
విమానం ఏమైంది.... నిరాహరదీక్షకు దిగుతాం
మలేషియా విమానం ఏమైందో వెంటనే జవాబు చెప్పాలని, లేకుంటే నిరాహర దీక్షకు దిగుతామని బీజింగ్లోని విమాన ప్రయాణికుల బంధువులు మలేషియా ఉన్నతాధికారులను డిమాండ్ చేశారు. సంగతేంటో బీజింగ్లోని మలేషియా రాయబారి కార్యాలయానికి వెళ్లి తేల్చుకుంటామన్నారు. విమానం ఆచూకీ తెలియకుండా పోయి 10 రోజులు గడుస్తున్నా ఇంత వరకు సరైన సమాచారం లేదని మలేషియా అధికారులపై బీజింగ్ లో ప్రయాణికుల బంధువులు మండిపడ్డారు.
విమానం గల్లంతుపై రోజుకోక వార్త వస్తుంది. ఏది నమ్మాలో నమ్మకూడదో తెలియని సందిగ్ధతలో ఉన్నామని వారు పేర్కొన్నారు. విమానం జాడ ఇంత వరకు కనుక్కోకపోవడంపై వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. విమానం గల్లంతుపై మలేషియా చెబుతున్న కథనాలపై చైనీయులు తీవ్రస్థాయిలో ధ్వజమేత్తారు. మార్చి 8వ తేదీన కౌలాలంపూర్ నుంచి బీజింగ్ బయలుదేరిన మలేషియా విమానం బయలుదేరిన 40 నిముషాలకు ఏటీసీ నుంచి సంబంధాలు తెగిపోయాయి.ఆ విమానంలో 227 మంది ప్రయాణికులు, 12 మంది విమాన సిబ్బంది ఉన్నారు. ప్రయాణికులలో అత్యధికులు చైనీయులు ఉన్న సంగతి తెలిసిందే.
అయితే విమానం ఆచూకీ కోసం దాదాపు 26 దేశాలకు చెందిన విమానాలు,నౌకులు రంగంలోకి దిగాయి. అయిన ఫలితం కనిపించలేదు.ఉపగ్రహాల ద్వారా చిత్రాలను తీసిన అందులో కూడా విమానం జాడ ఏమి కనిపించ లేదు. దాంతో విమానాన్ని హైజాక్ చేసి ఉండవచ్చని మలేషియా అధికారులు అనుమానిస్తున్నారు. ఆ క్రమంలో కూడా దర్యాప్తు జరుగుతుంది. అయితే విమానం ఆచూకీ తెలియకపోవడంతో ప్రయాణికులు బంధువులు ఆందోళన రోజురోజూకు తీవ్రతరం అవుతుంది. విమానం తప్పక తిరిగి వస్తుందని ఇప్పటివరకు వారు కళ్లలో ఒత్తులు వేసుకుని ఏదురు చూశారు. మలేషియా ప్రభుత్వం నుంచి సరైన సమాచారం రాకపోవడంతో ప్రయాణికుల బంధువుల ఆగ్రహం మంగళవారం కట్టలు తెంచుకుంది.