నిలువునా కూలిపోయిన వంతెన!
హిమాచల్‌ప్రదేశ్‌లోని కాంగ్రా జిల్లాలో భారీ వర్షాలకు ఓ వంతెన కూలిపోయింది. భారీగా వరదనీరు ప్రవహిస్తుండటంతో 44 ఏళ్ల క్రితం కట్టిన ఈ వంతెన మధ్యలో భాగం మొత్తం కుప్పకూలింది. దీనికి సంబంధించిన వీడియోను ఎవరో సెల్‌ఫోనులో చిత్రించారు. వంతెన మొత్తం పొడవు 160 మీటర్లు ఉంటుంది. అందులో క ఒంత భాగం సహా దాని పిల్లర్లు కూడా మొత్తం పడిపోయి వరదల్లో కొట్టుకుపోయాయి. మొత్తం 76 మీటర్ల మేర వంతెన, పది పిల్లర్లు వరదలో కొట్టుకుపోయినట్లు అధికారులు చెప్పారు.
హిమాచల్ ప్రదేశ్‌లోని నూర్‌పూర్ తాలూకాకు, పొరుగునే ఉన్న పంజాబ్ రాష్ట్రానికి మధ్య రాకపోకలు సాగించడానికి ఈ వంతెనే ప్రధానమైన ఆధారం. అదృష్టవశాత్తు వంతెన కూలిన సమయంలో దాని మీద ఎవరూ రాకపోకలు సాగించకపోవడంతో ఎవరూ గాయపడలేదు. పిల్లర్లకు బీటలు వారినట్లు గుర్తించిన అధికారులు బుధవారం నుంచే దానిమీద రాకపోకలను నిలిపివేశారు. పది రోజుల క్రితం ముంబై-గోవా జాతీయ రహదారిపై బ్రిటిష్ కాలంలో నిర్మించిన ఓ వంతెన కూలిపోయి రెండు బస్సులు కొట్టుకుపోయిన విషయం తెలిసిందే.