అవసరమైతే గడువు కోరతాం..
సాక్షి, విజయవాడ బ్యూరో: కాపులను బీసీల్లో చేర్చే విషయంలో సిఫారసు నివేదికను గడువులోగా ఇచ్చేందుకు ప్రయత్నిస్తామని, ఒకవేళ గడువు చాలకపోతే అదనంగా గడువుకోరతామని బీసీ కమిషన్ చైర్మన్ జస్టిస్ మంజునాథ చెప్పారు. సీఎం చంద్రబాబును కలిసేందుకు గురువారం వచ్చిన ఆయన గన్నవరం విమానాశ్రయంలో, సీఎంను కలిసిన అనంతరం స్టేట్ గెస్ట్‌హౌస్‌లో మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. 13 జిల్లాల్లోను పర్యటించి వివరాలు సేకరిస్తానని ఈ సందర్భంగా చెప్పారు. కమిషన్‌లో సభ్యులను ప్రభుత్వం నియమించాల్సి ఉందన్నారు.
రిజర్వేషన్‌లపై గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన సూచనలను కూడా పరిగణనలోకి తీసుకుంటామని, 50 శాతం మించితే అదనంగా ఎలా రిజర్వేషన్‌లు కల్పించాలనే దానిపై కూడా పరిశీలన చేస్తామన్నారు. గడువులోగా ఇవ్వాలని సీఎం కోరారని చెప్పారు. ప్రభుత్వానికి తాము నివేదిక మాత్రమే ఇస్తామని, రిజర్వేషన్‌ల అమలుపై ప్రభుత్వానిదే తుది నిర్ణయమన్నారు.
రెండు గంటలపాటు సీఎంతో భేటీ
ముఖ్యమంత్రి కార్యాలయంలో జస్టిస్ మంజునాథ సీఎంతో సమావేశమయ్యారు. దాదాపు రెండు గంటలపాటు జరిగిన వీరి సమావేశంలో పలు అంశాలు చర్చించారు. ఈ సందర్భగా సీఎం మాట్లాడుతూ నిర్దేశించిన గడువు తొమ్మిది నెలల్లోగా ఆర్థికంగా, సామాజికంగా వెనుకబడిన కులాల నుంచి కూడా వివరాలు సేకరించాలని కోరారు. ఇందుకోసం రాష్ట్రంలోని 1.8 లక్షల మంది ఉపాధ్యాయుల సేవలను కూడా ఉపయోగించుకోవచ్చన్నారు.
రెండు, మూడు రోజుల్లో కమిషన్ సభ్యులను నియమిస్తామని, వారంలోగా విజయవాడలోనే కార్యాలయం ఏర్పాటు చేస్తామని సీఎం తెలిపారు. ఈ సమావేశంలో మంత్రివర్గ ఉపసంఘం సభ్యులు ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప, యనమల రామకృష్ణుడు, గంటా శ్రీనివాసరావు, కొల్లు రవీంద్ర, కాపు కార్పొరేషన్ చైర్మన్ చలమలశెట్టి రామానుజయ, ప్రిన్సిపల్ సెక్రటరీ సతీశ్‌చంద్ర, సీఎంవో సహాయ కార్యదర్శి ప్రద్యుమ్న, కార్యదర్శులు శ్రీనివాస్, ప్రవీణ్‌లు పాల్గొన్నారు.
వైఎస్సార్‌సీపీపై వ్యతిరేక ప్రచారం చేయండి: సీఎం
తుని సభకు టీడీపీ వాళ్లు వెళ్లకపోవడం మంచిదైందని, వెళ్లుంటే వాళ్లు కూడా కేసుల్లో ఇరుక్కునేవారని ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో 8 వేల మంది టీడీపీ నేతలతో ఆయన గురువారం టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. రాష్ట్రాన్ని అప్రదిష్టపాలు చేయడానికి వైఎస్సార్‌సీపీ ప్రయత్నిస్తోందని, ఆ పార్టీ గురించి ప్రజల్లో వ్యతిరేక ప్రచారం చేయాలని టీడీపీ శ్రేణులకు ఉద్బోధించారు. వైఎస్సార్‌సీపీ విధ్వంస పూరితమైందని, ఆ పార్టీ నేతలు కులాల చిచ్చు రగిలిస్తున్నారని మండిపడ్డారు.