పరిశుభ్రతకు తాను పెద్దపీట వేస్తానని స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగంలో కూడా ప్రధాని నరేంద్రమోడీ చెప్పారు. కార్యాలయాల్లో పరిశుభ్రతను పాటించడానికి తాను అధిక ప్రాధాన్యం ఇస్తానని, ఇది ప్రధానమంత్రి చేయాల్సిన పనేనా అని ఎవరు అడిగినా పట్టించుకోనని ఆయన చెప్పారు. అయితే.. పరిశుభ్రతకు ఇంత ప్రాధాన్యం ఇచ్చే మోడీ ప్రసంగాన్ని వినడానికి, కవర్ చేయడానికి వచ్చిన పాత్రికేయులకు వేసిన కుర్చీలు మాత్రం అత్యంత ఘోరంగా ఉన్నాయి. శుక్రవారం నాడు ఎర్రకోట వద్ద మీడియా ప్రతినిధుల కోసం వేసిన దాదాపు 200 కుర్చీలకు ఆకుపచ్చ రంగు కవర్లు వేశారు.
మోడీ ప్రసంగవేదికకు సరిగ్గా ఎదురుగానే ఇవి ఉన్నాయి. అయితే వాటి నిండా దుమ్ము దట్టంగా పేరుకుపోయి ఉంది. కొన్నింటిమీద అయితే పెయింటు, గ్రీజు మరకలు కూడా ఉన్నాయి. స్టీలు ఫ్రేముకు ఉన్న నట్లు, మేకులు అన్నీ తుప్పుపట్టి ఉన్నాయి. దాంతో మీడియా ప్రతినిధులు తమ కర్చీఫులతో దుమ్ము దులుపుకొని కూర్చున్నారు. కొంతమంది తమకు ఇచ్చిన ఆహ్వానపత్రాలను కూడా అందుకు ఉపయోగించారు. దానికి తోడు కుర్చీలు వేసిన ప్రాంతంలో మైదానం ఎగుడుదిగుడుగా ఉండటం, కొన్నిచోట్ల గోతులు కూడా ఉండటంతో కూర్చోవడమే మహా కష్టం అయ్యింది. పైగా కుర్చీలు జరపడానికి వీల్లేకుండా వాటన్నింటినీ ఓ సన్నటి స్టీలు వైరుతో కలిపి కట్టేశారు. ఇలాంటి పరిస్థితుల మధ్యే మోడీ ఇచ్చిన స్ఫూర్తిదాయకమైన ప్రసంగాన్ని పాత్రికేయులు కవర్ చేశారు.
ఎర్రకోటలో కుర్చీల నిండా దుమ్ము, మరకలు
Published Fri, Aug 15 2014 11:49 AM | Last Updated on Wed, Aug 15 2018 2:20 PM
Advertisement