
ఈ బుజ్జాయిల పాట వింటే అదరహో!
ప్రతిభాపాటవాల చాటడంలో పిల్లలూ ఏమీ తీసిపోవడం లేదు. అద్భుతంగా ప్రతిభను చూపిస్తూ అబ్బురపరుస్తున్నారు. ఆటలు, పాటలు, విన్యాసాలు ఏ విషయంలోనైనా పిల్లలు కాదు పిడుగులు అనిపించుకుంటున్నారు. ఇద్దరు చైనా బుడతలు తమ అద్భుతగానంతో శ్రోతలను మంత్రముగ్ధులను చేశారు.
2015లో చైనా టాలెంట్ షోలో ఇద్దరు చైనా చిన్నారులు అత్యంత క్లిష్టమైన పాటను అమోఘంగా పాడారు. 10 ఏళ్ల జెఫ్రీ లీ, ఏడేళ్ల సెలినా టామ్ అత్యంత క్లిష్టమైన ’యూ రైస్ మి అప్’ పాటను తన్మయత్వంతో ఆలపించారు. వారు పాడుతున్నంతసేపు శ్రోతలు నమ్మలేనట్టుగా విస్మయంలో మునిగిపోయారు.
డుయో సీక్రెట్ గార్డెన్ కోసం 2002లో మొదట రికార్డు చేసిన ’యూ రైస్ మి’ పాట ప్రపంచవ్యాప్తంగా ఎంతో ప్రఖ్యాతి చెందింది. 2002లో జోష్ గ్రోబన్, 2005లో ఐరిష్ బ్యాండ్ వెస్ట్‌లైఫ్ ఈ పాట ఆలాపించి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందాయి. అత్యంత క్లిష్టమైన పాటగా పేరొందిన ఈ గానాన్ని ఆ తర్వాత ఎంతోమంది గాయనీగాయకులు రికార్డు చేశారు. అలాంటి కష్టతరమైన పాటను వేదికపై అలవోకగా తన్మయత్వంతో పాడుతూ చైనా బుడతలు అదరహో అనిపించుకున్నారు