మీ బడ్జెట్ లేదు... మందులకు రాకండి
సెంట్రల్ డ్రగ్ స్టోర్‌లలో మందులు ఇచ్చేందుకు నిరాకరణ
సాక్షి, హైదరాబాద్: పేద రోగులకు మళ్లీ ఆపదొచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా ఆస్పత్రుల్లో మందులు లేక నానా అవస్థలు పడుతున్నారు. అత్యవసర మందులకూ దిక్కులేకుండా పోయింది. మరోవైపు మలేరియా, డెంగీ, టైఫాయిడ్ వంటి జ్వరాలు ప్రబలుతున్నాయి. ముఖ్యంగా వరంగల్, ఆదిలాబాద్ వంటి జిల్లాల ఏజెన్సీ ప్రాంతాల్లో విష జ్వరాలతో అల్లాడుతున్నా మందులిచ్చే పరిస్థితి లేదు. ఇంత జరుగుతున్నా సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
మందులున్నా రిక్తహస్తాలతో...
రాష్ట్రంలో విచిత్రమైన పరిస్థితి నెలకొంది. ఓ వైపు సెంట్రల్ డ్రగ్ స్టోర్స్ (సీడీఎస్)లలో మందులు ఉన్నాయి. కానీ ఆస్పత్రుల నుంచి ఇండెంట్ తీసుకుని వస్తే మాత్రం ‘మీకు కేటాయించిన బడ్జెట్ మొదటి క్వార్టర్, రెండో క్వార్టర్‌లో అయిపోయిం ది. అదనంగా బడ్జెట్ తెచ్చుకోండి ఇస్తాం. ఇలా పదే పదే ఇక్కడకు రాకండి’ అని తెగేసి చెబుతున్నారు.
దీంతో జిల్లా ఆస్పత్రులు, ఏరియా ఆస్పత్రులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల నుంచి సీడీఎస్‌లకు వచ్చిన వారు రిక్తహస్తాలతో వెనుదిరిగి పోతున్నారు. రాష్ట్ర మౌలిక వైద్య సదుపాయాల అభివృద్ధి సంస్థ (టీఎస్‌ఎంఎస్‌ఐడీసీ) ఆదేశాల మేరకే బడ్జెట్ ఇస్తామని సీడీఎస్‌లలో ఫార్మసిస్ట్‌లు నిక్కచ్చిగా చెబుతున్నారు. వాస్తవానికి అత్యవసర మందుల కొనుగోలుకు బోధనాసుపత్రులకు 20 శాతం, వైద్యవిధాన పరిషత్ ఆస్పత్రులకు 15 శాతం, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు 10 శాతం ఇస్తారు. ఈ నిధులు ఎప్పుడో అయిపోయాయి. మిగతా మందులకు టీఎస్‌ఎంఎస్‌ఐడీసీ ఇచ్చే మందుల మీదే ఆధారపడాలి. కానీ అక్కడ మీ బడ్జెట్ అయిపోయిందని చెబుతున్నారు.
ఇలాగైతే సరఫరా చేయలేం
ఓవైపు బంగారు తెలంగాణలో ఎలాంటి ఇబ్బందులూ ఉండవని చెబుతూనే మందులు పంపిణీ చేసిన సరఫరాదార్లకు ఆరు నెలలైనా ప్రభుత్వం బిల్లులు చెల్లించలేదు. దీంతో వచ్చే త్రైమాసికంలో తాము మందులు సరఫరా చేయలేమని చెబుతున్నారు. అసలే వర్షాకాలంలో మందుల నిల్వలు ఉంచుకోవాల్సిన తరుణంలో ఇలాంటి పరిస్థితి ఊహించలేం. దీనిపై టీఎస్‌ఎంఎస్‌ఐడీసీ దృష్టి సారించాల్సి ఉంది.
మందులు లేక ఇబ్బందులు పడుతున్నాం..
‘సార్...మాకు ఇచ్చే 15 శాతం కొనుగోళ్ల డబ్బు కూడా మీకే చెక్కు రూపంలో ఇస్తాం. మేము స్థానికంగా కొంటే ఎక్కువ రేటు చెబుతారు. అది కూడా మీరే కొనివ్వండి. మా రోగులకు మందుల్లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం’ అంటూ నాలుగు రోజుల కిందట నాంపల్లి ఏరియా ఆస్పత్రి సూపరింటెండెంట్.. టీఎస్‌ఎంఎస్‌ఐడీసీ మేనేజింగ్ డెరైక్టర్ వేణుగోపాల్‌కు లేఖ రాశారు. నగరం నడిబొడ్డున ఉన్న ఏరియా ఆస్పత్రి పరిస్థితే ఇలా ఉంటే జిల్లాల్లో ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు.