పోలవరం నిర్మాణానికి ఎస్పీవీ ఏర్పాటు
* కేంద్ర మంత్రివర్గం ఆమోదం
సాక్షి, న్యూఢిల్లీ: పోలవరం ప్రాజెక్టు నిర్మాణ బాధ్యతలు అప్పగించడానికి వీలుగా ఎస్పీవీ(స్పెషల్ పర్పస్ వెహికల్) ఏర్పాటు చేయాలనే ప్రతిపాదనకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్ అధ్యక్షతన గురువారం జరిగిన కేబినెట్ భేటీలో ఈమేరకు నిర్ణయం తీసుకున్నారు. పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పిస్తామంటూ ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ బిల్లులో పేర్కొన్న విషయం విదితమే.
జాతీయ హోదా దక్కితే ప్రాజెక్టు వ్యయాన్ని కేంద్రమే భరిస్తుంది. ప్రాజెక్టు నిర్మాణానికి దాదాపు రూ. 20వేల కోట్లు వ్యయుం కానున్నట్లు అంచనా. అందులో రూ. 18వేల కోట్లు కేంద్రం సమకూర్చనుంది. ప్రాజెక్టు అనుమతులు సంపాదించే బాధ్యతను కూడా కేంద్రమే తీసుకుంటుంది. నిర్వాసితులకు పునరావాసం కల్పించడం, వారికి నష్టపరిహారం చెల్లించడం కూడా కేంద్రమే చూసుకుంటుంది. ఎస్పీవీ ఏర్పాటు చేయడం ద్వారా వేగంగా అనుమతులు సంపాదించడానికి, నష్టపరిహారం చెల్లించడానికి, పునరావాసం కల్పించడానికి వీలవుతుందని అధికారవర్గాలు తెలిపాయి.