
'గే'లకు షాకులిచ్చి సరిచేస్తారట!
స్వలింగ సంపర్కాన్ని మానుకునేందుకు యువకులకు షాక్ ట్రీట్మెంట్ థెరపీని చైనా ఆస్పత్రులు రహస్యంగా నిర్వహిస్తున్నాయి. ఈ అనాగరిక చికిత్సలో భాగంగా యువకుల జననాంగాలు, తలకు విద్యుత్ తీగలను అమర్చి.. పెద్దమొత్తంలో విద్యుత్ షాక్ తరంగాలను ప్రసరింపజేసి.. దీనిని మాన్పించవచ్చునని అవి నమ్మబలుకుతున్నాయి. అత్యంత క్రూరంగా సాగుతున్న ఈ రహస్య చికిత్స పద్ధతుల బండారాన్ని తాజాగా డేట్ లైన్ ప్రొగ్రామ్ అనే సంస్థ బట్టబయలు చేసింది. స్వలింగ సంపర్కాన్ని 'మనో వ్యాధి'గా పేర్కొంటూ చైనాలో గతంలో నిషేధం విధించారు. 15 ఏళ్ల కిందట ఈ చట్టంలో మార్పులు చేసినా.. ఇప్పటికే స్వలింగ సంపర్కాన్ని మానేలా చేస్తామని చైనావ్యాప్తంగా ఉన్న ఆస్పత్రులు రహస్యంగా క్రూరమైన చికిత్సలను కొనసాగిస్తున్నాయి.
ఈ బండారాన్ని వెలుగులోకి తేవడానికి స్వచ్ఛంద కార్యకర్తలు 'గే' రోగులుగా చైనాలోని పలు మానసిక ఆస్పత్రులను సందర్శించారు. జాన్ షెన్ అనే కార్యకర్త తియాన్జిన్ మానసిక చికిత్స ఆస్పత్రిని సందర్శించాడు. అక్కడ తాను స్వలింగ సంపర్కానికి ఆకర్షితుడవుతున్నట్టు తెలుపగా.. అలాంటి ఆలోచనలు కలిగినప్పుడు చిన్నపాటి ఎలక్ట్రిక్ రాడ్ తో తానుకు తానుగా షాకులిచ్చి.. ఆ ఆలోచనలను మానుకోవచ్చునని సైక్రియాట్రిస్ట్ సూచించాడు.
అదేవిధంగా తలకు, జననాంగాలకు షాక్ ట్రీట్ మెంట్ ఇవ్వడంతో ఇలాంటి కోరికలను అణుచుకోవచ్చునని, తనకు ఇష్టమైతే ఈ చికిత్సను కొనసాగిస్తామని వైద్యుడు తెలిపాడు. ఈ క్రూరమైన చికిత్సల వల్ల బాధితులపై దీర్ఘకాలంలో చాలా ప్రతికూల ప్రభావం ఉంటుందని నిపుణులు చెప్తున్నారు. అయితే, ఈ వ్యవహారంలో ఆస్పత్రులపై చర్య తీసుకోవడానికి బదులు ఈ వ్యవహారాన్ని వెలుగులోకి తెచ్చిన కార్యకర్తలపై చైనా పోలీసులు కారాలు మిరియాలు నూరుతున్నారు. వారికి జైలుశిక్ష పడే అవకాశముందని స్థానిక మీడియా పేర్కొంది.