ఉజ్జయిని: మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. శివరాజ్ తన బూట్లను భద్రత సిబ్బందితో మోయించడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి.
బుధవారం ఉజ్జయినిలో జరిగిన బీజేపీ కార్యక్రమంలో శివరాజ్ పాల్గొన్నారు. వేదిక వద్దకు వెళ్లే మార్గం మధ్యలో జైన సన్యాసి ప్రగ్యా సాగర్ ఆశ్రమం వద్ద ఆయన కాసేపు ఆగారు. సీఎం తన బూట్లను ఆశ్రమం బయట వదలి లోపలకి వెళ్లారు. దర్శనం చేసుకుని బయటకు వచ్చిన తర్వాత భద్రత అధికారి పరిగెత్తుకుంటూ ఆయన వద్దకు బూట్లు తీసుకెళ్లారు. వాటిని వేసుకోవడానికి నిరాకరించిన శివరాజ్ సాక్సులతోనే దగ్గరలో ఉన్న వేదిక వద్దకు వెళ్లారు. ముందు శివరాజ్ వెళ్లగా, ఆయన వెనుక పోలీసు అధికారి బూట్లను మోసుకుంటూ వెళ్లారు. అయినా శివరాజ్ వారించే ప్రయత్నం చేయలేదు. అక్కడున్న ఓ వ్యక్తి తన మొబైల్ ఫోన్‌తో ఈ తతంగాన్ని చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ముఖ్యమంత్రి తీరును విమర్శిస్తూ నెటిజెన్లు కామెంట్ చేశారు.
గతేడాది కూడా శివరాజ్ ఇలాంటి వివాదంలోనే చిక్కుకున్నారు. ఆ రాష్ట్రంలో వరద ప్రాంతాలను పరిశీలించేందుకు వెళ్లిన ముఖ్యమంత్రిని మోకాళ్లలోతు నీళ్లలో తడవకుండా ఉండేందుకు భద్రత సిబ్బంది ఇద్దరు చేతులపై ఆయనను ఎత్తుకుని తీసుకెళ్లారు. ఈ ఫొటో మీడియాలో రావడంతో శివరాజ్పై అప్పట్లో విమర్శలు వచ్చాయి.