
‘ఓటుకు కోట్లు’ కేసుపై గవర్నర్ ఆరా
ఓటుకు కోట్లు కేసులో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు పాత్రపై దర్యాప్తు చేయాలని ఏసీబీని ప్రత్యేక కోర్టు ఆదేశించిన నేపథ్యంలో మంగళవారం ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకున్నాయి.
- రాజ్‌భవన్‌లో సీఎం కేసీఆర్‌తో సుదీర్ఘంగా మంతనాలు
- సీఎం బయటకొచ్చిన కాసేపటికే ఏసీబీ డీజీ, ఏజీతో గవర్నర్ చర్చలు
- కేసు పురోగతి, కోర్టు వ్యాఖ్యలను అడిగి తెలుసుకున్న నరసింహన్
సాక్షి, హైదరాబాద్: ఓటుకు కోట్లు కేసు పురోగతిపై గవర్నర్ నరసింహన్ ఆరా తీశారు. ఈ కేసులో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు పాత్రపై దర్యాప్తు చేయాలని ఏసీబీని ప్రత్యేక కోర్టు ఆదేశించిన నేపథ్యంలో మంగళవారం ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకున్నాయి. అసెంబ్లీ సమావేశాల నిరవధిక వాయిదా అనంతరం ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు గవర్నర్‌తో భేటీ అయ్యారు. మంగళవారం మధ్యాహ్నం రాజ్‌భవన్‌కు వెళ్లిన సీఎం దాదాపు రెండు గంటల పాటు గవర్నర్‌తో చర్చలు జరిపారు. ఉభయ సభల్లో జీఎస్టీ బిల్లును ఆమోదించిన విషయాన్ని ఈ సందర్భంగా వివరించారు. అన్ని పక్షాలు ఏకగీవ్రంగా బిల్లును అంగీకరించాయని, అసెంబ్లీ ఆమోదముద్ర వేసి పార్లమెంట్‌కు చేరవేసినట్లు గవర్నర్‌కు నివేదించారు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం గవర్నర్ అనుమతితో జారీ చేసిన మూడు ఆర్డినెన్స్‌లను ఇదే సమావేశంలో బిల్లులుగా ప్రవేశపెట్టినట్లుగా వివరించారు. ఓటుకు కోట్లు కేసు దర్యాప్తుపై సీఎం, గవర్నర్‌ల మధ్య చర్చ జరిగినట్లు తెలిసింది.
ముఖ్యమంత్రి రాజ్‌భవన్ నుంచి బయటకు వచ్చిన కొద్దిసేపటికే ఈ కేసును దర్యాప్తు చేస్తున్న ఏసీబీ డీజీ ఏకే ఖాన్, అడ్వొకేట్ జనరల్ రామకృష్ణారెడ్డి గవర్నర్‌ను కలిసేందుకు వెళ్లడం గమనార్హం. దాదాపు 15 నిమిషాల పాటు వీరిద్దరూ గవర్నర్‌తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా కేసు పురోగతి, ఏపీ సీఎం చంద్రబాబుపై ప్రత్యేక కోర్టు చేసిన వ్యాఖ్యలను గవర్నర్ అడిగి తెలుసుకున్నట్లు సమాచారం. దీంతో మరోసారి ఈ కేసు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ అలజడి రేపుతోంది. సీఎం కేసీఆర్ వెంట వెళ్లిన రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ కూడా గవర్నర్‌ను కలుసుకున్నారు.