Celkon CMD Y Guru
-
భారత్‌లో సెల్కాన్ ఆర్ అండ్ డీ కేంద్రం
ఏడాదిలో డిజై న్ హౌస్ కూడా ఏర్పాటు ♦ రూ.100 కోట్ల దాకా వ్యయం ♦ సెల్కాన్ సీఎండీ వై.గురు ♦ మార్కెట్లోకి మిలీనియా 2జీబీ ఎక్స్‌ప్రెస్ హైదరాబాద్, బిజినెస్ బ్యూరో : మొబైల్ ఫోన్ల రంగంలో ఉన్న సెల్కాన్ భారత్‌లో పరిశోధన అభివృద్ధి (ఆర్అండ్డీ) కేంద్రంతో పాటు ఏడాదిలో డిజైన్ హౌస్‌ను కూడా ఏర్పాటు చేయనుంది. ఇందుకు హైదరాబాద్, వైజాగ్, బెంగళూరు, నోయిడా నగరాలను కంపెనీ పరిశీలిస్తోంది. అన్ని సెల్ఫోన్లను పూర్తిగా దేశీయంగా తయారు చేయాలన్నది సెల్కాన్ ఆలోచన. పీసీబీ, చిప్సెట్ తదితర విడిభాగాల తయారీదారుల్ని ఆర్ అండ్ డీలో భాగస్వాముల్ని చేయటంతో పాటు వారితో కలసి డిజైన్ హౌస్‌లో మోడళ్లకు రూపకల్పన చేస్తారు. చైనాలోని షెంజెన్‌లో ఉన్న ఆర్ అండ్ డీ కేంద్రంతో పాటు అక్కడ పనిచేస్తున్న 130 మంది సాంకేతిక నిపుణులను కూడా భారత్‌కు తరలిస్తామని సెల్కాన్ సీఎండీ వై.గురు గురువారం చెప్పారు. ఈ కేంద్రాలకు 500 మంది నిష్ణాతులు అవసరమవుతారని చెప్పారు. చైనాకు చెందిన వైకిన్‌తో కలిసి వీటిని నెలకొల్పుతామన్నారు. రూ.100 కోట్ల వరకు వ్యయం అవుతుందని అంచనా వేస్తున్నట్లు తెలియజేశారు. మిలీనియా 2జీబీ ఎక్స్‌ప్రెస్ మోడల్‌ను ఆవిష్కరించిన సందర్భంగా కంపెనీ ఈడీ మురళి రేతినేనితో కలసి మీడియాతో ఈ విషయాలు చెప్పారు. ఎన్నో ప్రయోజనాలు...: మొబైల్ ఫోన్ల రంగంలో ఉన్న విదేశీ కంపెనీలు భారత్‌లో కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నాయి. విక్రయ సంస్థలు నూరు శాతం తయారీ ఇక్కడే చేపట్టాలంటే ఆర్ అండ్ డీ , డిజైన్ హౌస్ కూడా ఉండాలని గురు తెలిపారు. ‘వాస్తవానికి ఒక్కో మోడల్ అభివృద్ధికి రూ.30 ల క్షల దాకా ఖర్చవుతుంది. సొంత ఆర్అండ్డీ, డిజైన్ హౌస్ ఉంటే ఈ వ్యయాలను గణనీయంగా తగ్గించుకోవచ్చు. మధ్యవర్తులు, రవాణా, ప్యాకింగ్ ఖర్చులు ఆదా అవుతాయి’ అని చెప్పారు. చైనాలోని ప్లాంట్లలో సోల్డరింగ్ సమయం 8 సెకన్లు కాగా. మేడ్చల్‌లోని తమ ప్లాంటు సిబ్బంది ఈ ప్రక్రియను 10 సెకన్లకు తీసుకొచ్చారని తెలియజేశారు. సెల్‌ఫోన్‌పై ఫిర్యాదు శాతం చైనాలో 2 శాతముంటే, తమ ప్లాంటులో 0.4 శాతం మాత్రమేనన్నారు. తక్కువ సమయంలో ఎక్కువ ఫోన్లను తయారు చేసే క్రమంలో చైనాలో ఫిర్యాదు శాతం ఎక్కువగా ఉందని వివరించారు. రూ.6 వేల ధరల శ్రేణి స్మార్ట్ఫోన్లను ఇక్కడి ప్లాంట్‌లో ఆగస్టు నుంచి అసెంబుల్ చేస్తామని పేర్కొన్నారు. 2జీబీ ర్యామ్‌తో: మిలీనియా 2జీబీ ఎక్స్‌ప్రెస్‌ను వైకిన్‌తో కలసి సెల్కాన్ అభివృద్ధి చేసింది. 2జీబీ ర్యామ్, 16 జీబీ ఇంటర్నల్ మెమరీ, 1.2 గిగాహెర్ట్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్, యూఎస్‌కు చెందిన స్ప్రెడ్ట్రమ్ చిప్‌సెట్‌ను వాడారు. 4.5 అంగుళాల ఎఫ్డబ్ల్యూ వీజీఏ ఐపీఎస్ డిస్ప్లే, ఫ్లాష్‌తో 5 ఎంపీ బీఎస్ఐ1 ఆటోఫోకస్ కెమెరా, ఫ్రంట్ కెమెరా, ఆండ్రాయిడ్ కిట్‌క్యాట్ (లాలీపాప్ అప్ గ్రేడేబుల్), డ్యూయల్ సిమ్, 32 జీబీ ఎక్స్‌పాండబుల్ మెమరీ, వైఫై ఇతర ఫీచర్లు. ధర రూ.6,222. స్మార్ట్ కమాండ్స్, స్మార్ట్ అసిస్టెంట్, పవర్ సేవింగ్ మోడ్ ఫీచర్లను జోడించారు. త్వరలో 5కే ట్రాన్స్ఫార్మర్ పేరుతో 5,000 ఎంఏహెచ్ బ్యాటరీతో స్మార్ట్‌ఫోన్‌ను కంపెనీ తీసుకొస్తోంది. ఈ ఫోన్ ద్వారా మరో ఫోన్‌ను చార్జ్ చేయవచ్చు. -
సెల్కాన్.. స్లిమ్ స్మార్ట్‌ఫోన్
►7.9 మిల్లీమీటర్ల మందం ►ఆవిష్కరించిన సానియా మిర్జా ►10 రోజుల్లో లక్ష ఫోన్లు విక్రయిస్తాం ►సెల్కాన్ సీఎండీ వై.గురు హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: మొబైల్ ఫోన్ల తయారీ సంస్థ సెల్కాన్ ‘మిలీనియం వోగ్ క్యూ455’ పేరుతో స్లిమ్ స్మార్ట్‌ఫోన్‌ను శుక్రవారమిక్కడ ఆవిష్కరించింది. టెన్నిస్ క్రీడాకారిణి సానియా మిర్జా దీన్ని విడుదల చేశారు. 7.9 మిల్లీ మీటర్ల మందం, 16 జీబీ ఇంటర్నల్ మెమరీ, 1.2 గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ కార్టెక్స్ ఏ7 ప్రాసెసర్, 2000 ఎంఏహెచ్ బ్యాటరీని ఇందులో పొందుపరిచారు. 4.5 అంగుళాల క్యూహెచ్డీ ఐపీఎస్ డిస్ప్లే, 1 జీబీ ర్యామ్, 8 ఎంపీ కెమెరా, 1.3 ఫ్రంట్ కెమెరా తదితర ఫీచర్లున్నాయి. ధర రూ.7,999. క్వాడ్‌కోర్, 16 జీబీ ఇంటర్నల్ మెమరీతో ఇంత పలుచని ఫోన్ మార్కెట్లో లేదని సెల్కాన్ సీఎండీ వై.గురు పేర్కొన్నారు. సొంత డిజైన్‌లో ఆరు నెలల పరిశోధన తర్వాత మోడల్‌ను విడుదల చేశామన్నారు. గేమ్ చేంజర్ మోడల్.. వోగ్ క్యూ455 మోడల్ కోసం ఇప్పటికే 20 వేల బుకింగ్స్ ఉన్నాయని, 10 రోజుల్లో ఒక లక్ష ఫోన్లు విక్రయిస్తామని గురు ఆశాభావం వ్యక్తం చేశారు. స్మార్ట్ఫోన్ల రంగంలో ఈ మోడల్ సంచలనం సృష్టిస్తుందన్నారు. ‘భారత్‌లో మొత్తం అమ్ముడవుతున్న ఫోన్లలో రూ.6-12 వేల ధరలో లభించే మోడళ్ల వాటా 60 శాతంగా ఉంది. ఈ ధరను దృష్టిలో పెట్టుకుని అంతర్జాతీయ కంపెనీలకు ధీటుగా అత్యుత్తమ ఫీచర్లతో మోడళ్లను పరిచయం చేస్తున్నాం. ఇందులో భాగంగానే మిలీనియం సిరీస్‌లో ఇప్పటికే మూడు మోడళ్లను తెచ్చాం. మరో 7 మోడళ్లు రెండు వారాల్లో విడుదల చేస్తాం. ఆక్టాకోర్ ప్రాసెసర్‌తో రూ.10-12 వేల లోపు ధరలో పలు మోడళ్లు ఆగస్టు చివరికల్లా మార్కెట్లోకి రానున్నాయి’ అని చెప్పారు. తొలుత వారంపాటు స్నాప్‌డీల్‌కు, ఆ తర్వాత అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ తదితర ఆన్లైన్ కంపెనీలకు విక్రయిస్తామని పేర్కొన్నారు. మరో 10 దేశాలకు.. ఇప్పటి వరకు 500లకుపైగా మోడల్స్ విడుదల చేశామని సెల్కాన్ ఈడీ మురళి రేతినేని తెలిపారు. దక్షిణాదిన తొలి స్థానంలో, భారత్‌లో టాప్-5 కంపెనీల్లో సెల్కాన్ ఉందన్నారు. ప్రస్తుతం భారత్‌తోపాటు దుబాయి, జింబాబ్వే, జాంబియా, నేపాల్, శ్రీలంక తదితర దేశాల్లో సెల్కాన్ తన ఉత్పత్తులను విక్రయిస్తోంది. తాజాగా మాల్దీవులు, మారిషస్ తదితర 10 దేశాల్లో అడుగుపెట్టనుంది. ఆగస్టు నుంచి ఎగుమతుల ద్వారా కంపెనీ నెలకు రూ.50 కోట్ల ఆదాయం ఆశిస్తోంది. -
యువత కోసమే...‘క్యాంపస్’ స్మార్ట్ఫోన్లు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: మొబైల్ ఫోన్ల విక్రయ రంగంలో ఉన్న సెల్కాన్.. క్యాంపస్ సిరీస్‌లో ఏ63, ఏ60 స్మార్ట్ఫోన్లను మంగళవారమిక్కడ విడుదల చేసింది. 4 అంగుళాల కెపాసిటివ్ టచ్ డిస్ప్లే, ఆండ్రాయిడ్ 4.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టమ్, 1.2 గిగాహెట్జ్ డ్యూయల్‌కోర్ ప్రాసెసర్, 3.2 ఎంపీ కెమెరా వంటి ఫీచర్లతో ఏ63 రూపొందించారు. దీని ధర రూ.4,499. ఇంత తక్కువ ధరలో డ్యూయల్ కోర్, జెల్లీబీన్ ఓఎస్ స్మార్ట్‌ఫోన్‌ను దేశంలో తొలిసారిగా తాము ఆఫర్ చేస్తున్నామని సంస్థ సీఎండీ వై.గురు తెలిపారు. కంపెనీ ఈడీ రేతినేని మురళితో కలసి మంగళవారమిక్కడ ఆయన మీడియాతో మాట్లాడారు. యువత కోసమే క్యాంపస్ సిరీస్‌ను రూపొందించామని చెప్పారు. అన్ని కళాశాలల వద్ద ప్రచారం చేస్తామని, రెండు నెలల్లో ఒక లక్ష ఏ63 ఫోన్లను విక్రయిస్తామని అన్నారు. 4.5 అంగుళాల డిస్ప్లే, ఆన్‌డ్రాయిడ్ ఐస్‌క్రీం శాండ్విచ్ ఓఎస్‌తో తయారైన ఏ60 ధర రూ.5,199. రూ.17 వేల ఫోన్లు కూడా.. సెల్కాన్ ఇప్పటి వరకు రూ.13 వేలలోపు ధరలో వివిధ మోడళ్లను విక్రయిస్తోంది. త్వరలో మోనాలిసా సిరీస్‌ను ప్రవేశపెట్టడం ద్వారా కంపెనీ ప్రీమియం స్మార్ట్ఫోన్ల విభాగంలోకి అడుగు పెట్టనుంది. మోనాలిసా ఫోన్ల ధర రూ.17 వేల దాకా ఉంది. 16 జీబీ ఇంటర్నల్ మెమరీ, 1.5 గిగాహెర్ట్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 12 ఎంపీ కెమెరా, వన్ గ్లాస్ సొల్యూషన్ తదితర ఫీచర్లున్నాయి. సెల్కాన్ ఈ ఏడాది ఇప్పటివరకు 50 మోడళ్లను మార్కెట్లోకి తెచ్చింది. క్యాంపస్ సిరీస్‌తో సహా డిసెంబర్‌కల్లా మరో 30 దాకా మోడళ్లు రానున్నాయి. ఇటీవల సెల్కాన్ కప్ క్రికెట్ సిరీస్ చివరి వన్డే సందర్భంగా జింబాబ్వేలో క్యాంపస్ ఫోన్లను ఆవిష్కరించారు. ఎగుమతులపై ఆశాభావంతో ఉన్నామని, నెలాఖరులోగా ఆఫ్రికా దేశాల్లో ప్రవేశిస్తామని కంపెనీ తెలిపింది. దేశవాళీ క్రికెట్‌కు కూడా.. రెండు అంతర్జాతీయ క్రికెట్ టోర్నీలకు స్పాన్సర్ చేసిన సెల్కాన్.. దేశవాళీ క్రికెట్‌కూ తోడ్పాటు అందించేందుకు సిద్ధంగా ఉందని వై.గురు తెలిపారు. ‘వ్యాపారపరంగా విదేశాల నుంచి ఎంక్వైరీలు వస్తున్నాయి. ఇకపై దేశవాళీ సిరీస్‌లను కూడా స్పాన్సర్ చేయాలనే ఆలోచనలో ఉన్నాం’ అని అన్నారు. ఆఫ్రికాలో జరిగే మ్యాచ్‌లకు భారత జట్టు ఆడనప్పటికీ స్పాన్సర్ చేస్తామని వెల్లడించారు.