
ఇవీ చైనా నుంచే వచ్చాయి!
చైనా నుంచి బొమ్మలు వచ్చాయి.. చవగ్గా వచ్చాయని సంతోషించాం. గాలిపటాలు వచ్చాయి.. ధర తక్కువ, నాణ్యత ఉందని అనుకున్నాం. చైనా ఫోన్లు వచ్చాయి.. బ్రహ్మాండమైన ఫీచర్లు నామమాత్రపు ధరకే వచ్చాయని సంతోషించాం. అయితే ఇప్పుడు చైనా తన అసలు స్వరూపం బయటపెట్టుకుంది. భారీ స్థాయిలో ఆయుధాలను కూడా భారతదేశంలోకి స్మగుల్ చేస్తోంది. చైనాలో తయారైన ఆయుధాలు భారీ సంఖ్యలో నాగ్పూర్లోని ఓ కిరాణా కొట్టులో దొరికాయి. ఈ కేసులో పోలీసులు ఒకరిని అరెస్టు చేశారు.
ముందుగా అందిన సమాచారం మేరకు ఆ కొట్టుపై దాడి చేయగా.. అక్కడ దాడి చేసిన పోలీసులకు దిమ్మ తిరిగింది. ఏకంగా 102 ఆయుధాలు అక్కడున్నాయి. వాటిలో కత్తులు, కర్రల్లో దాచి ఉంచే కత్తులు, ఖంజర్ (వంపు తిరిగి ఉండే కత్తి)లు, కుక్రీలు (గూర్ఖాల వద్ద ఉండే కత్తులు) వివిధ పరిమాణాల్లో చాకులు కూడా ఉన్నాయి. వాటి విలువ దాదాపు రూ. 50 వేల వరకు ఉంటుందని పోలీసులు చెప్పారు. ఈ దాడిలో వారు రూ. 4.70 లక్షల నగదు కూడా స్వాధీనం చేసుకున్నారు. మహ్మద్ నయీమ్ అబావుద్దీన్ అన్సారీ (49) అనే వ్యక్తిని ఈ ఆయుధాలు అమ్ముతున్నందుకు అరెస్టు చేశారు.