Celkon CMD Y Guru
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: మొబైల్ ఫోన్ల విక్రయ రంగంలో ఉన్న సెల్‌కాన్.. క్యాంపస్ సిరీస్‌లో ఏ63, ఏ60 స్మార్ట్‌ఫోన్లను మంగళవారమిక్కడ విడుదల చేసింది. 4 అంగుళాల కెపాసిటివ్ టచ్ డిస్‌ప్లే, ఆండ్రాయిడ్ 4.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టమ్, 1.2 గిగాహెట్జ్ డ్యూయల్‌కోర్ ప్రాసెసర్, 3.2 ఎంపీ కెమెరా వంటి ఫీచర్లతో ఏ63 రూపొందించారు. దీని ధర రూ.4,499. ఇంత తక్కువ ధరలో డ్యూయల్ కోర్, జెల్లీబీన్ ఓఎస్ స్మార్ట్‌ఫోన్‌ను దేశంలో తొలిసారిగా తాము ఆఫర్ చేస్తున్నామని సంస్థ సీఎండీ వై.గురు తెలిపారు. కంపెనీ ఈడీ రేతినేని మురళితో కలసి మంగళవారమిక్కడ ఆయన మీడియాతో మాట్లాడారు. యువత కోసమే క్యాంపస్ సిరీస్‌ను రూపొందించామని చెప్పారు. అన్ని కళాశాలల వద్ద ప్రచారం చేస్తామని, రెండు నెలల్లో ఒక లక్ష ఏ63 ఫోన్లను విక్రయిస్తామని అన్నారు. 4.5 అంగుళాల డిస్‌ప్లే, ఆన్‌డ్రాయిడ్ ఐస్‌క్రీం శాండ్‌విచ్ ఓఎస్‌తో తయారైన ఏ60 ధర రూ.5,199.
రూ.17 వేల ఫోన్లు కూడా..
సెల్‌కాన్ ఇప్పటి వరకు రూ.13 వేలలోపు ధరలో వివిధ మోడళ్లను విక్రయిస్తోంది. త్వరలో మోనాలిసా సిరీస్‌ను ప్రవేశపెట్టడం ద్వారా కంపెనీ ప్రీమియం స్మార్ట్‌ఫోన్ల విభాగంలోకి అడుగు పెట్టనుంది. మోనాలిసా ఫోన్ల ధర రూ.17 వేల దాకా ఉంది. 16 జీబీ ఇంటర్నల్ మెమరీ, 1.5 గిగాహెర్ట్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 12 ఎంపీ కెమెరా, వన్ గ్లాస్ సొల్యూషన్ తదితర ఫీచర్లున్నాయి. సెల్‌కాన్ ఈ ఏడాది ఇప్పటివరకు 50 మోడళ్లను మార్కెట్లోకి తెచ్చింది. క్యాంపస్ సిరీస్‌తో సహా డిసెంబర్‌కల్లా మరో 30 దాకా మోడళ్లు రానున్నాయి. ఇటీవల సెల్‌కాన్ కప్ క్రికెట్ సిరీస్ చివరి వన్డే సందర్భంగా జింబాబ్వేలో క్యాంపస్ ఫోన్లను ఆవిష్కరించారు. ఎగుమతులపై ఆశాభావంతో ఉన్నామని, నెలాఖరులోగా ఆఫ్రికా దేశాల్లో ప్రవేశిస్తామని కంపెనీ తెలిపింది.
దేశవాళీ క్రికెట్‌కు కూడా..
రెండు అంతర్జాతీయ క్రికెట్ టోర్నీలకు స్పాన్సర్ చేసిన సెల్‌కాన్.. దేశవాళీ క్రికెట్‌కూ తోడ్పాటు అందించేందుకు సిద్ధంగా ఉందని వై.గురు తెలిపారు. ‘వ్యాపారపరంగా విదేశాల నుంచి ఎంక్వైరీలు వస్తున్నాయి. ఇకపై దేశవాళీ సిరీస్‌లను కూడా స్పాన్సర్ చేయాలనే ఆలోచనలో ఉన్నాం’ అని అన్నారు. ఆఫ్రికాలో జరిగే మ్యాచ్‌లకు భారత జట్టు ఆడనప్పటికీ స్పాన్సర్ చేస్తామని వెల్లడించారు.