R & D
-
డైకిన్ కొత్త పెట్టుబడులు: ఇంజనీర్లకు ఉద్యోగావకాశాలు
న్యూఢిల్లీ: ఎయిర్ కండీషనర్ల తయారీ సంస్థ డైకిన్ ఇండియా రాజస్తాన్‌లోని నీమ్రానా వద్ద పరిశోధన, అభివృద్ధి కేంద్రాన్ని ఏర్పాటు చేస్తోంది. మూడేళ్లలో ఈ సెంటర్ కోసం కంపెనీ రూ.500 కోట్లు వెచ్చించనుంది. 250 మంది ఇంజనీర్లకు ఉద్యోగావకాశాలు ఉంటాయి. 22 టెస్టింగ్ ఫెసిలిటీలు, ల్యాబ్స్ అందుబాటులోకి తెస్తారు. వచ్చే ఏడాది ఈ ఆర్అండ్డీ సెంటర్ కార్యరూపంలోకి రానుంది. ఇప్పటికే సంస్థకు హైదరాబాద్, రాజస్తాన్‌లోని నీమ్రానా వద్ద ఇటువంటి ఆర్అండ్డీ ఫెసిలిటీస్ ఉన్నాయి. భారతీయ వినియోగదారులకు సరిపోయే ఉత్పత్తులతోపాటు విదేశీ కస్టమర్ల కోసం స్థిర, పర్యావరణ అనుకూల సాంకేతికతలను రూపొందించడంపై నూతన కేంద్రం దృష్టి పెడుతుందని డైకిన్ ఇండియా సీఎండీ కె.జె.జావా తెలిపారు. భారతీయ పరిస్థితులు, డిమాండ్‌కు అనుగుణంగా తగిన సాంకేతికతలలో ఉత్పత్తులను నిర్మించడానికే కొత్త ఫెసిలిటీ ఏర్పాటు చేస్తున్నట్టు ఆర్అండ్డీ వైస్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ రెడ్డి చెప్పారు. -
కెమెరా ఇన్నోవేషన్ ల్యాబ్‌కు వేదికానున్న హైదరాబాద్
సాక్షి, హైదరాబాద్: కెమెరా ఇన్నోవేషన్ ల్యాబ్ సెంటర్‌కు భాగ్యనగరం వేదిక కానుంది. భారత్‌ను గ్లోబల్ ఇన్నోవేషన్ హబ్‌గా మార్చే ప్రక్రియలో భాగంగా ఒప్పో తన బేస్‌ను బలోపేతం చేస్తూ హైదరాబాద్‌లోని కంపెనీ ఆర్ అండ్ డీ సెంటర్లో ప్రత్యేక ల్యాబ్‌ను ఏర్పాటు చేయనున్నుట్లు ఒప్పో ప్రకటించింది. ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ ఉపయోగించి కెమెరా సోల్యూషన్స్, యూజర్లకు మెరుగైన అనుభవం కోసం ఇమేజింగ్ సాఫ్ట్‌వేర్‌ను అభివృద్ధిపై ఒప్పో దృష్టిసారించనుంది. మిడిల్ ఈస్ట్, ఆఫ్రికా, దక్షిణాసియా, జపాన్, యూరప్‌తో సహా ఇతర దేశాల కోసం భారత ఒప్పో టీం ప్రాతినిధ్యం వహించనుంది. కెమెరా ఇన్నోవేషన్ ల్యాబ్ వీడియో, స్టిల్ ఫోటోగ్రఫీ ఫుల్ డైమెన్షన్ ఫ్యూజన్ (ఎఫ్‌డీఎఫ్) పోర్ట్రెయిట్ వీడియో సిస్టమ్ టెక్నాలజీపై పరిశోధన కోసం పరిష్కారాలను అభివృద్ధి చేయడానికి కూడా పని చేయనుంది. ఈ ల్యాబ్‌తో వివిధ కృత్రిమంగా సెట్ చేయబడిన దృశ్యాలలో ఫోన్ కెమెరాలను పరీక్షించడానికి. ఆ నమూనాల డేటాను విశ్లేషించనున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఒప్పో 2021 జూన్ 30 నాటికి 8,800 ఇమేజ్ పేటెంట్ల కోసం దరఖాస్తు చేయగా అందులో సుమారు 3,500 పేటెంట్లకు హక్కులు వరించాయి. -
హైదరాబాద్‌లో వన్ ప్లస్ ఆర్అండ్డీ సెంటర్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ప్రీమియం మొబైల్ ఫోన్ల తయారీలో ఉన్న చైనా సంస్థ వన్ ప్లస్ హైదరాబాద్‌లో పరిశోధన, అభివృద్ధి కేంద్రాన్ని నెలకొల్పింది. ఇక్కడి నానక్‌రామ్‌గూడలో 1,86,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించిన ఈ ఫెసిలిటీని తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు, తెలంగాణ రాష్ట్ర పరిశ్రమల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేశ్ రంజన్ సోమవారం ప్రారంభించారు. అంతర్జాతీయ మార్కెట్‌కు అవసరమైన ఉత్పత్తులను ఇక్కడ అభివృద్ధి చేస్తామని ఈ సందర్భంగా వన్ ప్లస్ ఫౌండర్, సీఈవో పీట్ లావ్ వెల్లడించారు. ముఖ్యంగా ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, 5జీ, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ విభాగాల్లో పరిశోధన, అభివృద్ధి సాగుతుందన్నారు. కెమెరా ల్యాబ్, కమ్యూనికేషన్స్ అండ్ నెట్వర్కింగ్ ల్యాబ్, ఆటోమేషన్ ల్యాబ్ ఏర్పాటు చేయనున్నట్టు ప్రకటించారు. కెమెరా ల్యాబ్‌కు రూ.100 కోట్లు వ్యయం చేస్తామని వివరించారు. మూడేళ్లలో కంపెనీకి ఇది అతిపెద్ద ఆర్అండ్డీ కేంద్రంగా అవతరిస్తుందని ఆయన పేర్కొన్నారు. మూడేళ్లలో 1,500 మంది.. ప్రస్తుతం ఈ కేంద్రంలో 200 మంది నిపుణులు ఉన్నారు. మూడేళ్లలో ఈ సంఖ్య 1,500లకు చేరుతుందని వన్ ప్లస్ ఇండియా జీఎం వికాస్ అగర్వాల్ వెల్లడించారు. వీరిలో 25–40 శాతం ఫ్రెష్ గ్రాడ్యుయేట్లను నియమించుకుంటామని చెప్పారు. ‘రానున్న మూడేళ్ల కాలంలో ఆర్అండ్డీ సెంటర్‌కు రూ.1,000 కోట్లు పెట్టుబడి చేస్తాం. ఆవిష్కరణల విషయంలో హైదరాబాద్‌ను ప్రపంచ పటంలో నిలుపుతాం. ఈ ఏడాదే భారత్ నుంచి విదేశాలకు మొబైల్ ఫోన్లు ఎగుమతి చేస్తాం. ప్రీమియం స్మార్ట్ఫోన్ల రంగంలో ప్రపంచంలో 2 శాతం వాటాతో తొలి అయిదు స్థానాల్లో ఉన్నాం. భారత్‌లో 43 శాతం వాటాతో అగ్ర స్థాయిని కైవసం చేసుకున్నాం. 16,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో హిమాయత్‌నగర్‌లో నిర్మిస్తున్న అతి పెద్ద ఎక్స్‌పీరియెన్స్ జోన్‌ను అక్టోబరు–డిసెంబరు మధ్య ప్రారంభిస్తాం’ అని వివరించారు. షెంజెన్ గుర్తొచ్చింది.. పీట్ లావ్ గత ఏడాది హైదరాబాద్ సందర్శించారు. భాగ్యనగరిని చూడగానే ఆయనకు ప్రపంచ ఎలక్ట్రానిక్స్ తయారీ రాజధానిగా పేరున్న షెంజెన్ గుర్తొచ్చింది. ఆ నగరం మాదిరిగా హైదరాబాద్ సైతం అభివృద్ధి చెందుతోందని పీట్ భావించారు. ‘దేశంలో స్టార్టప్స్ జోన్‌గా భాగ్యనగరి రూపొందుతోంది. కంపెనీకి అవసరమైన నిపుణులు ఇక్కడ ఉన్నారు. అందుకే ఆర్అండ్డీ సెంటర్ కోసం ఈ నగరాన్ని ఎంచుకున్నాం’ అని ఆయన వెల్లడించారు. తెలంగాణలో తయారీ కేంద్రం ఏర్పాటు చేయాల్సిందిగా పీట్ లావ్‌ను ఉద్ధేశించి కేటీఆర్ కోరారు. ‘తయారీ కేంద్రానికి అవసరమైన స్థలాన్ని చూపిస్తానని కేటీఆర్ చెప్పారు. ఇందుకోసం సెప్టెంబరులో తిరిగి భారత్ వస్తాను’ అని పీట్ మీడియాకు తెలిపారు. ప్రస్తుతం కంపెనీకి నోయిడాలో ఫోన్ల తయారీ ప్లాంటు ఉంది. రెండవ ప్లాంటు ఎక్కడ, ఎప్పుడు స్థాపించేది ఇంకా నిర్ణయం తీసుకోలేదని ఆయన స్పష్టం చేశారు. -
భారీ పెట్టుబడితో వన్‌ప్లస్ ఆర్ అండ్ డీ కేంద్రం
సాక్షి, హైదరాబాద్ : మొబైల్ తయారీ సంస్థ వన్‌ప్లస్ భారీ పెట్టుబడితో తన ఆర్అండ్ డి కేంద్రాన్ని హైదరాబాద్‌లో ఏర్పాటు చేసింది. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈ కేంద్రాన్ని ఆరంభించారు. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ హైదరాబాద్‌లో వన్ ప్లస్ ఆర్ అండ్ డీ సెంటర్ కోసం వెయ్యి కోట్ల పెట్టుబడి పెట్టడం మంచి పరిణామమని కేటీర్ వ్యాఖ్యానించారు. దీని ద్వారా రానున్న రెండేళ్లలో 1500 ఉద్యోగ అవకాశాలు రానున్నాయన్నారు. సంస్థకు కావాల్సిన మద్దతును టీఆర్ఎస్ ప్రభుత్వం అందిస్తుందని ఈ సందర్భంగా కేటీఆర్ హామీ ఇచ్చారు. అలాగే వన్ ప్లస్ మొబైల్స్ మనుఫ్యాక్చరింగ్ సెంటర్ కూడా హైదరాబాద్ లో ఏర్పాటు చేయాలని ఆయన అభిలషించారు. ప్రపంచంలోనే అతిపెద్ద కేంద్రంగా దీన్ని అభివృద్ది చేయాలని వన్‌ప్లస్ యోచిస్తోందని కేటీఆర్ ట్వీట్ చేశారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాలపై పనిచేసే సంస్థలకు హైదరాబాద్ ఆకర్షణీయ స్థానంగా అవతరించిందన్నారు. అటు హైదరాబాద్‌లో తమ సంస్థ ఆర్ అండ్ డీ సెంటర్ ను ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందన్నారు వన్ ప్లేస్ ఫౌండర్ అండ్ సీఈవో పీట్ లౌ. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఐటీ సెక్రటరీ జయేశ్ రంజన్ కూడా హాజరయ్యారు. -
ఒప్పో తొలి ఆర్ అండ్ డీ సెంటర్
సాక్షి, హైదరాబాద్: చైనీస్ మొబైల్ తయారీదారు ఒప్పో కూడా హైదరాబాద్‌లో పాగా వేయనుంది. త్వరలో తన మొదటి భారతీయ మొదటి కార్యాలయాన్ని ఇక్కడ ప్రారభించనుంది. సెల్ఫీ ఆధారిత స్మార్ట్ఫోన్ల సరికొత్త ట్రెండ్‌కు తెరతీసిన ఒప్పోతన రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ (ఆర్ అండ్ డి) కేంద్రాన్ని హైదరాబాద్‌లో ఏర్పాటు చేయనున్నట్లు సోమవారం ప్రకటించింది. అలాగే కంపెనీ ఆర్ అండ్ డీ హెడ్‌గా తస్లీమ్ ఆరిఫ్‌ను నియమించినట్టు ఒక ప్రకటనలో తెలిపింది. నూతన ఆవిష్కరణలు, సాంకేతిక సామర్ధ్యాలతో భారత వినియోగదారులకు ప్రత్యేకమైన అనుభవాలను అందించే దిశగా దృష్టి కేంద్రీకరిస్తున్నామనీ, ఈ క్రమంలో హైదరాబాద్ నగరంలో మొదటి ఆర్ అండ్ డీ కార్యాలయం ఏర్పాటు చేస్తున్నామని ఒప్పో ఇండియా ప్రెసిడెంట్ చార్లెస్ వాంగ్ ఇండియా తెలిపారు. మొబైల్ సాఫ్ట్వేర్ డిజైన్, డెవలప్మెంట్ దాదాపు 15 ఏళ్ల అనుభవం ఉన్న ఆరిఫ్ నైపుణ్యంతో ఒక బలమైన టీంను నిర్మించనున్నామనే విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. అంతేకాదు చైనా తర్వాత హైదరాబాద్ కేంద్రం రెండో అతిపెద్ద స్థానంగా ఉంటుందనే ధీమాను వ్యక్తం చేశారు. కాగా ఒప్పో కంటే ముందు శాంసంగ్ మేక్ ఇండియా ఇన్నోవేషన్స్ (ఆర్ అండ్ డీ) ఆరిఫ్ పనిచేశారు. ప్రపంచవ్యాప్తంగా జపాన్, చైనా,అమెరికా సహా ఇతర దేశాల్లో దాదాపు ఆరు కేంద్రాలున్నాయి. త్వరలోనే ఏడవ ఆర్ అండ్ డీ సెంటర్ హైదరాబాద్‌లో నగరంలో కొలువు దీరనుంది. -
అగ్రస్థానంపై హ్యుందాయ్ కన్ను..
♦ ప్రతి ఏడాది రెండు కొత్త మోడళ్లు ♦ హైదరాబాద్ ఆర్ అండ్ డీ కీలకం చెన్నై: హ్యుందాయ్ మోటార్ ఇండియా(హెచ్ఎంఐఎల్) కంపెనీ ప్రతి ఏడాది రెండు కొత్త మోడళ్లను మార్కెట్లోకి తేనున్నది. ఈ వ్యూహాంతో మార్కెట్లో అగ్రస్థానం సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని హెచ్ఎంఐఎల్ ఎండీ, యంగ్ కీ కూ చెప్పారు. శుక్రవారం 20వ ఫౌండేషన్ డే సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రతి సెగ్మెంట్లో ఒక మోడల్‌ను అందించనున్నామని, మార్కెట్లో అగ్రస్థానం పొందడం, అత్యంత అభిమానించే,నమ్మే ఆధునిక ప్రీమియమ్ బ్రాండ్‌గా నిలవడం లక్ష్యమని పేర్కొన్నారు. గత ఆర్థిక సంవత్సరంలో మార్కెట్ లీడర్ మారుతీ సుజుకి 13.05 లక్షల వాహనాలను విక్రయించగా, రెండో స్థానంలో ఉన్న తాము 4.83 లక్షల వాహనాలను విక్రయించామని కూ పేర్కొన్నారు. ఎగుమతుల్లో అగ్రస్థానం నమ్మకమైన, సురక్షితమైన కార్లను డిజైన్ చేయడంలో హైదరాబాద్‌లో ఉన్న తమ భారత ఆర్ అండ్ డీ సెంటర్ కీలకమైన పాత్రను పోషిస్తోందని కూ తెలిపారు. 449 డీలర్లు, 1,150 సర్వీసింగ్ సెం టర్లతో దేశవ్యాప్తంగా వినియోగదారులకు సేవలందిస్తున్నామని పేర్కొన్నారు. 1999లో 20 కార్లతో తమ ఎగుమతుల ప్రస్థానం ప్రారంభమైందని, ప్రస్తుతం 92 దేశాలకు కార్లను ఎగుమతి చేస్తున్నామని, ఈ ఏడాది మార్చి వరకూ 23 లక్షల కార్లను ఎగుమతి చేశామని వివరించారు. -
భారత్‌లో అపస్ గ్లోబల్ ఆర్అండ్డీ సెంటర్
న్యూఢిల్లీ: చైనాకు చెందిన ఇంటర్నెట్ సర్వీసుల సంస్థ, అపస్ గ్రూప్ భారత్‌లో అంతర్జాతీయ పరిశోధన, అభివృద్ధి (ఆర్ అండ్ డీ), టెక్నికల్ సపోర్ట్ సెంటర్‌ను ఏర్పాటు చేయనున్నది. ఈ సెంటర్ కోసం వచ్చే మూడేళ్లలో 350 నుంచి 500 వరకూ ఉద్యోగాలివ్వనున్నామని అపస్ గ్రూప్ వ్యవస్థాపకుడు, సీఈఓ కూడా అయిన లీ టావో చెప్పారు. భారత్‌లో ప్రస్తుతం తమకు 8 కోట్ల మంది యూజర్లున్నారని, ఇక్కడ అంతర్జాతీయ ఆర్ అండ్ టీ, టెక్నికల్ సపోర్ట్ సెంటర్‌ను ఏర్పాటు చేయడం వల్ల ఈ సంఖ్య ఏడాది కాలంలో 2.5 కోట్లకు పెరగగలదని పేర్కొన్నారు. ఆండ్రాయిడ్ సాఫ్ట్‌వేర్‌ను కస్టమైజ్ చేసే అపస్కు ప్రపంచవ్యాప్తంగా 25 కోట్ల యూజర్లున్నారు. ఈ సంఖ్య ఈ ఏడాది చివరి కల్లా 30 కోట్లకు, వచ్చే ఏడాది చివరికల్లా 50 కోట్లకు పెరుగుతుందని అంచనా. -
భారత్‌లో సెల్కాన్ ఆర్ అండ్ డీ కేంద్రం
ఏడాదిలో డిజై న్ హౌస్ కూడా ఏర్పాటు ♦ రూ.100 కోట్ల దాకా వ్యయం ♦ సెల్కాన్ సీఎండీ వై.గురు ♦ మార్కెట్లోకి మిలీనియా 2జీబీ ఎక్స్‌ప్రెస్ హైదరాబాద్, బిజినెస్ బ్యూరో : మొబైల్ ఫోన్ల రంగంలో ఉన్న సెల్కాన్ భారత్‌లో పరిశోధన అభివృద్ధి (ఆర్అండ్డీ) కేంద్రంతో పాటు ఏడాదిలో డిజైన్ హౌస్‌ను కూడా ఏర్పాటు చేయనుంది. ఇందుకు హైదరాబాద్, వైజాగ్, బెంగళూరు, నోయిడా నగరాలను కంపెనీ పరిశీలిస్తోంది. అన్ని సెల్ఫోన్లను పూర్తిగా దేశీయంగా తయారు చేయాలన్నది సెల్కాన్ ఆలోచన. పీసీబీ, చిప్సెట్ తదితర విడిభాగాల తయారీదారుల్ని ఆర్ అండ్ డీలో భాగస్వాముల్ని చేయటంతో పాటు వారితో కలసి డిజైన్ హౌస్‌లో మోడళ్లకు రూపకల్పన చేస్తారు. చైనాలోని షెంజెన్‌లో ఉన్న ఆర్ అండ్ డీ కేంద్రంతో పాటు అక్కడ పనిచేస్తున్న 130 మంది సాంకేతిక నిపుణులను కూడా భారత్‌కు తరలిస్తామని సెల్కాన్ సీఎండీ వై.గురు గురువారం చెప్పారు. ఈ కేంద్రాలకు 500 మంది నిష్ణాతులు అవసరమవుతారని చెప్పారు. చైనాకు చెందిన వైకిన్‌తో కలిసి వీటిని నెలకొల్పుతామన్నారు. రూ.100 కోట్ల వరకు వ్యయం అవుతుందని అంచనా వేస్తున్నట్లు తెలియజేశారు. మిలీనియా 2జీబీ ఎక్స్‌ప్రెస్ మోడల్‌ను ఆవిష్కరించిన సందర్భంగా కంపెనీ ఈడీ మురళి రేతినేనితో కలసి మీడియాతో ఈ విషయాలు చెప్పారు. ఎన్నో ప్రయోజనాలు...: మొబైల్ ఫోన్ల రంగంలో ఉన్న విదేశీ కంపెనీలు భారత్‌లో కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నాయి. విక్రయ సంస్థలు నూరు శాతం తయారీ ఇక్కడే చేపట్టాలంటే ఆర్ అండ్ డీ , డిజైన్ హౌస్ కూడా ఉండాలని గురు తెలిపారు. ‘వాస్తవానికి ఒక్కో మోడల్ అభివృద్ధికి రూ.30 ల క్షల దాకా ఖర్చవుతుంది. సొంత ఆర్అండ్డీ, డిజైన్ హౌస్ ఉంటే ఈ వ్యయాలను గణనీయంగా తగ్గించుకోవచ్చు. మధ్యవర్తులు, రవాణా, ప్యాకింగ్ ఖర్చులు ఆదా అవుతాయి’ అని చెప్పారు. చైనాలోని ప్లాంట్లలో సోల్డరింగ్ సమయం 8 సెకన్లు కాగా. మేడ్చల్‌లోని తమ ప్లాంటు సిబ్బంది ఈ ప్రక్రియను 10 సెకన్లకు తీసుకొచ్చారని తెలియజేశారు. సెల్‌ఫోన్‌పై ఫిర్యాదు శాతం చైనాలో 2 శాతముంటే, తమ ప్లాంటులో 0.4 శాతం మాత్రమేనన్నారు. తక్కువ సమయంలో ఎక్కువ ఫోన్లను తయారు చేసే క్రమంలో చైనాలో ఫిర్యాదు శాతం ఎక్కువగా ఉందని వివరించారు. రూ.6 వేల ధరల శ్రేణి స్మార్ట్ఫోన్లను ఇక్కడి ప్లాంట్‌లో ఆగస్టు నుంచి అసెంబుల్ చేస్తామని పేర్కొన్నారు. 2జీబీ ర్యామ్‌తో: మిలీనియా 2జీబీ ఎక్స్‌ప్రెస్‌ను వైకిన్‌తో కలసి సెల్కాన్ అభివృద్ధి చేసింది. 2జీబీ ర్యామ్, 16 జీబీ ఇంటర్నల్ మెమరీ, 1.2 గిగాహెర్ట్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్, యూఎస్‌కు చెందిన స్ప్రెడ్ట్రమ్ చిప్‌సెట్‌ను వాడారు. 4.5 అంగుళాల ఎఫ్డబ్ల్యూ వీజీఏ ఐపీఎస్ డిస్ప్లే, ఫ్లాష్‌తో 5 ఎంపీ బీఎస్ఐ1 ఆటోఫోకస్ కెమెరా, ఫ్రంట్ కెమెరా, ఆండ్రాయిడ్ కిట్‌క్యాట్ (లాలీపాప్ అప్ గ్రేడేబుల్), డ్యూయల్ సిమ్, 32 జీబీ ఎక్స్‌పాండబుల్ మెమరీ, వైఫై ఇతర ఫీచర్లు. ధర రూ.6,222. స్మార్ట్ కమాండ్స్, స్మార్ట్ అసిస్టెంట్, పవర్ సేవింగ్ మోడ్ ఫీచర్లను జోడించారు. త్వరలో 5కే ట్రాన్స్ఫార్మర్ పేరుతో 5,000 ఎంఏహెచ్ బ్యాటరీతో స్మార్ట్‌ఫోన్‌ను కంపెనీ తీసుకొస్తోంది. ఈ ఫోన్ ద్వారా మరో ఫోన్‌ను చార్జ్ చేయవచ్చు. -
హైదరాబాద్‌లో టీసీఎస్ ఆర్ అండ్ డీ కేంద్రం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: భవిష్యత్తు టెక్నాలజీకి సంబంధించిన పరిశోధనలకుగాను టీసీఎస్ హైదరాబాద్‌లో ప్రత్యేకంగా ఆర్ అండ్ డీ కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ (సీవోఈ) పేరుతో 10,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన ఈ ఆర్ అండ్ డీ కేంద్రాన్ని టీసీఎస్ ప్రారంభించింది. భవిష్యత్తులో అందుబాటులోకి వచ్చే కొత్త టెక్నాలజీలు ముఖ్యంగా సాఫ్ట్వేర్ డిఫైన్డ్ నెట్వర్క్స్, 5జీ, వైర్లెస్ లాన్ వంటి వాటిపై ఈ కేంద్రం ప్రధానంగా దృష్టిసారిస్తుందని, ఇందుకోసం 200 మంది ఇంజనీర్లు పనిచేస్తారని టీసీఎస్ ఒక ప్రకటనలో పేర్కొంది.