ఆలనాపాలనా కరువు | No in charge at Nellore central drug store | Sakshi
Sakshi News home page

ఆలనాపాలనా కరువు

Published Wed, Sep 14 2016 12:31 AM | Last Updated on Sat, Oct 20 2018 6:19 PM

ఆలనాపాలనా కరువు - Sakshi

ఆలనాపాలనా కరువు

 
  •  సెంట్రల్‌ డ్రగ్‌ స్టోర్‌కు పర్యవేక్షణేదీ..?
  •  మందులకు కొరత
 
నెల్లూరు(అర్బన్‌): ప్రభుత్వాస్పత్రికి మందులను సరఫరా చేసే సెంట్రల్‌ డ్రగ్‌ స్టోర్‌ అనాథలా మారింది. ఇన్‌చార్జిగా ఉన్న డాక్టర్‌ను తొలగించడంతో పర్యవేక్షణ కొరవడింది. సాధారణ మందులతో పాటు అత్యవసరమైన మందులను సరఫరా చేసే సెంట్రల్‌ డ్రగ్‌ స్టోర్‌కు డాక్టర్‌ లేకపోవడంతో ఏదైనా తేడా వస్తే బాధ్యులెవరో అర్థం కాని పరిస్థితి నెలకొంది.
540 మందుల సరఫరా 
జిల్లాలో 74 పీహెచ్‌సీలు, 477 సబ్‌ సెంటర్లు, 14 సీహెచ్‌సీలు, 15 పట్టణ ఆరోగ్య కేంద్రాలు, మూడు ఏరియా ఆస్పత్రులు ఉన్నాయి. జిల్లా కేంద్రంలో రెఫరల్‌ ఆస్పత్రిగా సర్వజన ఆస్పత్రి ఉంది. వీటన్నింటికీ సర్వజన ఆస్పత్రి ఆవరణలో ఉన్న సెంట్రల్‌ డ్రగ్‌ స్టోర్‌ నుంచి మందులను సరఫరా చేస్తారు. సాధారణ మందులతో పాటు అత్యవసరమైన మందులు కలిపి 540 రకాలను ఆస్పత్రులకు పంపిస్తారు. జిల్లా కేంద్రంలోని పెద్దాస్పత్రికే ఏడాదికి రూ.ఆరు కోట్ల విలువైన మందులను పంపిస్తుంటారు. 74 పీహెచ్‌సీలతో పాటు ఏరియా ఆస్పత్రులకూ ఏటా రూ.కోట్లాది విలువైన మందులను పంపిణీ చేస్తున్నారు.
మందులపై అవగాహన వైద్యులకే..
మందుల గురించి అవగాహన ఉండేది డాక్టర్లకే కావడంతో సెంట్రల్‌ డ్రగ్‌ స్టోర్‌కు ఒకర్ని డీఎంహెచ్‌ఓ కేటాయించేవారు. నెల్లూరులోని సెంట్రల్‌ డ్రగ్‌ స్టోర్‌కు ఇప్పటి వరకు డాక్టర్‌ శేషమ్మ మెడికల్‌ ఆఫీసర్‌గా ఉంటూ అన్ని బాధ్యతలను నిర్వర్తించారు. ప్రభుత్వ ఆదేశానుసారం అన్ని జిల్లాల్లో మాదిరిగానే నెల్లూరు జిల్లాలో సెంట్రల్‌ డ్రగ్‌ స్టోర్‌ ఇన్‌చార్జిగా ఉన్న డాక్టర్‌ శేషమ్మను పీహెచ్‌సీకి పంపారు. ఫలితంగా ఆగస్ట్‌ ఒకటి నుంచి సెంట్రల్‌ డ్రగ్‌ స్టోర్‌కు ఇన్‌చార్జి కరువయ్యారు. కిందిస్థాయి సిబ్బందితో వ్యవహారాలు సాగుతున్నాయి. కనీసం వైద్య విజ్ఞానం ఉన్న ఫార్మా సూపర్‌వైజర్‌ను నియమించినా మందులపై అవగాహన ఉంటుంది. అవగాహన ఉంటేనే సకాలంలో ఇండెంట్‌ను ప్రభుత్వానికి పంపి కావాల్సిన మందులు వచ్చే ఏర్పాట్లు చేసుకోగలరు. 
అత్యవసర మందులకు కొరత
పెద్దాస్పత్రిలో అత్యవసరమైన మందులకు మంగళవారం కొరత ఏర్పడింది. బక్రీదు రోజు సెలవైనా డాక్టర్లు అప్పటికప్పుడు సెంట్రల్‌ డ్రగ్‌ స్టోర్‌ సిబ్బందికి ఫోన్‌ చేసి పిలిపించుకున్నారు. ఎలాగోలా కష్టపడి మందులను ఏర్పాటు చేయించుకున్నారు. సెంట్రల్‌ డ్రగ్‌ స్టోర్‌లో ఇలాంటి సమస్యలు ఉత్పన్నం కాకుండా ఉండేందుకు గానూ డాక్టర్‌ లేదా ఫార్మసీ సూపర్‌వైజర్‌ను నియమించాలని పలువురు కోరుతున్నారు.
 
 
డ్రగ్‌ స్టోర్‌కు డాక్టర్‌ అవసరం లేదు: వరసుందరం, డీఎంహెచ్‌ఓ
డాక్టర్లను తొలగించడమనేది ప్రభుత్వ పాలసీ. డ్రగ్‌ స్టోర్‌కు డాక్టర్‌ అవసరం లేదు. ఫార్మా కోర్సులు చేసిన వారైనా సరిపోతుంది. సూపర్‌వైజర్‌ను నియమించే యోచనను ప్రభుత్వం చేస్తుందని భావిస్తున్నాం. మందుల పంపిణీలో ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకున్నాం.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement