అగ్రస్థానంపై హ్యుందాయ్ కన్ను..
♦ ప్రతి ఏడాది రెండు కొత్త మోడళ్లు
♦ హైదరాబాద్ ఆర్ అండ్ డీ కీలకం
చెన్నై: హ్యుందాయ్ మోటార్ ఇండియా(హెచ్‌ఎంఐఎల్) కంపెనీ ప్రతి ఏడాది రెండు కొత్త మోడళ్లను మార్కెట్లోకి తేనున్నది. ఈ వ్యూహాంతో మార్కెట్లో అగ్రస్థానం సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని హెచ్‌ఎంఐఎల్ ఎండీ, యంగ్ కీ కూ చెప్పారు. శుక్రవారం 20వ ఫౌండేషన్ డే సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రతి సెగ్మెంట్లో ఒక మోడల్‌ను అందించనున్నామని, మార్కెట్లో అగ్రస్థానం పొందడం, అత్యంత అభిమానించే,నమ్మే ఆధునిక ప్రీమియమ్ బ్రాండ్‌గా నిలవడం లక్ష్యమని పేర్కొన్నారు. గత ఆర్థిక సంవత్సరంలో మార్కెట్ లీడర్ మారుతీ సుజుకి 13.05 లక్షల వాహనాలను విక్రయించగా, రెండో స్థానంలో ఉన్న తాము 4.83 లక్షల వాహనాలను విక్రయించామని కూ పేర్కొన్నారు.
ఎగుమతుల్లో అగ్రస్థానం
నమ్మకమైన, సురక్షితమైన కార్లను డిజైన్ చేయడంలో హైదరాబాద్‌లో ఉన్న తమ భారత ఆర్ అండ్ డీ సెంటర్ కీలకమైన పాత్రను పోషిస్తోందని కూ తెలిపారు. 449 డీలర్లు, 1,150 సర్వీసింగ్ సెం టర్లతో దేశవ్యాప్తంగా వినియోగదారులకు సేవలందిస్తున్నామని పేర్కొన్నారు. 1999లో 20 కార్లతో తమ ఎగుమతుల ప్రస్థానం ప్రారంభమైందని, ప్రస్తుతం 92 దేశాలకు కార్లను ఎగుమతి చేస్తున్నామని, ఈ ఏడాది మార్చి వరకూ 23 లక్షల కార్లను ఎగుమతి చేశామని వివరించారు.