటి ప్రపంచంలో సోషల్‌ మీడియాలో భరించలేనంత స్థాయిలో నానా చెత్త సమాచారం ప్రచారమవుతోంది. ఎవరూ నిజం చెప్పడంలేదని జనాభాలో ఎక్కువమంది నమ్ముతున్న తరుణంలో శాస్త్ర నిపుణులు కూడా తమ విలువ కోల్పోయే ప్రమాదం ఉంది. ఇప్పటికే శాస్త్రజ్ఞులు ప్రచురిస్తున్న నాణ్యత లేని పరిశోధనా పత్రాలకు తోడు దేశాధ్యక్షులు కూడా కోవిడ్‌–19 కట్టడి గురించి చేస్తున్న మతిలేని ప్రకటనలు ప్రజల్లో విశ్వసనీయతను మరింత తగ్గించే అవకాశం ఎంతైనా ఉంది. అందుకే మనం ఏం ప్రచురిస్తున్నాం, ఏం చెబుతున్నాం అనే అంశంలో అత్యంత జాగరూకత ప్రదర్శించడం అవసరం.

అనురాగ్‌ మెహ్రా,
కెమికల్‌ ఇంజనీరింగ్‌ ప్రొఫెసర్, ఐఐటీ బాంబే 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement