సెల్‌కాన్.. స్లిమ్ స్మార్ట్‌ఫోన్
►7.9 మిల్లీమీటర్ల మందం
►ఆవిష్కరించిన సానియా మిర్జా
►10 రోజుల్లో లక్ష ఫోన్లు విక్రయిస్తాం
►సెల్‌కాన్ సీఎండీ వై.గురు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: మొబైల్ ఫోన్ల తయారీ సంస్థ సెల్‌కాన్ ‘మిలీనియం వోగ్ క్యూ455’ పేరుతో స్లిమ్ స్మార్ట్‌ఫోన్‌ను శుక్రవారమిక్కడ ఆవిష్కరించింది. టెన్నిస్ క్రీడాకారిణి సానియా మిర్జా దీన్ని విడుదల చేశారు. 7.9 మిల్లీ మీటర్ల మందం, 16 జీబీ ఇంటర్నల్ మెమరీ, 1.2 గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ కార్టెక్స్ ఏ7 ప్రాసెసర్, 2000 ఎంఏహెచ్ బ్యాటరీని ఇందులో పొందుపరిచారు. 4.5 అంగుళాల క్యూహెచ్‌డీ ఐపీఎస్ డిస్‌ప్లే, 1 జీబీ ర్యామ్, 8 ఎంపీ కెమెరా, 1.3 ఫ్రంట్ కెమెరా తదితర ఫీచర్లున్నాయి. ధర రూ.7,999. క్వాడ్‌కోర్, 16 జీబీ ఇంటర్నల్ మెమరీతో ఇంత పలుచని ఫోన్ మార్కెట్లో లేదని సెల్‌కాన్ సీఎండీ వై.గురు పేర్కొన్నారు. సొంత డిజైన్‌లో ఆరు నెలల పరిశోధన తర్వాత మోడల్‌ను విడుదల చేశామన్నారు.
గేమ్ చేంజర్ మోడల్..
వోగ్ క్యూ455 మోడల్ కోసం ఇప్పటికే 20 వేల బుకింగ్స్ ఉన్నాయని, 10 రోజుల్లో ఒక లక్ష ఫోన్లు విక్రయిస్తామని గురు ఆశాభావం వ్యక్తం చేశారు. స్మార్ట్‌ఫోన్ల రంగంలో ఈ మోడల్ సంచలనం సృష్టిస్తుందన్నారు. ‘భారత్‌లో మొత్తం అమ్ముడవుతున్న ఫోన్లలో రూ.6-12 వేల ధరలో లభించే మోడళ్ల వాటా 60 శాతంగా ఉంది. ఈ ధరను దృష్టిలో పెట్టుకుని అంతర్జాతీయ కంపెనీలకు ధీటుగా అత్యుత్తమ ఫీచర్లతో మోడళ్లను పరిచయం చేస్తున్నాం. ఇందులో భాగంగానే మిలీనియం సిరీస్‌లో ఇప్పటికే మూడు మోడళ్లను తెచ్చాం. మరో 7 మోడళ్లు రెండు వారాల్లో విడుదల చేస్తాం. ఆక్టాకోర్ ప్రాసెసర్‌తో రూ.10-12 వేల లోపు ధరలో పలు మోడళ్లు ఆగస్టు చివరికల్లా మార్కెట్లోకి రానున్నాయి’ అని చెప్పారు. తొలుత వారంపాటు స్నాప్‌డీల్‌కు, ఆ తర్వాత అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ తదితర ఆన్‌లైన్ కంపెనీలకు విక్రయిస్తామని పేర్కొన్నారు.
మరో 10 దేశాలకు..
ఇప్పటి వరకు 500లకుపైగా మోడల్స్ విడుదల చేశామని సెల్‌కాన్ ఈడీ మురళి రేతినేని తెలిపారు. దక్షిణాదిన తొలి స్థానంలో, భారత్‌లో టాప్-5 కంపెనీల్లో సెల్‌కాన్ ఉందన్నారు. ప్రస్తుతం భారత్‌తోపాటు దుబాయి, జింబాబ్వే, జాంబియా, నేపాల్, శ్రీలంక తదితర దేశాల్లో సెల్‌కాన్ తన ఉత్పత్తులను విక్రయిస్తోంది. తాజాగా మాల్దీవులు, మారిషస్ తదితర 10 దేశాల్లో అడుగుపెట్టనుంది. ఆగస్టు నుంచి ఎగుమతుల ద్వారా కంపెనీ నెలకు రూ.50 కోట్ల ఆదాయం ఆశిస్తోంది.