నాపై లైంగికదాడి చేశాడు: మహిళా ఎంపీ
లండన్: బ్రిటన్ మహిళా ఎంపీ మిచెల్లీ థామ్సన్ తన చిన్నతనంలో జరిగిన దారుణాన్ని వెల్లడించారు. మహిళలపై జరుగుతున్న దారుణాల గురించి గురువారం పార్లమెంట్‌లో ఆమె మాట్లాడుతూ.. తాను కూడా లైంగికదాడి బాధితురాలినని చెప్పారు.
‘14 ఏళ్ల వయసులో నాపై లైంగిక దాడి జరిగింది. ఎంతో భయపడ్డాను. దాడి నుంచి తప్పించుకోలేకపోయాను. ఏడుస్తూ ఒంటరిగా ఇంటకి వెళ్లిపోయాను. తల్లిదండ్రులకు ఈ విషయం చెప్పలేదు. స్నేహితులకు కూడా చెప్పలేదు. పోలీసులకు ఫిర్యాదు చేయలేదు. ఈ దారుణ విషయాన్ని నాలోనే దాచుకుని కుమిలిపోయాను’ అని మిచెల్లీ చెప్పారు. నిందితుడు తనకు తెలిసినవాడేనని, మాయమాటలతో నమ్మించి అఘాయిత్యానికి పాల్పడ్డాడని వెల్లడించారు. తన జీవితం నాశనమైందని భావించానని, కోలుకోవడానికి చాలా సమయం పట్టిందని చెప్పారు. తనపై జరిగిన దారుణం గురించి చెప్పడానికి భయపడటం లేదని అన్నారు. సమాజంలో మహిళలపై జరుగుతున్న దారుణాలను అరికట్టాలని పిలుపునిచ్చారు. మహిళల భద్రతకు చర్యలు తీసుకోవాలని కోరారు. మిచెల్లీ ప్రసంగం ఆలోచింపచేసే విధంగా ఉందని ఎంపీలు అన్నారు. ఆమె ప్రసంగాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. మరో మహిళా ఎంపీ ట్రేసీ బ్రాబిన్ మాట్లాడుతూ తాను 20 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు ఓ వ్యక్తి అత్యాచారయత్నం చేశాడని, లక్కీగా తప్పించుకోగలిగానని తెలిపారు. ఆ తర్వాత ఎప్పుడూ పక్కన కత్తి పెట్టుకుని నిద్రించేదాన్నని చెప్పారు.