
టీ-నోట్ తయారీ షురూ!
ప్రాథమిక ముసాయిదా నోట్ రూపకల్పనకు హోంశాఖ కసరత్తు
సాక్షి ప్రత్యేక ప్రతినిధి, న్యూఢిల్లీ:
ప్రత్యేక తెలంగాణ ఏర్పాటుకు సంబంధించి కేంద్ర హోంశాఖ ‘కేబినెట్ నోట్’ రూపకల్పనపై కసరత్తు ప్రారంభించినట్లు ఉన్నతస్థాయి వర్గాలు వెల్లడించాయి. రాష్ట్ర విభజన కసరత్తును ముందుకు తీసుకెళ్లేందుకు వీలుగా.. తెలంగాణ ఏర్పాటుపై ప్రాథమిక ముసాయిదా నోట్‌ను రూపొందించాల్సిందిగా తమకు పై నుంచి ఆదేశాలు అందాయని హోంశాఖ వర్గాలు శనివారం ‘సాక్షి’కి తెలిపాయి. అయితే.. ఈ ముసాయిదా నోట్ రూపకల్పనకు ఎలాంటి తుది గడువూ లేదని చెప్పాయి. ఈ ప్రక్రియలో చాలా జాగ్రత్తలు పాటించాల్సి ఉన్నందున కొంత సమయం పడుతుందని పేర్కొన్నాయి. కేబినెట్ ముసాయిదా నోట్‌ను ఒక పత్రంగా వ్యవహరిస్తూ.. ‘అత్యంత రహస్యం (టాప్ సీక్రెట్)’ గా వర్గీకరించటం జరుగుతుందని హోంశాఖ వర్గాలు తెలిపాయి. హోంశాఖలో కొన్ని ఫైళ్లను ‘సీక్రెట్’ ఫైళ్లుగా వర్గీకరించటం సాధారణమైనప్పటికీ.. ‘టాప్ సీక్రెట్’గా వర్గీకరించటం చాలా అరుదని పేర్కొన్నాయి. ఈ నోట్‌లో తెలంగాణను ‘టి’ అనే అక్షరంతో వ్యవహరిస్తారని చెప్పాయి. నోట్ ఏడెనిమిది పేజీల నిడివి ఉంటుందని.. దానికి కొన్ని అనుబంధ పత్రాలు, మరికొన్ని వివరణలు ఉంటాయని తెలుస్తోంది.
సంప్రదింపుల వల్లే జాప్యం...
తెలంగాణపై కేబినెట్ నోట్ రూపకల్పనలో జాప్యానికి.. కేంద్ర ప్రభుత్వం లోపలా, వెలుపలా గల భాగస్వాములతో ఇప్పటివరకూ కొనసాగుతున్న సంప్రదింపులే కారణమని హోంశాఖ వర్గాలు చెప్పాయి. ‘ఇప్పుడు.. పార్టీలో అంతర్గతంగా, ఆంధ్రప్రదేశ్‌లోని రాజకీయ భాగస్వాములతో, యూపీఏ మిత్రపక్షాలతో సంప్రదింపులు పూర్తయ్యాయి కాబట్టి.. మేం ఇక దేనికోసమూనిరీక్షించాల్సిన అవసరం లేదు’ అని పేర్కొన్నాయి. అయితే.. కేంద్ర హోంమంత్రి దేశ రాజధానిలో అందుబాటులో లేకపోవటం, ఆయన అనారోగ్య పరిస్థితులు వంటి ఇతరత్రా అంశాల వల్ల నోట్ ముసాయిదా తయారీకి సమయం పడుతుందన్నాయి. అదీగాక.. నోట్ రూపకల్పనలో అన్ని కీలక ప్రమాణాలనూ పరిగణనలోకి తీసుకోవాల్సి ఉందని పేర్కొన్నాయి. నోట్‌లో ఎలాంటి అస్పష్టతకూ తావులేకుండా, ఎలాంటి వైరుధ్యాలూ లేకుండా పూర్తిస్థాయిలో ఒక క్రమబద్ధత ఉండేలా చూడాల్సి ఉంటుందని, సంబంధిత వివరాలన్నిటినీ పొందుపరచాల్సి ఉంటుందని వివరించాయి. సీమాంధ్ర సమస్యలపై ఆందోళనల గురించి ప్రస్తావించగా.. ‘అది మాకు సంబంధించిన విషయం కాదు. నిర్ణయం ప్రభుత్వానిది. ఆ ఆందోళనలను పరిశీలించేందుకు ఇతర కమిటీలు ఉన్నాయి. మా పని.. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ముందుకెళ్లటం. మేం ఆ పనిలో ఉన్నాం’ అని స్పష్టం చేశాయి.