5లక్షల ఉద్యోగాలకు చెక్ పెట్టిన చైనా
బీజింగ్: చైనా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. భారీ పరిశ్రమల రంగంలో మరోసారి భారీ ఎత్తున ఉద్యోగులను తొలగించేందుకు నిర్ణయింది. ముఖ్యంగా స్టీల్ మరియు ఉక్కు సహా ఇతర భారీ పరిశ్రమల్లో పనిచేస్తున్న 5 లక్షలమంది ఉద్యోగులను తొలగించనుంది. ఈ మేరకు చైనా కార్మికశాఖ మంత్రి యిన్ వీమెన్ బుధవారం జారీ చేసిన ప్రకటన జారీ చేశారు. అదనపు మిగులు ఉత్పత్తి సామర్థ్యాన్ని తగ్గించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు.
అదనపు ఉత్పత్తితో మార్కెట్లో ఉత్పత్తుల వెల్లువ కారణంగా గ్లోబల్ ధరలు నిరుత్సాహకంగా ఉన్నాయన్నారు. అయితే తొలగించిన ఉద్యోగులకు ప్రత్యామ్నాయ ఉద్యోగాలను కల్పించనున్నట్టు చెప్పారు. అలాగే ఆయా ఉద్యోగులు సొంత సంస్థలు ప్రారంభించడానికి లేదా ఉద్యోగ విరమణకు సాయం చేయనున్నట్టు చెప్పారు. గత ఏడాది 7లక్షల 26వేలమందికి పైగా తొలగించిన ఉద్యోగులకు ఇలాంటి సాయాన్ని అందించినట్టు తెలిపారు.
చైనాకు చెంది స్టీల్ సహా ఉక్కు, బొగ్గు, అల్యూమినియం, సిమెంట్, గ్లాస్ లాంటి భారీ పరిశ్రమలు అధిక ఉత్పత్తి సామర్థ‍్యంతో నిండి ఉన్నాయి. అటు మిగులుఉత్పత్తి, ఇటు డిమాండ్ లేక ఇబ్బందులు పడుతున్న ఈ పరిశ్రమలను బైటపడేసేందుకు చైనా బహుళ సంవత్సరాలుగాకృషి చేస్తోంది. మరోవైపు కొన్ని కంపెనీలు మిగులు ఉత్పత్తిని ఇతర దేశాలకు ఎగుమతి చేసేందుకు ప్రయత్నిస్తున్నాయి. దీంతో తమ ఉద్యోగాలకు ఎసరుపెడుతున్నారంటూ అమెరికా, యూరోప్ మరియు ఇతర వ్యాపార భాగస్వామ్య దేశాలు ఆరోపిస్తున్నాయి.