తల్లీకూతుళ్లపై గ్యాంగ్ రేప్: డాక్టర్, పోలీసుల అమానుషం
బులంద్షహర్: 'కనీసం సాధారణ రోగుల్లానైనా మమ్మల్ని చూడలేదు. నా ఒంటినిండా గాయాలున్నాయి. నా కూతురికేమో విపరీతమైన రక్తస్రావం. అమ్మా.. ఏదో ఒకటి చెయ్యండమ్మా లేకుంటే నా బిడ్డ చనిపోతుందని డాక్టర్ కు మొరపెట్టుకున్నా. కానీ ఆమె మమమల్ని పట్టించుకోలేదు. మాపై సామూహిక అత్యాచారం జరిగిందని చెబితే ఆ డాక్టర్ నమ్మలేదు. పైగా, నోరుమూసుకొని వెళ్లి ఆ మూలన కూర్చోండని కసిరింది'.. ఇదీ.. ఉత్తరప్రదేశ్ లోని బులంద్ షహర్ లో గ్యాంగ్ రేప్ కు గురైన మహిళ ఇచ్చిన వాంగ్మూలం. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఆ పాశవిక ఘటనకు సంబంధించి ఘోరవాస్తవాలు ఒకొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితురాళ్లలో కూతురు ఇంకా షాక్ నుంచి తేరుకోలేదు. తల్లి తమకు జరిగిన అవమానంపై కుమిలిపోతున్నది.
నోయిడాకు చెందిన టాక్సీడ్రైవర్ తన కుటుంబంతో కలిసి శుక్రవారం రాత్రి షాజహాన్ పూర్ (యూపీ) బయలుదేరగా.. ఢిల్లీకి 65 కిలోమీటర్ల దూరంలో కాన్పూర్ హైవేపై గల బులంద్ షహర్ వద్ద దుండగులు కారును అటకాయించి, లోపల ఉన్నవారిని బయటికిలాగి, పొలాల్లోకి తీసుకెళ్లి పురుషులను చెట్లకు కట్టేసి, తల్లి, 14 ఏళ్ల కూతురిపై అఘాయిత్యానికి పాల్పడ్డారు. రాత్రి 1:30కు దారుణం జరిగితే తెల్లవారి 5:30కు గానీ పోలీసులు స్పందించలేదని బాధితురాలి కుటుంబసభ్యుడు చెప్పాడు. 'రెండు గంటలు నరకం చూపించి దుండగులు వెళ్లిపోయిన తర్వాత కట్లు ఊడదీసుకుని, అరగంటపాటు పోలీస్ హెల్ప్ లైన 100కు ఫోన్ చేస్తూనే ఉన్నా. కానీ నంబర్ బిజీ అని సమాధానం వచ్చింది. తర్వాత మా వాళ్లను ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లా. అక్కడి మహిళా డాక్టర్ మమ్మల్ని పట్టించుకోలేదు. తెల్లవారాకగానీ పోలీసులు మా దగ్గరికి రాలేదు. వాళ్లు కూడా మా కుటుంబీకులపై అత్యాచారం జరిందంటే నమ్మలేదు. నాటకాలాడుతున్నామన్నట్లు మాట్లాడారు' అని బాధిత మహిళ మరిది మీడియాకు వివరించారు.
తమపై జరిగిన అకృత్యం అందరికీ తెలిసిపోయినందుకు సిగ్గుపడుతున్నామని, మళ్లీ నోయిడా వెళ్లి తలెత్తుకుని తిరగలేమని బాధితమహిళ మంగళవారం మీడియా ముందు ఆవేదన వ్యక్తం చేసింది. తన కూతురు ఇంకా షాక్ నుంచి తేరుకోలేదని, ఆమె గురించి తామంతా కుమిలిపోతున్నామని పేర్కొంది. దోషులను పట్టుకుని ఉరి తీయాలని, లేకుంటే తామే ఉరివేసుకుని చనిపోతామని దగ్ధస్వరంతో రోదించింది. కాగా, పోలీసులు అదుపులోకి తీసుకున్న అనుమానితుల్లో ముగ్గురిని బాధిత కుటుంబీకులు గుర్తుపట్టారని, మరో ఐదుగురు ఇంకా పరారీలోనే ఉన్నారని బులంద్ షహర్ పోలీసులు తెలిపారు.