
సౌ‘భాగ్యనగరం’గా తీర్చిదిద్దుదాం
టి.ప్రతినిధుల బృందానికి
కేంద్రమంత్రి వెంకయ్య పిలుపు
వ్యర్థం వినియోగంపై కేంద్రం దృష్టి
కంటోన్మెంట్‌పై పారికర్‌తో భేటీ
సాక్షి, న్యూఢిల్లీ: రాజకీయాలతో సంబంధం లేకుండా భాగ్యనగరాన్ని సౌభాగ్యనగరంగా తీర్చిదిద్దుదామని కేంద్ర పట్టణాభివృద్ధి, పేదరిక నిర్మూలన శాఖ మంత్రి ఎం.వెంకయ్యనాయుడు తెలంగాణ ప్రజాప్రతినిధుల బృందానికి పిలుపునిచ్చారు. కేంద్రరాష్ట్రాలు ఉమ్మడిగా ఈ పనిని పూర్తిచేసి భాగ్యనగరానికి సార్థకత చేకూర్చుదామని ఆకాంక్షించారు. డిప్యూటీ సీఎం మహమూద్ అలీ నేతృత్వంలోని టి.ప్రజాప్రతినిధుల బృందం సోమవారం కేంద్రమంత్రి వెంకయ్యతో భేటీ అయింది. స్వచ్ఛభారత్ కార్యక్రమంలో భాగంగా స్వచ్ఛ హైదరాబాద్ పేరిట చేపట్టిన కార్యక్రమాలను ఎంపీ కేశవరావు మంత్రికి వివరించారు.
మురికివాడలను బంజారాహిల్స్‌గా మారుస్తామని ధీమా వ్యక్తం చేశారు. మిషన్ కాకతీయలో చెరువుల మరమ్మతులు, శిథిల వ్యర్థాల పునర్‌వినియోగానికి చేపడుతున్న కార్యాచరణను తెలియజేశారు. స్వచ్ఛ హైదరాబాద్, వ్యర్థాల వినియోగం, గోదావరి పుష్కరాల నిర్వహణ తదితర కార్యక్రమాలకు కేంద్రం ప్రత్యేకంగా నిధులు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం వెంకయ్యనాయుడు మీడియాతో మాట్లాడుతూ.. వ్యర్థం నుంచి విద్యుత్, ఎరువులు, శిథిలాల నుంచి బ్రిక్స్, ఇసుక తయారీపై రాబోయే రోజుల్లో కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాలు కలసి దృష్టి సారించనున్నట్టు చెప్పారు. వ్యర్థం నుంచి ఉత్పత్తి చేసిన వస్తువులను తొలుత ప్రభుత్వ కార్యాలయాల్లో వినియోగించడం ద్వారా ప్రజల్లో విశ్వాసం కలుగుతుందన్నారు. చెరువులు, కుంటల పరిరక్షణతోపాటు ప్రతి ఇంట్లో ఇంకుడు గుంత ఉండేలా నిబంధన అమలు చేయాలని సూచించామన్నారు.
రక్షణ మంత్రితో భేటీ..
కేంద్ర రక్షణ మంత్రి మనోహర్ పారికర్‌తో తెలంగాణ ప్రతినిధి బృందం భేటీ అయ్యింది. కంటోన్మెంటు రహదారి మూసివేత, అక్కడి సమస్యలపై నివేదించారు. దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న ఈ సమస్యకు త్వరలోనే పరిష్కారం చూపుతామని రక్షణ మంత్రి హామీ ఇచ్చారని ఎంపీ మల్లారెడ్డి తెలిపారు. తొలుత ప్రతినిధి బృందం ఢిల్లీలోని వ్యర్థం నుంచి విద్యుత్ ఉత్పత్తి అవుతున్న జిందాల్ పవర్ ప్లాంట్‌ను, జహంగీర్‌పూర్‌లోని డంపింగ్ యార్డులను సందర్శించింది. బృందంలో ఎంపీలు కేశవరావు, ఏపీ జితేందర్‌రెడ్డి, కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, కొత్తా ప్రభాకర్‌రెడ్డి, మల్లారెడ్డి, వివిధ పార్టీల ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జీహెచ్‌ఎంసీ అధికారులు ఉన్నారు.