Central Drug Store
-
మరో 4 లక్షల రెమ్‌డెసివిర్‌కు ఆర్డర్
సాక్షి, అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా రెమ్‌డెసివిర్ ఇంజక్షన్ల వినియోగం భారీగా పెరిగింది. కోవిడ్ వైరస్ తీవ్రత ఎక్కువగా ఉన్న నేపథ్యంలో వీటిని రోజుకు 4 వేల నుంచి 5 వేల మందికి వాడుతున్నారు. ఈ నేపథ్యంలో మరో 4 లక్షల రెమ్‌డెసివిర్ ఇంజక్షన్లను ప్రభుత్వం ఆర్డర్ చేసింది. పేద ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఎక్కువ సంఖ్యలో వీటిని కొనుగోలు చేయాలని నిర్ణయించింది. ఇప్పటికే 3.13 లక్షల ఇంజక్షన్ల కొనుగోలుకు సుమారు రూ.80 కోట్లు వ్యయం చేసింది. కొత్తగా ఆర్డర్ ఇచ్చినవాటికి రూ.62 కోట్లు వ్యయం కానుంది. కోవిడ్ నియంత్రణలో అత్యధికంగా రెమ్‌డెసివిర్ ఇంజక్షన్లకే వ్యయమవుతున్నట్టు అధికారులు చెబుతున్నారు. ప్రతి ఇంజక్షన్‌కూ లెక్క చెప్పాల్సిందే.. రెమ్‌డెసివిర్‌కు భారీగా డిమాండ్ ఉండటంతో ప్రతి ఇంజక్షన్‌నూ అత్యంత జాగ్రత్తగా వాడుతున్నారు. ప్రభుత్వాస్పత్రులకు ఇచ్చిన ప్రతి ఇంజక్షన్‌కూ లెక్కచెప్పాలని ఆదేశాలిచ్చారు. ఖాళీ అయిన రెమ్‌డెసివిర్ ఇంజక్షన్ బాటిల్, ఈ ఇంజక్షన్ ఏ పెషెంట్‌కు ఇచ్చారో వారి వివరాలు, ఇవన్నీ ఆయా జిల్లాల పరిధిలో సెంట్రల్ డ్రగ్ స్టోర్‌కు ఇవ్వాల్సి ఉంటుంది. ఖాళీ అయిన ఇంజక్షన్లకు లెక్క చెబితేనే కొత్తగా ఇచ్చే ఏర్పాట్లు చేశారు. దీనిపై నిత్యం ఏపీఎంఎస్ఐడీసీ (రాష్ట్ర మౌలిక వైద్య సదుపాయాల అభివృద్ధి సంస్థ) పర్యవేక్షణ చేస్తోంది. -
ఆలనాపాలనా కరువు
సెంట్రల్ డ్రగ్ స్టోర్‌కు పర్యవేక్షణేదీ..? మందులకు కొరత నెల్లూరు(అర్బన్): ప్రభుత్వాస్పత్రికి మందులను సరఫరా చేసే సెంట్రల్ డ్రగ్ స్టోర్ అనాథలా మారింది. ఇన్చార్జిగా ఉన్న డాక్టర్‌ను తొలగించడంతో పర్యవేక్షణ కొరవడింది. సాధారణ మందులతో పాటు అత్యవసరమైన మందులను సరఫరా చేసే సెంట్రల్ డ్రగ్ స్టోర్‌కు డాక్టర్ లేకపోవడంతో ఏదైనా తేడా వస్తే బాధ్యులెవరో అర్థం కాని పరిస్థితి నెలకొంది. 540 మందుల సరఫరా జిల్లాలో 74 పీహెచ్‌సీలు, 477 సబ్ సెంటర్లు, 14 సీహెచ్‌సీలు, 15 పట్టణ ఆరోగ్య కేంద్రాలు, మూడు ఏరియా ఆస్పత్రులు ఉన్నాయి. జిల్లా కేంద్రంలో రెఫరల్ ఆస్పత్రిగా సర్వజన ఆస్పత్రి ఉంది. వీటన్నింటికీ సర్వజన ఆస్పత్రి ఆవరణలో ఉన్న సెంట్రల్ డ్రగ్ స్టోర్ నుంచి మందులను సరఫరా చేస్తారు. సాధారణ మందులతో పాటు అత్యవసరమైన మందులు కలిపి 540 రకాలను ఆస్పత్రులకు పంపిస్తారు. జిల్లా కేంద్రంలోని పెద్దాస్పత్రికే ఏడాదికి రూ.ఆరు కోట్ల విలువైన మందులను పంపిస్తుంటారు. 74 పీహెచ్‌సీలతో పాటు ఏరియా ఆస్పత్రులకూ ఏటా రూ.కోట్లాది విలువైన మందులను పంపిణీ చేస్తున్నారు. మందులపై అవగాహన వైద్యులకే.. మందుల గురించి అవగాహన ఉండేది డాక్టర్లకే కావడంతో సెంట్రల్ డ్రగ్ స్టోర్‌కు ఒకర్ని డీఎంహెచ్ఓ కేటాయించేవారు. నెల్లూరులోని సెంట్రల్ డ్రగ్ స్టోర్‌కు ఇప్పటి వరకు డాక్టర్ శేషమ్మ మెడికల్ ఆఫీసర్‌గా ఉంటూ అన్ని బాధ్యతలను నిర్వర్తించారు. ప్రభుత్వ ఆదేశానుసారం అన్ని జిల్లాల్లో మాదిరిగానే నెల్లూరు జిల్లాలో సెంట్రల్ డ్రగ్ స్టోర్ ఇన్చార్జిగా ఉన్న డాక్టర్ శేషమ్మను పీహెచ్‌సీకి పంపారు. ఫలితంగా ఆగస్ట్ ఒకటి నుంచి సెంట్రల్ డ్రగ్ స్టోర్‌కు ఇన్చార్జి కరువయ్యారు. కిందిస్థాయి సిబ్బందితో వ్యవహారాలు సాగుతున్నాయి. కనీసం వైద్య విజ్ఞానం ఉన్న ఫార్మా సూపర్వైజర్ను నియమించినా మందులపై అవగాహన ఉంటుంది. అవగాహన ఉంటేనే సకాలంలో ఇండెంట్‌ను ప్రభుత్వానికి పంపి కావాల్సిన మందులు వచ్చే ఏర్పాట్లు చేసుకోగలరు. అత్యవసర మందులకు కొరత పెద్దాస్పత్రిలో అత్యవసరమైన మందులకు మంగళవారం కొరత ఏర్పడింది. బక్రీదు రోజు సెలవైనా డాక్టర్లు అప్పటికప్పుడు సెంట్రల్ డ్రగ్ స్టోర్ సిబ్బందికి ఫోన్ చేసి పిలిపించుకున్నారు. ఎలాగోలా కష్టపడి మందులను ఏర్పాటు చేయించుకున్నారు. సెంట్రల్ డ్రగ్ స్టోర్‌లో ఇలాంటి సమస్యలు ఉత్పన్నం కాకుండా ఉండేందుకు గానూ డాక్టర్ లేదా ఫార్మసీ సూపర్వైజర్ను నియమించాలని పలువురు కోరుతున్నారు. డ్రగ్ స్టోర్‌కు డాక్టర్ అవసరం లేదు: వరసుందరం, డీఎంహెచ్ఓ డాక్టర్లను తొలగించడమనేది ప్రభుత్వ పాలసీ. డ్రగ్ స్టోర్‌కు డాక్టర్ అవసరం లేదు. ఫార్మా కోర్సులు చేసిన వారైనా సరిపోతుంది. సూపర్వైజర్ను నియమించే యోచనను ప్రభుత్వం చేస్తుందని భావిస్తున్నాం. మందుల పంపిణీలో ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకున్నాం. -
మీ బడ్జెట్ లేదు... మందులకు రాకండి
సెంట్రల్ డ్రగ్ స్టోర్లలో మందులు ఇచ్చేందుకు నిరాకరణ సాక్షి, హైదరాబాద్: పేద రోగులకు మళ్లీ ఆపదొచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా ఆస్పత్రుల్లో మందులు లేక నానా అవస్థలు పడుతున్నారు. అత్యవసర మందులకూ దిక్కులేకుండా పోయింది. మరోవైపు మలేరియా, డెంగీ, టైఫాయిడ్ వంటి జ్వరాలు ప్రబలుతున్నాయి. ముఖ్యంగా వరంగల్, ఆదిలాబాద్ వంటి జిల్లాల