భారత్‌లో సెల్‌కాన్ ఆర్ అండ్ డీ కేంద్రం | celkon R & D center in India | Sakshi
Sakshi News home page

భారత్‌లో సెల్‌కాన్ ఆర్ అండ్ డీ కేంద్రం

Published Fri, Jul 31 2015 1:35 AM | Last Updated on Sun, Sep 3 2017 6:27 AM

celkon R & D center in India

ఏడాదిలో డిజై న్ హౌస్ కూడా ఏర్పాటు
♦ రూ.100 కోట్ల దాకా వ్యయం
♦ సెల్‌కాన్ సీఎండీ వై.గురు
♦ మార్కెట్లోకి మిలీనియా 2జీబీ ఎక్స్‌ప్రెస్
 
 హైదరాబాద్, బిజినెస్ బ్యూరో : మొబైల్ ఫోన్ల రంగంలో ఉన్న సెల్‌కాన్ భారత్‌లో పరిశోధన అభివృద్ధి (ఆర్‌అండ్‌డీ) కేంద్రంతో పాటు ఏడాదిలో డిజైన్ హౌస్‌ను కూడా ఏర్పాటు చేయనుంది. ఇందుకు హైదరాబాద్, వైజాగ్, బెంగళూరు, నోయిడా నగరాలను కంపెనీ పరిశీలిస్తోంది. అన్ని సెల్‌ఫోన్లను పూర్తిగా దేశీయంగా తయారు చేయాలన్నది సెల్‌కాన్ ఆలోచన. పీసీబీ, చిప్‌సెట్ తదితర విడిభాగాల తయారీదారుల్ని ఆర్ అండ్ డీలో భాగస్వాముల్ని చేయటంతో పాటు వారితో కలసి డిజైన్ హౌస్‌లో మోడళ్లకు రూపకల్పన చేస్తారు.

చైనాలోని షెంజెన్‌లో ఉన్న ఆర్ అండ్ డీ కేంద్రంతో పాటు అక్కడ పనిచేస్తున్న 130 మంది సాంకేతిక నిపుణులను కూడా భారత్‌కు తరలిస్తామని సెల్‌కాన్ సీఎండీ వై.గురు గురువారం చెప్పారు. ఈ కేంద్రాలకు 500 మంది నిష్ణాతులు అవసరమవుతారని చెప్పారు. చైనాకు చెందిన వైకిన్‌తో కలిసి వీటిని నెలకొల్పుతామన్నారు. రూ.100 కోట్ల వరకు వ్యయం అవుతుందని అంచనా వేస్తున్నట్లు తెలియజేశారు. మిలీనియా 2జీబీ ఎక్స్‌ప్రెస్ మోడల్‌ను ఆవిష్కరించిన సందర్భంగా కంపెనీ ఈడీ మురళి రేతినేనితో కలసి మీడియాతో ఈ విషయాలు చెప్పారు.

 ఎన్నో ప్రయోజనాలు...: మొబైల్ ఫోన్ల రంగంలో ఉన్న విదేశీ కంపెనీలు భారత్‌లో కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నాయి. విక్రయ సంస్థలు నూరు శాతం తయారీ ఇక్కడే చేపట్టాలంటే ఆర్ అండ్ డీ , డిజైన్ హౌస్ కూడా ఉండాలని గురు తెలిపారు. ‘వాస్తవానికి ఒక్కో మోడల్ అభివృద్ధికి రూ.30 ల క్షల దాకా ఖర్చవుతుంది. సొంత ఆర్‌అండ్‌డీ, డిజైన్ హౌస్ ఉంటే ఈ వ్యయాలను గణనీయంగా తగ్గించుకోవచ్చు. మధ్యవర్తులు, రవాణా, ప్యాకింగ్ ఖర్చులు ఆదా అవుతాయి’ అని చెప్పారు.

చైనాలోని ప్లాంట్లలో సోల్డరింగ్ సమయం 8 సెకన్లు కాగా. మేడ్చల్‌లోని తమ ప్లాంటు సిబ్బంది ఈ ప్రక్రియను 10 సెకన్లకు తీసుకొచ్చారని తెలియజేశారు. సెల్‌ఫోన్‌పై ఫిర్యాదు శాతం చైనాలో 2 శాతముంటే, తమ ప్లాంటులో 0.4 శాతం మాత్రమేనన్నారు. తక్కువ సమయంలో ఎక్కువ ఫోన్లను తయారు చేసే క్రమంలో చైనాలో ఫిర్యాదు శాతం ఎక్కువగా ఉందని వివరించారు. రూ.6 వేల ధరల శ్రేణి స్మార్ట్‌ఫోన్లను ఇక్కడి ప్లాంట్‌లో ఆగస్టు నుంచి అసెంబుల్ చేస్తామని పేర్కొన్నారు.

 2జీబీ ర్యామ్‌తో: మిలీనియా 2జీబీ ఎక్స్‌ప్రెస్‌ను వైకిన్‌తో కలసి సెల్‌కాన్ అభివృద్ధి చేసింది. 2జీబీ ర్యామ్, 16 జీబీ ఇంటర్నల్ మెమరీ, 1.2 గిగాహెర్ట్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్, యూఎస్‌కు చెందిన స్ప్రెడ్‌ట్రమ్ చిప్‌సెట్‌ను వాడారు. 4.5 అంగుళాల ఎఫ్‌డబ్ల్యూ వీజీఏ ఐపీఎస్ డిస్‌ప్లే, ఫ్లాష్‌తో 5 ఎంపీ బీఎస్‌ఐ1 ఆటోఫోకస్ కెమెరా, ఫ్రంట్ కెమెరా, ఆండ్రాయిడ్ కిట్‌క్యాట్ (లాలీపాప్ అప్ గ్రేడేబుల్), డ్యూయల్ సిమ్, 32 జీబీ ఎక్స్‌పాండబుల్ మెమరీ, వైఫై ఇతర ఫీచర్లు. ధర రూ.6,222. స్మార్ట్ కమాండ్స్, స్మార్ట్ అసిస్టెంట్, పవర్ సేవింగ్ మోడ్ ఫీచర్లను జోడించారు. త్వరలో 5కే ట్రాన్స్‌ఫార్మర్ పేరుతో 5,000 ఎంఏహెచ్ బ్యాటరీతో స్మార్ట్‌ఫోన్‌ను కంపెనీ తీసుకొస్తోంది. ఈ ఫోన్ ద్వారా మరో ఫోన్‌ను చార్జ్ చేయవచ్చు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement