
బ్యాగులో పట్టే కారు
ఈ కారుకు పార్కింగ్ అక్కర్లేదు. ఇంధనం సమస్య కాదు. ఆఫీసుకు చేరుకున్నాక ఎంచక్కా బ్యాగులో పెట్టేసుకోవచ్చు. ల్యాప్‌టాప్‌ను చార్జింగ్ పెట్టినట్లు మన డెస్క్‌మీదే చార్జింగ్ పెట్టేసుకోవచ్చు. నగరాల్లో సులభమైన రాకపోకలు సాగించడం ఎలా అని ఆలోచిస్తున్న 26 ఏళ్ల జపాన్ ఇంజనీర్ కునైకో సైటోకు తట్టిన ఐడియా ఇది. అల్యూమినియంతో చేసిన దీని బరువు జస్ట్ మూడు కిలోలే. పైకి స్కేటింగ్ బల్లలా (దీర్ఘచతురస్రాకారంలో ఉంటుంది) ఉండే దీనికి కిందివైపు నాలుగు చక్రాలు ఉంటాయి.
లిథియం బ్యాటరీతో పనిచేసే ఈ ఎలక్ట్రికల్ కారును మూడు గంటలు చార్జ్ చేస్తే... 12 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుంది. 120 కేజీల బరువు వరకు మోయగలదు. నడపడమంటూ ఏమీలేదు. ఎక్కి నిలబడితే కదులుతుంది. రైడ్ చేసే వాళ్లు శరీరబరువును ఎటువైపు వేస్తే అటు మలుపు తిరుగుతుంది. కిందికి దిగితే ఆగిపోతుంది. గంటకు 10 కిలోమీటర్ల గరిష్ట వేగంతో వెళ్లగలదు. ఇదేదో బాగుంది కదూ!