ఆ ఒక్క ఫొటోను హైలైట్ చేశారు : సీఎం
మధ్యప్రదేశ్లో వరదలు సంభవించిన నేపథ్యంలో పలు గ్రామాల్లో పర్యటించి సమస్యలు తెలుసుకున్నా సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ తీవ్ర విమర్శలపాలయ్యారు. సోషల్ మీడియా వెబ్ సైట్లు ట్విట్టర్, ఫేస్ బుక్ లలో కూడా ఆయనపై కొంతమంది తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సిబ్బంది మోస్తుండగా శివరాజ్ దర్జాగా వరద ప్రాంతాల్లో పర్యటిస్తున్నట్లు కనిపించే ఫొటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఆయనపై విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. ఈ విమర్శలపై ఎట్టకేలకు సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ స్పందించారు. రాష్ట్రంలో వరదలు సంభవించిన పలు ప్రాంతాలలో తాను పర్యటించి అక్కడి ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నట్లు చెప్పారు.
అయితే కేవలం ఓ ప్రాంతంలో తప్పనిసరి పరిస్థితులలో సిబ్బంది తమ చేతులతో తనను మోయాల్సి వచ్చిందన్నారు. కేవలం ఇలాంటి ఒక్క ఫొటో దొరికిందన్న కారణంగా తనను విమర్శించడం తగదని సూచించారు. బ్రిటన్ ప్రధానిగా ఉన్నప్పుడు డేవిడ్ కామెరాన్ స్వయంగా నడిచి వెళ్లి వరద ప్రాంతాల్లోని బాధితులను పరామర్శించారని శివరాజ్ నుద్దేశించి వ్యాఖ్యలు చేశారు. సీఎం స్థాయి వ్యక్తి ఇలా చేయడం సమంజసమేనా అని మరికొందరు నేరుగా శివరాజ్ చర్యను తప్పుపడుతున్నారు. మీరు కేవలం ఈ ఒక్క ఫొటోను చూసి తనను అంచనా వేయకూడదన్నారు.