ఏజెన్సీ ప్రాంతాల్లో విష జ్వరాలతో అల్లాడుతున్నా మందులిచ్చే పరిస్థితి లేదు. ఇంత జరుగుతున్నా సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మందులున్నా రిక్తహస్తాలతో... రాష్ట్రంలో విచిత్రమైన పరిస్థితి నెలకొంది. ఓ వైపు సెంట్రల్ డ్రగ్ స్టోర్స్ (సీడీఎస్)లలో మందులు ఉన్నాయి. కానీ ఆస్పత్రుల నుంచి ఇండెంట్ తీసుకుని వస్తే మాత్రం ‘మీకు కేటాయించిన బడ్జెట్ మొదటి క్వార్టర్, రెండో క్వార్టర్లో అయిపోయిం ది. అదనంగా బడ్జెట్ తెచ్చుకోండి ఇస్తాం. ఇలా పదే పదే ఇక్కడకు రాకండి’ అని తెగేసి చెబుతున్నారు. దీంతో జిల్లా ఆస్పత్రులు, ఏరియా ఆస్పత్రులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల నుంచి సీడీఎస్‌లకు వచ్చిన వారు రిక్తహస్తాలతో వెనుదిరిగి పోతున్నారు. రాష్ట్ర మౌలిక వైద్య సదుపాయాల అభివృద్ధి సంస్థ (టీఎస్ఎంఎస్ఐడీసీ) ఆదేశాల మేరకే బడ్జెట్ ఇస్తామని సీడీఎస్‌లలో ఫార్మసిస్ట్‌లు నిక్కచ్చిగా చెబుతున్నారు. వాస్తవానికి అత్యవసర మందుల కొనుగోలుకు బోధనాసుపత్రులకు 20 శాతం, వైద్యవిధాన పరిషత్ ఆస్పత్రులకు 15 శాతం, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు 10 శాతం ఇస్తారు. ఈ నిధులు ఎప్పుడో అయిపోయాయి. మిగతా మందులకు టీఎస్ఎంఎస్ఐడీసీ ఇచ్చే మందుల మీదే ఆధారపడాలి. కానీ అక్కడ మీ బడ్జెట్ అయిపోయిందని చెబుతున్నారు. ఇలాగైతే సరఫరా చేయలేం ఓవైపు బంగారు తెలంగాణలో ఎలాంటి ఇబ్బందులూ ఉండవని చెబుతూనే మందులు పంపిణీ చేసిన సరఫరాదార్లకు ఆరు నెలలైనా ప్రభుత్వం బిల్లులు చెల్లించలేదు. దీంతో వచ్చే త్రైమాసికంలో తాము మందులు సరఫరా చేయలేమని చెబుతున్నారు. అసలే వర్షాకాలంలో మందుల నిల్వలు ఉంచుకోవాల్సిన తరుణంలో ఇలాంటి పరిస్థితి ఊహించలేం. దీనిపై టీఎస్ఎంఎస్ఐడీసీ దృష్టి సారించాల్సి ఉంది. మందులు లేక ఇబ్బందులు పడుతున్నాం.. ‘సార్...మాకు ఇచ్చే 15 శాతం కొనుగోళ్ల డబ్బు కూడా మీకే చెక్కు రూపంలో ఇస్తాం. మేము స్థానికంగా కొంటే ఎక్కువ రేటు చెబుతారు. అది కూడా మీరే కొనివ్వండి. మా రోగులకు మందుల్లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం’ అంటూ నాలుగు రోజుల కిందట నాంపల్లి ఏరియా ఆస్పత్రి సూపరింటెండెంట్.. టీఎస్ఎంఎస్ఐడీసీ మేనేజింగ్ డెరైక్టర్ వేణుగోపాల్‌కు లేఖ రాశారు. నగరం నడిబొడ్డున ఉన్న ఏరియా ఆస్పత్రి పరిస్థితే ఇలా ఉంటే జిల్లాల్లో ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు.